iDreamPost

కరోనా ఎఫెక్ట్‌.. జీతాలు,వేతనాల్లో కోత విధించిన తెలంగాణా ప్రభుత్వం

కరోనా ఎఫెక్ట్‌..  జీతాలు,వేతనాల్లో కోత విధించిన తెలంగాణా ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కరోనా ఎఫెక్ట్‌ గట్టిగానే పడింది. ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరితో పాటు సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అఖిలభారత సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించనున్నారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధించనున్నారు.

కరోనా వైరస్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించింది. లాక్‌డౌన్‌ చేయడంతో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నెల రావాల్సిన 12 వేల కోట్ల రూపాయలు ఆదాయం కరోనా వల్ల రాలేదని నిన్న ఆదివారం సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు నిధుల కోసం అవసరమైతే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాలు నిలిపివేస్తామని చెప్పారు. ఇది జరిగి 24 గంటలలోపే ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి