iDreamPost

ఒకటవ తారీఖ్ వస్తుందంటే అందరు ఎదురు చూసేది వారి కోసమే

ఒకటవ తారీఖ్  వస్తుందంటే అందరు ఎదురు చూసేది వారి కోసమే

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు విభాగాల వ్యక్తులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచిన జగన్ వాటిని విలేజ్ వలంటీర్ల ద్వారా లబ్ది దారుల ఇంటి వద్దే పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు .

ఆ మేరకు ప్రతినెలా ఒకటవ తారీఖు ఉదయాన్నే వృద్ధుల , దివ్యంగుల , వితంతు పింఛన్లను బయో మెట్రిక్ సిస్టం ద్వారా లబ్ది దారుల వేలి ముద్ర తీసుకొని వారి ఇంటి వద్దే పంపిణీ చేయసాగారు .

అయితే ఈ నెల కరోనా వైరస్ ప్రభావం మూలంగా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇస్తారా లేదా అన్న సందిగ్ధం ఈ ఉదయం వరకు నెలకొనింది. అయితే వృద్ధులు , దివ్యాoగులు లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడకూడదని వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న బయో మెట్రిక్ వేలి ముద్ర నిబంధన నిలిపివేసి సామాజిక దూరం పాటిస్తూ లబ్ది దారుల సంతకం తీసుకొని పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది .

అందుకనుగుణంగా వాలంటీర్స్ కూడా 51.58 లక్షల లబ్ది దారులకు పింఛన్ పంపిణీ చేసే లక్ష్యంతో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు 51.30 లక్షల మందికి అంటే దాదాపు 88 శాతం పెన్షన్లను ఇల్లిల్లూ తిరిగి అందజేశారు . అదే సమయంలో ఆయా గృహాల్లో బయట నుండి కొత్తగా వచ్చిన వారి గురించి , అనారోగ్య లక్షణాలున్న వారి గురించి ఆరా తీసి ప్రభుత్వానికి సమాచారం చేరవేసే ప్రక్రియ సైతం నిర్వహించారు .

గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు రాజకీయ , వర్గ ప్రమేయాలని బట్టి లబ్దిదారుల్ని ఎంపిక చేశారని , అంతే కాకుండా పెన్షన్లు అందుకోవటానికి గ్రామంలోని లబ్ధిదారులు అందరూ ఉదయాన్నే ఒకచోటకి చేరుకొని జన్మభూమి కమిటీల వారు వచ్చి ఇచ్చేవరకూ గంటల తరబడి ఎదురు చూసేవారమని ఇంకా పలు వేధింపులు కూడా ఎదుర్కొన్నామని , ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక ఏ విధమైన ఒత్తిడులు లేకుండా నిజమైన అర్హులని గుర్తించి ఇంటి వద్దే పింఛన్ అందిస్తున్నారని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

అంతే కాక తమ గ్రామానికి చెందిన యువతకి వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వారి ద్వారా అన్ని పథకాల ఫలాలు మా ఇంటి వద్దకే చేరుస్తూ మాకు చేయూతనిస్తున్నారని ఇలా మా ఊరి యువత ఉపాధి పొందుతూ మాకు ఆసరా కావడం ఆనందంగా ఉందని ఇంత మేలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని కొందరు వృద్ధులు పేర్కొనడం విశేషం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి