iDreamPost

MAA President : మా’ స్వీకారం పూర్తి – అసలు సవాళ్లు ఇప్పుడే

MAA President  : మా’ స్వీకారం పూర్తి – అసలు సవాళ్లు ఇప్పుడే

ఇవాళ మంచు విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అధికారిక హోదాలో ప్రమాణ స్వీకారం పూర్తి చేశాడు. కౌంటింగ్ రోజు వరకు విపరీతమైన వివాదాలు, పరస్పర దూషణలతో ఊగిపోయిన ఈ వ్యవహారం ఇకనైనా చల్లారాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిధిగా విచ్చేయగా రాజీనామా చేసిన ఈసి సభ్యులు ఎవరూ రాకపోవడం గమనార్హం. ప్రభుత్వం తరఫున ఎలాంటి హామీలు రాలేదు కానీ వారం రోజుల తర్వాత కీలకమైన అంశాల గురించి చర్చించుకుందామని మాత్రం మినిస్టర్ నుంచి మాట వచ్చింది. సో అతి త్వరలో ఒక మీటింగ్ ఉండొచ్చు.

ఇక ఎలాంటి పదవి హోదా లేకపోయినా విష్ణు తండ్రిగా వచ్చిన మోహన్ బాబు కాస్త ఎక్కువ సేపే ప్రసంగించారు. ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా కౌంటర్లు సామెతలు గట్టిగానే పడ్డాయి. అవి మెగా కాంపౌండ్ మీదనా లేక ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీదనా అనేది అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత అన్న రీతిలో సాగింది. కాకపోతే మరీ మీడియాకు మసాలా ఇచ్చే రేంజ్ లో కాకుండా జాగ్రత్తగా అన్యాపదేశంగా మాట్లాడారు. ఇకపై ఎవరూ టీవీ ఛానల్స్ కు వెళ్లి రచ్చ చేయొద్దని కూడా హితవు పలికారు. ఇక విష్ణుతో సహా మిగిలిన సభ్యులు అఫీషియల్ ప్రాసెస్ ప్రకారం తమ ప్రమాణ స్వీకారం చేశారు.

బాలకృష్ణను ఆహ్వానించినా ఆయన రాలేదు. చిరంజీవికి అసలు ఆహ్వానమే వెళ్లలేదని ఇన్ సైడ్ టాక్. కృష్ణ తరఫున ఆయన సోదరుడు ఆదిశేషగిరి రావు రాగా అల్లు అరవింద్, సురేష్ ఫ్యామిలీ, కృష్ణం రాజు, ఇప్పటి జెనరేషన్ స్టార్ హీరోలు, మంచు విష్ణు ప్రాణ స్నేహితులుగా చెప్పుకునేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. అందరిని పిలిస్తే హడావిడి అవుతుందనుకున్నారో లేక ఎందుకొచ్చిన ఇబ్బందిలెమ్మని ఆర్టిస్టులు దీనికి దూరంగా ఉన్నారో అర్థం కాలేదు. అసలైన సవాల్ విష్ణుకు ఇకపై ఉంది. హామీలను పరిష్కరించే దిశగా వేగంగానే అడుగులు వేయాల్సి ఉంటుంది. లేకపోతే విమర్శలు వచ్చి పడతాయి. మాట్లాడిన ప్రతి మాట మీడియా, యుట్యూబ్ వీడియోలలో భద్రంగా ఉంది కాబట్టి అప్పుడు నేనలా అనలేదని రాజకీయ నాయకుల్లా మాట మార్చలేడు. సో ఎంతలోపు తీరుస్తారనేది ఆసక్తికరం

Also Read : Day 1 Collections : మొదటి రోజు బ్యాచిలర్ సందడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి