iDreamPost

మమత ప్రతిపాదన బాగుంది.. సీఈసీ పాటిస్తుందా..?

మమత ప్రతిపాదన బాగుంది.. సీఈసీ పాటిస్తుందా..?

ఎన్నికలైనా.. రాజకీయాలైనా.. ప్రజలు బాగుకోసమే. అత్యవసర పరిస్థితులలో తప్పా.. ఎన్నికల నిర్వహణను వాయిదా వేయడం సాధ్యం కాదు. కానీ కొన్ని మార్పులు చేయవచ్చు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న తరుణంలో.. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ముందు ఓ మంచి ప్రతిపాదన పెట్టారు.

కరోనా కట్టడికి చివరి మూడు దశల ఎన్నికలకు ఒకే రోజు పోలింగ్‌ నిర్వహించాలని మమతా బెనర్జీ సీఈసీకి విజ్ఞప్తి చేశారు. ఒక రోజులో సాధ్యం కాకపోతే.. రెండో రోజుల్లో నిర్వహించాలని ఆమె కోరారు. ప్రజల ప్రాణాల దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని మమత విజ్ఞప్తి చేశారు. చివరి మూడు దశలకు ఒకే సారి పోలింగ్‌ నిర్వహిస్తే.. వైరస్‌ వ్యాప్తి కొంతమేరైనా తగ్గుతుందనేది మమత బెనర్జీ ఆలోచన.

Also Read : మళ్లీ లాక్ డౌన్ అనివార్యమా, ఢిల్లీ అనుభవం ఏం చెబుతోంది..

మమత ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తోంది. కారణాలు ఏమైనా బెంగాలోని 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చెరితోపాటు బెంగాల్‌ శాసన సభకు ఎన్నికలు నిర్వహించేందుకు మార్చిలో షెడ్యూల్‌ విడుదల చేసింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు సహా కేరళ, పాండిచ్చెరి అసెంబ్లీలకు ఒకే దఫాలో ఈ నెల 6వ తేదీన పోలింగ్‌ నిర్వహించిన సీఈసీ.. 126 స్థానాలు ఉన్న అస్సాంలో మూడు దశల్లోనూ, బెంగాల్‌లో 8 దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తోంది.

తొలి దశలో 30, రెండో దశలో 30, మూడో దశలో 31, నాలుగో దశలో 44, ఐదో దశలో 45, ఆరో దశలో 43, ఏడో దశలో 36, ఎనిమిదో దశలో 35 సీట్లకు పోలింగ్‌ నిర్వహించాలని సీఈసీ తలపెట్టింది. ఇప్పటికి మొదటి ఐదు దశల పోలింగ్‌ ముగిసింది. చివరి మూడు దశల పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ నెల 22న ఆరో దశ, 26వ తేదీన ఏడో దశ, 29వ తేదీన చివరిదైన 8వ దశకు పోలింగ్‌ జరగనుంది. ఈ మూడు దశల్లో 114 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది.

ఈ మూడు దశలను కలిపి ఈ నెల 26వ తేదీన ఒకేసారి పోలింగ్‌ నిర్వహించాలనేది దీదీ ప్రతిపాదన. తద్ఫలితంగా వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని మమత భావిస్తోంది. పోలింగ్‌పై సీఈసీకి సలహాలు ఇవ్వడడమే కాదు.. తన ప్రచార షెడ్యూల్‌ను మమత కుదించుకున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. మరి మమత ప్రతిపాదనను సీఈసీ పరిగణలోకి తీసుకుంటుందా..?

Also Read : కరోనాపై పోరు : ఏపీలో స్కూల్స్ బంద్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి