iDreamPost

వానాకాలం అల‌ర్ట్ “క‌రో”నా..!

వానాకాలం అల‌ర్ట్ “క‌రో”నా..!

ఐదు రెట్లు శ‌క్తివంత‌మైన వైర‌స్‌!!

దేశ వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మ‌రి విస్త‌రిస్తూనే ఉంది. పెరుగుతున్న కేసుల‌తో క‌ల్లోలం రేపుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే 3, 00, 327 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. సుమారు 8, 600 మంది మృతి చెందారు. చిన్నా, పెద్దా.. అంద‌రినీ క‌బ‌ళిస్తోంది. డాక్ట‌ర్… యాక్ట‌ర్.., పోలిటిషియ‌న్.. పోలీస్.. అన్ని రంగాల వారూ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైర‌స్ విజృంభిస్తూనే ఉంది. తెలంగాణ‌లో 11వ తేదీన రికార్డు స్థాయ‌లో 209 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,320 కి చేరాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హ‌మ్మారికి 165 మంది బ‌ల‌య్యారు. అలాగే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 182 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసులు 5,429కు చేరాయి. ఈ రాష్ట్రంలో మ‌ర‌ణాల రేటు కాస్త త‌క్కువ‌గా ఉండ‌డం కాస్త కుదుట‌ప‌డే విష‌యం. ఇప్ప‌టి వ‌ర‌కూ 80 మంది మృతి చెందారు.

క‌ఠిన‌మైన లాక్ డౌన్… విప‌రీత‌మైన ఎండ‌లు.. ఆ స‌మ‌యంలోనూ క‌రోనాను ఏమీ చేయ‌లేక‌పోయాయి. ఇప్పుడు వాతావ‌ర‌ణం మారింది. వ‌ర్షాలు కురుస్తున్నాయి. చ‌ల్ల‌గాలులు వీస్తున్నాయి. దీంతో ముసురు కాలంలో ఎక్కువ ముప్పు పొంచి ఉంద‌ని వైద్యులు, అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. అధ్య‌య‌నాలు కూడా అదే చెబుతున్నాయి.

ప్ర‌స్తుతం వైర‌స్ శ‌క్తివంతం అవుతోంద‌ని తాజాగా ఐఐటీ – బాంబే జ‌రిపిన ఓ అధ్య‌య‌నంలో తేలింది. తేమ వాతావ‌ర‌ణంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుగ‌డ స‌మ‌యం ఐదు రెట్లు పెరుగుతుంద‌ని అధ్య‌య‌న‌కారులు వెల్ల‌డించారు.

పాజిటివ్ రోగి తుమ్మిన‌ప్పుడు లేదా.. ద‌గ్గిన‌ప్పుడు అత‌ని నోటి నుంచి వెలువ‌డే తుంప‌రులు తేమ వాతావ‌ర‌ణంలో వెంట‌నే ఆవిరి కావ‌ని, ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. వేడి, పొడి వాతావ‌ర‌ణంలో త‌క్కువ స‌మ‌యంలోనే అవిరి అయిపోయే ఆ తుంప‌రులు తేమ వాతావ‌ర‌ణంలో అధిక స‌మ‌యం ఆవిరి కాకుండా ఉండ‌డం ప్ర‌మాద‌క‌ర సంకేతాల‌ని పేర్కొన్నారు. తుంప‌రులు ఆవిరి కాక‌పోతే.. వాటిలోని వైర‌స్ కూడా బ‌తికే ఉంటుంద‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఆ తుంప‌రులు ప‌డిన వ‌స్తువులను తాకినా కానీ.., ర‌క్ష‌ణ ఏర్పాట్లు లేకుండా స‌మీపంలో ఉన్న గానీ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకే ప్ర‌మాదం ఎండాకాలంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండాలంటే…

వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఉండ‌డ‌మే ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా మారాలి. త‌న‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌కు మ‌హ‌మ్మారి వ్యాపించ‌కుండా చూసుకోవాలి. ప్ర‌స్తుతానికి భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం, వీలైనంత వ‌ర‌కూ స‌మూహాల్లోకి వెళ్ల‌క‌పోవ‌డం వంటివి త‌ప్ప‌కుండా చేయాల్సిన ప‌నులు. రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డానికి సి – విట‌మిన్ అధికంగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. బ‌య‌టి నుంచి తీసుకొచ్చిన పండ్లు, కూర‌గాయ‌ల‌ను మంచినీటితో శుభ్రంగా క‌డిగిన త‌ర్వాతే వినియోగించాలి. వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కూ బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం, ప‌రిశుభ్ర‌మైన, జాగూరుక‌త‌తో కూడిన‌ జీవ‌న‌మే మ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష‌.