iDreamPost

ఈ సారి వంటనూనెల వంతు..

ఈ సారి వంటనూనెల వంతు..

నిత్యావసర వస్తువుల ధరలు దేశంలోని ప్రజలు భయపెడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉల్లిపాయలు, బంగాళా దుంపల ధరలు అప్రతిహతంగా పెరిగిపోతూ సామాన్య జనాన్ని బెంబేలెత్తించగా, ఇప్పుడా బాధ్యతను వంట నూనెలు స్వీకరించినట్టున్నాయి. వారం వారం వంట నూనెల ధరలను టోకు, చిల్లర వ్యాపారులు సవరించి బోర్డులకెక్కిస్తున్నారు. దీంతో వారం క్రితం కొన్న ధర ఇప్పుడు లేకపోవడంతో కొనుగోలుదారులు జేబులపై పడే భారాన్ని తల్చుకుని ఉలిక్కిపడుతున్నారు. సగటున నలుగురు వ్యక్తులు ఉన్న కుటుంబానికి నెలకు 5 కేజీల వరకు నూనెను వినియోగిస్తారు. ఈలెక్కన ప్రతి నెలా బడ్జెట్‌లో అదనంగా సదరు కుటుంబం రూ. 150ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

గత యేడాది ఇదే రోజుల్లో వివిధ రకాల వంట నూనెల ధరలకు, ఇప్పుడున్న ధరలకే బేరీజు వేస్తే దాదాపు 15శాతం నుంచి 35శాతం వరకు వరకు కూడా పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా వినియోగించే పామాయిల్‌ ధర దాదాపు 30శాతం పైనే పెరిగిపోవడం ఇప్పుడు ప్రభుత్వాలను ఆందోళన కలిగించే అంశంగానే భావిస్తున్నారు. పామాయిల్‌కు సంబంధించి విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి అవుతుంది. అయితే ఆరేడునెలలుగా విదేశాల్లోనే దిగుబడులు తగ్గిపోవడం పామాయిల్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని, దాని ఫలితంగానే ధరలు పెరుగుదల నమోదవుతోందని టోకు వ్యాపారులు చెబుతున్నారు. పామాయిల్‌ ధరలు పెరగడంతో ఇతర వంటనూనెల ధరలు కూడా అదేబాట పట్టాయని వివరిస్తున్నారు.

ఉల్లి, బంగాళా దుంపల ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వంటనూనెలపై కూడా తక్షణం దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. దిగుమతులు పెంచడం, సుంకాలపై నియంత్రణ తదితర చర్యల కారణంగా ఉల్లి ధరల పెరుగుదల నిలిచిపోయింది. ప్రస్తుతం 55–75ల మధ్య ఉల్లి ధర ఊగిసలాడుతోంది. ఉల్లి ఉత్పత్తి దేశాల నుంచి భారీగా దిగుమతులు పెంచడంతో ఇది సాధ్యమైంది. అదే వ్యూహానిన వంట నూనెల విషయంలో కూడా అనుసరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు మూడు నెలలుగా వరుసగా వంటనూనెల ధరల పెరుగుదల నమోదవుతోంది. 35శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వెంటనే తగు చర్యలు చేపట్టకపోతే పేద, దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి ప్రజలు తీవ్ర భారమే మోయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం చేపట్టబోయే ధరల తగ్గింపు చర్యల పట్ల ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి