iDreamPost

చైనా చిక్కుల్లో ప‌డుతుందా..! చాక‌చ‌క్యం చాటుతుందా

చైనా చిక్కుల్లో ప‌డుతుందా..! చాక‌చ‌క్యం చాటుతుందా

క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆర్థిక‌, రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దానికి అనుగుణంగా అడుగులు ప‌డుతున్నాయి. ముఖ్యంగా సుదీర్ఘ‌కాలంగా అగ్ర‌రాజ్యంగా వెలుగుతున్న అమెరికా ఆగ్ర‌హావేశాలు ప‌రిశీలిస్తే చైనా చుట్టూ రాజ‌కీయం మ‌ళ్ళుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను చైనా ఎలా ఎదుర్కుంటుంద‌న్న‌దే కీల‌కాంశంగా మార‌బోతోంది.

అంత‌ర్జాతీయ రాజ‌కీయాల్లో రెండో ప్ర‌పంచ‌యుద్ధం త‌ర్వాత అమెరికా ముందుకొచ్చింది. అప్ప‌టికే జ‌పాన్ పై అణుబాంబులు ప్ర‌యోగించి అందరి దృష్టిలో నైతికంగా దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ యుద్ధంలో ఆయుధాల అమ్మ‌కం ద్వారా, పరిమితంగా యుద్ధంలో భాగ‌స్వామి కావటంతొ అమెరికాకు అగ్ర‌పీఠం ద‌క్కడానికి దోహ‌ద ప‌డింది. కేవ‌లం పెర‌ల్ హార్బ‌ర్ మీద వేసిన బాంబులు మిన‌హా ఆ యుద్ధంలో అమెరికాకు ఎటువంటి న‌ష్టం లేదు. పైగా ఆర్థికంగా బ‌ల‌ప‌డింది. అది ఆ దేశ ప్ర‌యోజ‌నాల‌కు ఎంతో మేలు చేసింది. యూఎన్ఓ ఏర్పాటు, ప్ర‌పంచ‌బ్యాంక్, ఐఎంఎఫ్ వంటివి స్థాప‌న ద్వారా ప్ర‌పంచ‌మంతా త‌న పెత్త‌నాన్ని చాటుకునేందుకు అవ‌కాశం వ‌చ్చింది. సోవియ‌ట్ కి వ్య‌తిరేకంగా నాటో క్యాంప్ స‌హకారంతో సైనికంగా బ‌ల‌ప‌డేందుకు ఉప‌యోగ‌ప‌డింది. ఇక 1990ల నాటికి సోవియ‌ట్ క‌నుమ‌రుగు కావ‌డంతో ఏక‌ప‌క్షంగా ప్ర‌పంచాన్ని శాసించే స్థాయిని ద‌క్కించుకుంది.

ఇక నాలుగు ద‌శాబ్దాల ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం, మూడు ద‌శాబ్దాల ఏక‌ఛ‌త్రాధిప‌త్యం త‌ర్వాత తొలిసారిగా అమెరికాకు పెద్ద స‌వాల్ ఎదుర‌వుతోంది. క‌రోనా కార‌ణంగా ఎదుర‌యిన ప‌రిణామాలు అమెరికాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తొలుత అప్ర‌మ‌త్తం కావ‌డంలో ట్రంప్ ప్ర‌భుత్వం చేసిన ఘోర త‌ప్పిదాలు అమెరికా మెడ‌కు చుట్టుకున్నాయి. పౌరుల ప్రాణాల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. నిత్యం వేల‌సంఖ్య‌లో క‌రోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. అదే స‌మ‌యంలో నిరుద్యోగం పెర‌గ‌డం, ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డం వంటి అనేక కార‌ణాల‌తో అమెరికా అత‌లాకుత‌లం అవుతోంది. చివ‌ర‌కు లాక్ డౌన్ కి వ్య‌తిరేకంగా జ‌నం రోడ్డెక్కే ప‌రిస్థితిని తీసుకొచ్చిన ట్రంప్ విధానాలు అమెరికాకు అతి పెద్ద న‌ష్టాన్ని చేకూర్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని పలువురు అంచ‌నా వేస్తున్నారు.

అదే స‌మ‌యంలో చైనా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప్ర‌మాదాన్ని గుర్తించి ప్ర‌పంచాన్ని హెచ్చ‌రించ‌డంలో చైనా చూపిన నిర్ల‌క్ష్యం ఇప్పుడు అంద‌రి మెడ‌కు చుట్టుకుంది. అయితే అదంతా ఉద్దేశపూర్వ‌కంగానే జ‌రిగింద‌నే విమ‌ర్శ‌ల‌కు చైనా జ‌వాబు చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా మృతుల సంఖ్య‌ను వెల్ల‌డించ‌డంలో గోప్య‌త పాటించ‌డం చైనా ప‌ట్ట అనుమానాలు పెంచుతోంది. అదే స‌మ‌యంలో వ‌స్తు ఉత్ప‌త్తి రంగంలో చైనాకి ఉన్న అడ్వాంటేజ్ ని ఉప‌యోగించుకుని ఆర్థికంగా పై చేయి సాధించాల‌ని ఆశిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. చాలాకాలంగా సూప‌ర్ ప‌వ‌ర్ స్థానం కోసం వేచి చూస్తున్న చైనా ఇప్పుడు వేగంగా పావులు క‌దుపుతోంది.ఇప్ప‌టికే ఇండియాలో హెడ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో చైనీస్ నేష‌న‌ల్ బ్యాంక్ పెట్టుబ‌డులు దానికి త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంస్థ‌ల ద్వారా ఇండియా స‌హా అనేక ద‌శాల షేర్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఓవైపు ఆర్థికంగా హ‌వా సాగించాల‌ని చైనా ఆశిస్తుంటే రెండోవైపు ఆదేశానికి వ్య‌తిరేకంగా స్వ‌రాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ట్రంప్ చైనా మీద ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వూహాన్ వైరాల‌జీ ల్యాబ్ మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే ట్రంప్ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికే ఇలాంటి య‌త్నాలు అనే అభిప్రాయం బ‌లంగా ఉంది. చివ‌ర‌కు డ‌బ్ల్యూ హెచ్ ఓ కి నిధులు కేటాయించ‌బోమ‌ని చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇస్తోంది. అయితే ట్రంప్ కి తోడుగా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ముందుకొచ్చింది. మ‌రికొన్ని దేశాల్లో కూడా చైనా ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. త‌ద్వారా చైనాని కార్నర్ చేసేందుకు అమెరికా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు అవ‌కాశాలు క‌లుగుతున్నాయి. ఇవ‌న్నీ క‌లిసి చివ‌ర‌కు చైనాని చిక్కుల్లో నెడ‌తాయా లేక చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి చైనా త‌న ఆధిప‌త్యానికి బీజం వేసుకుంటుందా అన్న‌ది రాబోయే రోజుల్లో తేల‌బోతోంది. ఏమ‌యినా ఇప్పుడు ప‌రిణామాలు మాత్రం రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత అమెరికా చుట్టూ తిరిగిన‌ట్టే తాజాగా చైనా కేంద్రంగా మారుతున్నాయ‌నేది చ‌ర్చనీయాంశం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి