iDreamPost

‘మా’ ట్విస్టులు చూడతరమా.. సీవీఎల్ కూడా బైబై

‘మా’ ట్విస్టులు చూడతరమా.. సీవీఎల్ కూడా బైబై

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించక ముందు నుంచే ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆ తర్వాత మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు అనే విషయం మీడియా తెర మీదకు తీసుకువచ్చింది. వీరిద్దరూ పోటీ చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత జీవిత రాజశేఖర్ హేమా లాంటి వాళ్లు కూడా అధ్యక్ష పదవికి ఆడవాళ్లు ఎందుకు పోటీ చేయకూడదు మేము పోటీ చేస్తాము అని ప్రకటించారు. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఆంధ్ర వారి పెత్తనం ఎక్కువ అయిపోయిందని తెలంగాణ వారి బాధలు పట్టించుకునే నాథుడే లేడు అని చెబుతూ నటుడు, న్యాయవాది సీవీఎల్ నరసింహారావు కూడా తాను అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.

అలా మొత్తం ఐదుగురు అభ్యర్థులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని అందరూ భావించారు. ప్రకాష్ రాజ్ సామ దాన భేద దండోపాయాలతో జీవితా రాజశేఖర్, హేమ ఇద్దరిని కూడా తనకు అనుకూలంగా మలుచుకుని తన ప్యానల్ లోనే రెండు కీలక పదవులు నుంచి పోటీ చేస్తున్నారు. జీవిత రాజశేఖర్ కి జనరల్ సెక్రటరీగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో అది నచ్చని బండ్ల గణేష్ బయటకు వెళ్లి స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేశారు. తనదైన శైలిలో ప్రచారం కూడా చేసుకుంటూ నిన్న అనూహ్యంగా నామినేషన్ ఉపసంహరించుకుంటూ సంచలన ప్రకటన చేశారు. తన శ్రేయోభిలాషులు మిత్రులు కోరిక మేరకు ఇలా ఉపసంహరించుకున్నా అని చెప్పిన తర్వాత ఒక మీడియా చానెల్తో మాట్లాడుతూ మహాసంగ్రామం జరుగుతున్న సమయంలో తాను పోటీ చేసి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తారని భావిస్తున్న తరుణంలో సీవీఎల్ నరసింహ రావు తన నామినేషన్ వెనక్కి తీసుకుంటూ ఆసక్తికర ప్రకటన చేశారు. నిజానికి ఆయన ఈ ఉదయం మేనిఫెస్టో కూడా విడుదల చేశారు.. కాసేపటికి ఏమైందో ఏమో దాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అసలు ఏం జరిగింది? తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, ఏంటి? అనే వివరాలు మరో రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. తనకు అధికారం కంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం ముఖ్యం అని చెప్పుకొచ్చిన ఆయన ప్రస్తుతం రెండు ప్యానల్స్ లో ఎవరికీ తాను మద్దతు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా పదో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి.

Also Read : వెనక్కి తగ్గిన బండ్ల.. వారి కోరిక మేరకేనట!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి