iDreamPost

కరోనా కట్టడికి విరాళాల కోసం భారత్-పాకిస్థాన్ ల మధ్య వన్డే సిరీస్‌ సాధ్యమేనా ??

కరోనా కట్టడికి విరాళాల కోసం భారత్-పాకిస్థాన్ ల మధ్య వన్డే సిరీస్‌ సాధ్యమేనా ??

ప్రపంచంలో మారణహోమము సృష్టిస్తున్న కరోనా కట్టడికి భారత్-పాక్ దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి.ఇరు దాయాది దేశాలలో ఆర్థిక కార్యకలాపాలు అన్నీ పూర్తిగా నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ పరిస్థితుల నుండి గట్టెక్కడానికి భారత్,పాకిస్థాన్ మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ నిర్వహిస్తే భారీ మొత్తంలో ఇరు దేశాలకి ఆదాయం లభిస్తుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రతిపాదించాడు.అయితే ఈ మ్యాచ్‌లను ఖాళీ మైదానాలలో ఆడించి కేవలం టీవీలకే పరిమితం చెయ్యాలని అక్తర్ సూచించారు.

సిరీస్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే పాక్ అభిమానులు ఆనందిస్తారు…బాబర్ అజామ్ శతకం సాధిస్తే భారతీయులు సంతోషిస్తారు.ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఇరు జట్లూ ప్రజల దృష్టిలో విజేతలే అవుతాయి.ఇక లాక్‌డౌన్ కారణంగా ఇరు దేశాల ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో టీవీలో వీక్షించే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది.ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరు దేశాలు సమానంగా పంచుకుని కరోనా వైరస్ కట్టడి కోసం వినియోగించుకుంటే బాగుంటుందని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అభిప్రాయపడ్డాడు.

2007 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగలేదు.కేవలం ఐసీసీ టోర్నీలలో,ఆసియా కప్‌లో మాత్రమే దాయాది దేశాలు ముఖాముఖి తలపడుతున్నాయి.దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహణ తటస్థ వేదిక దుబాయ్‌లో నిర్వహించాలని అక్తర్ సూచించాడు.ఇక ఆటగాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా చార్డెట్ ప్లైట్స్‌లో అక్కడకు ప్రత్యేకంగా తీసుకువెళ్లాలని అక్తర్ పేర్కొన్నాడు.దీని ద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కూడా నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు.ఇటువంటి ఆపత్కాలంలో ఇరు దేశాలు విభేదాలు మరచి ఒకరికొకరు సహాయం అందించుకోవాలని అక్తర్ కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి