iDreamPost

మహమ్మారిపై విజయం సాధించే దిశగా..

మహమ్మారిపై విజయం సాధించే దిశగా..

దాదాపు ఆరు నెలలుగా ఊరిస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. వచ్చే నెలలో ప్రజలకు వ్యాక్సిన్‌ అందించేందకు ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ వేసే ముందుగా లోటుపాట్లను సవరించుకునేందుకు నిర్వహించే డ్రైరన్‌ (డమ్మీ వ్యాక్సినేషన్‌)ను ఈ రోజు దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలో ఈ రోజు, రేపు ఈ డ్రైరన్‌ కొనసాగనుంది. ప్రతి రాష్ట్రంలో రెండు జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఏపీలో కృష్ణా జిల్లాలో డమ్మీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలైంది. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేట పూర్ణా హార్ట్‌ ఇనిస్టట్యూట్, కృష్ణవేణి డిగ్రీ కాలేజీ, తాడిగడ సచివాలయం–4, ప్రకాశ్‌నగర్‌ ప్రాథమిక వైద్యశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి వ్యాక్సిన్‌సెంటర్‌లో 25 మందికి డమ్మీ వ్యాక్సిన్‌ను అధికారులు ఇస్తున్నారు. ప్రతి సెంటర్‌లో 25 మందికి డమ్మీ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఇందు కోసం మూడు గదులను ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో పరిశీలన చేస్తున్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..? వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఎంత సమయం పడుతుంది..? వంటి అంశాలను తెలుసుకునేందుకు ఈ డ్రైరన్‌ను చేపడుతున్నారు.

రష్యా, అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. భారత్‌లో వచ్చే నెలాఖరు నుంచి వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆశిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి దశలో వైద్య రంగంలోని వారికి, రెండో దశలో ప్రజా సేవలో ఉండే పోలీసులు, మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బందికి, మూదో దశలో వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్‌ను అందించనున్నారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్రాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి.

మార్చి నెల నుంచి కరోనా వైరస్‌ భారత్‌లో విజృంభించిన విషయం తెలిసిందే. దాదాపు పది నెలలుగా దేశం యావత్తు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్‌ కేసులు కోటి దాటడం దేశంలో వైరస్‌ వ్యాప్తికి అద్దం పడుతోంది. వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ ఎత్తివేసినా.. జనజీవనం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ప్రస్తుతం దేశంలో రోజుకు 20–25 వేల మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీలో 300–400 మధ్య కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాక్సిన్‌ రావడం వల్ల అన్ని రంగాలు మళ్లీ పూర్వస్థితికి రానున్నాయి. విద్యా సంస్థలు, ప్రైవేటు కంపెనీలు పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం వ్యాక్సిన్‌రాక వల్ల కలుగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి