iDreamPost

నాలుగో దశలో హింస.. బెంగాల్లో రాజకీయ రగడ..

నాలుగో దశలో హింస.. బెంగాల్లో రాజకీయ రగడ..

తీవ్ర ఉద్రిక్తతలు, సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య గరం గరంగా జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ పోలింగ్ లో చెలరేగిన హింస మరింత ఆజ్యం పోసింది. కుచ్ బిహార్ జిల్లాలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందడం, మరికొన్ని ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై టీఎంసీ, బీజేపీలు పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ, సీఎం మమత సైతం ఈ ఘటనలపై స్పందిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

కాగా కాల్పుల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది.

కేంద్ర బలగాల కాల్పుల్లో ఐగురు.. మరో ఘటనలో ఒకరు

బెంగాల్లో ఇప్పటికే మూడు దశల్లో 91 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద ప్రశాంతంగా నే పోలింగ్ జరిగింది. నాలుగో విడతలో శనివారం 44 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండటాన్ని గమనించిన ఎన్నికల సంఘం 80వేల కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

కాగా ఉదయం 11 గంటల సమయంలో కుచ్ బీహార్ జిల్లా సీతల్ కుచి నియోజకవర్గంలోని 126వ పోలింగ్ కేంద్రంలో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో కేంద్ర బలగాలు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. మరో ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద లైనులో ఉన్న ఓటర్లపైకి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. హుగ్లీ జిల్లాలో పోలింగ్ పరిశీలనకు వెళ్లిన బీజేపీ నేత లాకెట్ చటర్జీపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసి.. ఆమె కారు అద్దాలు ధ్వంసం చేశారు.

కుచ్ బీహార్ కాల్పుల ఘటన రాజకీయ కాక రేపుతోంది. 126వ పోలింగ్ కేంద్రాన్ని బీజేపీ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నారని.. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ కార్యకర్తలపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని టీఎంసీ ఎంపీ డేరిక్ ఒబ్రియన్ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

సీఎం మమతా బెనర్జీ కూడా కాల్పులను తీవ్రంగా ఖండించారు. మృతిచెందిన వారు తమ పార్టీ కార్యకర్తలేనని.. కేంద్ర బలగాలను అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆదివారం ఘటనాస్థలానికి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ సైతం కాల్పుల ఘటనపై స్పందిస్తూ విచారం వ్యక్తంచేశారు. మమతా బెనర్జీ తీరు వల్లే ఎన్నికల్లో హింస రేగుతోందని ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదుకు బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు.

పట్టు కోసం పోరాటం

నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్న హావడా, కుచ్ బీహార్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, అలిపురద్వారా జిల్లాల్లో తన పట్టు నిలుపుకొనేందుకు టీఎంసీ, పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న రాజకీయ పోరాటం హింసాత్మకంగా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో తృణమూల్ కు మంచి పట్టు ఉండేది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని అత్యధిక స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా దూసుకొచ్చినా టీఎంసీ పట్టు కాపాడుకోగలిగింది.

అయితే ఆ తర్వాత అనేక మంది టీఎంసీ నేతలు బీజేపీలో చేరిపోవడంతో టీఎంసీ కాస్త బలహీనపడింది. ఎన్నికల్లో విజయం సాధించి తన పట్టు సడలలేదని నిరూపించాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకుని టీఎంసీకి చెక్ పెట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈ రెండు పార్టీల ఆరాటం.. పోరాటంగా మారి హింసకు తావిచ్చింది.

Also Read : నేడే నాలుగో దశ పోలింగ్‌.. దీదీ ఈసీకి సమాధానం చెప్పాలట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి