iDreamPost

ఖైదీలతో పాటు పోలీస్ సిబ్బందికి సోకిన కరోనా…

ఖైదీలతో పాటు పోలీస్ సిబ్బందికి సోకిన కరోనా…

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యధిక కేసులతో సహా అత్యధిక మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయంటే కరోనా ఎంతగా నగరంలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో కూడా కరోనా వ్యాపించినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ప్ర‌క‌టించారు.

ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలతో పాటు 26 మంది పోలీస్ సిబ్బందికి కూడా క‌రోనా పాజిటివ్ నిర్దారణ అయింది.దీంతో ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్ల‌డించారు. కాగా జైలులో వంట‌మ‌నిషికి క‌రోనా సోకింద‌ని, అతని ద్వారా ఖైదీలతో పాటు పోలీసులకు కూడా క‌రోనా సోకిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు. కరోనా పాజిటివ్ గా తేలిన ఖైదీలతో పాటు సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు. మిగిలిన ఖైదీలకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 1,216 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 43 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 17,974 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 694 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి