iDreamPost

పోటీకి ముందే కాడెత్తేసిన కామ్రేడ్లు

పోటీకి ముందే కాడెత్తేసిన కామ్రేడ్లు

ఒకప్పుడు బెంగాల్ కమ్యూనిస్టులకు కంచు కోట. దశాబ్దాల పాటు ఎదురులేని శక్తిగా రాజ్యమేలిన కమ్యూనిస్టుల ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మమతా బెనర్జీ రాజకీయ వ్యూహాల ముందు కమ్యూనిస్టు పార్టీలు కుప్పకూలక తప్పలేదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. కనీసం కమ్యూనిస్టు పార్టీలు ప్రధాన పక్ష హోదాను కూడా నిలబెట్టుకోలేని స్థాయికి దిగజారిపోయాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీ దూకుడు తోడవ్వడంతో ఎర్రజెండా రెపరెపలకు రెడ్ సిగ్నల్ పడ్డట్లయ్యింది.

దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా బెంగాల్ ని ఏలిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు నాయకత్వ కొరతతో సతమతమవుతున్నాయి. జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీ లాంటి నేతల మరణంతో ఆ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది. లెఫ్ట్ పార్టీలను బలహీన పర్చడంలో మమతా దీదీ ప్రయోగించిన వ్యూహాలు ఫలించి అధికారం తృణమూల్ చేతికి మారింది. ప్రతి పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడంలో లెఫ్ట్ పార్టీలు విఫలమయ్యాయి. ఫలితంగా రోజు రోజుకూ శక్తి సన్నగిల్లుతూ నామమాత్రంగా మిగిలారు కమ్యూనిస్టులు.

త్వరలోనే బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. గతంలో లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. ఇప్పుడు సీన్ తృణమూల్ వర్సెస్ బీజేపీగా మారింది. కమ్యూనిస్టులు బలహీన పడడంతో బీజేపీ బలం పుంజుకుంది. ఇప్పుడు ఏకంగా అధికారం కోసమే బీజేపీ పోటీపడుతోంది. కానీ ఒకప్పుడు బెంగాల్ లో అజేయశక్తిగా నిలిచిన లెఫ్ట్ పార్టీలు మాత్రం ఉనికిని కాపాడుకోవడానికే కష్టపడుతున్నాయి. తాజాగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ఓవైపు అధికార తృణమూల్, బీజేపీలు ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి. కానీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఆదిలోనే చేతులెత్తేశాయి. కమ్యూనిస్టు నేతలు తమపై తమకే విశ్వాసం లేనట్లు మాట్లాడుతుండడం ఆశ్చర్యానికిగురిచేస్తోంది. తాజాగా కోల్‌కతాలో జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆ పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

రాష్ట్రంలో క్రమంగా వేళ్లూనుకుంటున్న బీజేపీ అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలకూ గండి కొడుతోంది. తాజాగా బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలలో సీపీఐ ఎమ్మెల్యే అశోక్‌ దిండా కూడా ఉండడం గమనార్హం. సైద్ధాంతికంగా పూర్తి విరుద్ధమైన బీజేపీలోకి కమ్యూనిస్టు నేతలు మారుతుండడం ఆసక్తికరమైన విషయం. ఈ పరిణామాలు కమ్యూనిస్టులకు రాష్ట్రంలో ఏమాత్రం బలంలేదనే సంకేతాలిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తమ శ్రేణులనే కాపాడుకోలేని కమ్యూనిస్టులకు ఇప్పుడు ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోవడం సవాల్ గా మారింది. అందుకే… గెలుపుపై ధీమా కంటే, బీజేపీ ఓటిమే మా లక్ష్యమంటూ ప్రకటించారు సీతారాం ఏచూరి. మొత్తానికి బెంగాల్ కమ్యూనిస్టుల పరిస్థితి బండ్లు ఓడలవ్వడం, ఓడలు బండ్లవ్వడం సామెతను గుర్తు చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి