iDreamPost

బాధ్యత నుంచి తప్పించుకుంటే ఎలా..?

బాధ్యత నుంచి తప్పించుకుంటే ఎలా..?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. ముందుగానే లాక్‌డౌన్‌ చేసిన కారణంగా మన దేశంలో ఆ మహమ్మరి ప్రభావం తక్కువగా ఉంది. లేదంటే జరిగే నష్టం ఊహించుకుంటేనే ఒళ్లుజలదరిస్తోంది. 130 కోట్ల మందిని ఇళ్లలోనే పెట్టిన ప్రధాని మోదీ.. కరోనాపై ప్రాధమికంగా విజయం సాధించారు. కనిపించని, బలమైన శత్రువు కరోనా వైరస్‌ అని దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చెబుతోంది.

అనుమానితులకు పరీక్షలు చేసే కొద్దీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఎక్కువ మందికి పరీక్షలు చేయడంలేదని విమర్శిస్తున్నారు. పరీక్షలు చేస్తే.. మరింత అప్రమత్తంగా ఉండొచ్చని, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందు కోసం అధిక సంఖ్యలో కరోనా పరీక్షల ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

అధిక సంఖ్యలో యుద్ధ ప్రాతిపదికన ల్యాబ్‌లు ఏర్పాటు చేయడం పక్కనపెట్టిన కేంద్ర ప్రభుత్వం కరోనా పరీక్ష పైవేటు ల్యాబ్‌ల్లో కూడా చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు, ఫీజును నిర్ణయించే పనిలో పడింది. ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా నిర్థారణ పరీక్ష ఫీజుగా 4500 రూపాయలు తీసుకొవచ్చని నిర్ణయించింది. ప్రజా సంక్షేమం, ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం దాన్ని ప్రైవేటు ల్యాబ్‌లకు అప్పగిస్తూ వ్యాపారంగా మార్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా వైరస్‌ ధనిక, పేదా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సోకుంది. అది సోకిందని తెలుసుకునేందుకే రోజుల సమయం పడుతుంది. కరోనా లక్షణాలు.. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు మాదిరిగా ఉండడంతో ప్రజలు దాన్ని సీరియస్‌గా తీసుకోరు. తమ సమీపంలోని ఆర్‌ఎంపీ, ఇతర వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటారు. ఒక వేళ రోగం ముదిరిన తర్వాత పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినా.. కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్ష చేయించుకునే స్థోమత భారత్‌ దేశంలో ఉన్న ప్రజల్లో ఎంత శాతం మందికి ఉంటుందనే సులువుగా చెప్పవచ్చు. ప్రజలు నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లే సమయానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది. వారి నుంచి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు.. వారి నుంచి మరొకరికి ఇలా వైరస్‌ చుట్టుముడుతుంది.

అందుకే కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు ప్రభుత్వమే చేయాలని నిపుణులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయ స్థానాలను ఆశ్రయిస్తున్నారు. కరోనా పరీక్షలు ప్రభుత్వమే చేయాలని, మరిన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త శశాంక్‌ దేశ సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని ప్రజలు ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి దేశంలో ఉండడం గర్హనీయం. కరోనా వైరస్‌ దేశంలో ఇంకా ఎన్ని రోజులుంటుందో నిపుణులే కాదు దేశ ప్రధాని కూడా చెప్పలేని స్థితి. కాబట్టి ముందు జాగ్రత్తగా ల్యాబ్‌లు, డాక్టర్లు, సిబ్బందికి రక్షణ సామాగ్రి, శాశ్వత ప్రాతిపదికన ఐసోలేషన్‌ సెంటర్లు, ఆస్పత్రులు నిర్మించాల్సిన అవసరం దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో అవసరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి