iDreamPost

ముప్పు ముంగిటే 90 శాతం మంది

ముప్పు ముంగిటే 90 శాతం మంది

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ భారిన పడ్డవారి సంఖ్యకంటే ఎన్నో రెట్లు ఈ వ్యాధి వ్యాపించినట్టు తమ వద్ద అంచనాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ టెడ్రోస్‌ తేల్చిచెప్పేసారు. ఇటీవల జరిగిన డబ్లు్యహెచ్‌వో బోర్డు మీటింగ్‌ ఈ మేరకు సంస్థ ప్రతినిధులు తమతమ నివేదికలను వెల్లడించారట. వీరి లెక్కల ప్రకారం 760 కోట్లకుపైగా ఉన్న ప్రపంచ జనాభాలో పదిశాతం మంది ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ భారిన పడ్డారని తేల్చారట. ఈ లెక్కన ఇంకా 90శాతం మందికి ఈ వైరస్‌ వచ్చేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది భయపెట్టడానికో, ఆందోళన పెంచడానికో కాదని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీమళ్ళీ చెప్పడంలాంటిదేనని వారు అభిప్రాయపడుతున్నారు.

దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, జన సమూహాలను బట్టి వ్యాప్తి విషయంలో నిపుణులు చెబుతున్నదానికి ఖచ్చితమైన అంచనాలున్నాయని టెడ్రోస్‌ మాటలను బట్టి తెలుస్తోంది. ప్రపంచ దేశాలు పాజిటివ్‌ల సంఖ్యను ప్రస్తుతం ధృవీకరిస్తున్న దాని కంటే దాదాపు ఇరవైరెట్లు అధికంగానే ఉంటుందంటున్నారు.

ఇదిలా ఉండగా లాక్డౌన్‌లు ఎత్తివేస్తే వైరస్‌ మొత్తం లేనట్టుకాదని, వ్యవస్థలకు ఇబ్బందుల్లేకుండా మాత్రమే ఎత్తివేతను చూడాల్సి ఉంటుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయం ఎటువంటి నిర్లక్ష్యం పనికిరాదని తేల్చిచెబుతున్నారు. ప్రస్తుతం డబ్లు్యహెచ్‌వో వేసిన లెక్కల ప్రకారం ప్రతి పదిమందిలోనూ ఒకరు కరోనా వైరస్‌ భారిన పడ్డారన్నమాట.

ఇదిలా ఉండగా ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య సోమవారం నాటికి గణనీయంగా తగ్గి 4,254. ఒక దశలో లక్షదాటేస్తాయనుకున్న యాక్టివ్‌కేసులు యాభైఒక్కవేలకు మాత్రమే పరిమితమైపోయాయి. దీంతో ఏపీలో 7,23,512 మందికి పాజిటివ్‌ సోకినట్టు గుర్తించగా వారిలో 6,63,538 మంది కోలుకున్నట్టు ప్రభుత్వ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యధిక కేసులు గుర్తించిన రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ యాక్టివ్‌ కేసుల్లో మాత్రం ఏపీ నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు మొత్తం 6,019 మంది కోవిడ్‌కారణంగా మృత్యువాత పడ్డారు. అయితే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా నమోదవుతున్న పాజిటివ్‌కేసులను బట్టి ఏపీలో కోవిడ్‌ గణనీయంగా తగ్గుతోందన్న అంచనాలు వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి