iDreamPost

ప్రభుత్వాన్ని కూల్చిన నిబంధనలు… పిల్లి సుభాష్ & మోపిదేవి ఎప్పుడు రాజీనామా చేయాలి?

ప్రభుత్వాన్ని కూల్చిన నిబంధనలు… పిల్లి సుభాష్ & మోపిదేవి ఎప్పుడు రాజీనామా చేయాలి?

రాష్ట్ర మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్ మరియు మోపిదేవి వెంకట రమణలను వైసీపీ రాజ్యసభకు ఎంపిక చెయ్యటంతో వారు రాజీనామా చేస్తారా? రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయినా వారు మంత్రులుగా కొనసాగవచ్చా? అన్న చర్చ నడుస్తుంది .

ఇలాంటి సందర్భాలలో రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ఆర్టికల్స్ ను ఉదహరిస్తూ రకరకాల అన్వయింపులు చెప్తుంటారు. రాజ్యాంగం ఎప్పుడూ చూసే దృష్టిని బట్టే అర్ధమవుతుంది , ఎవరి అర్ధాలు వారికి కనిపిస్తాయి. ఈ సందర్భంలో మూడు సంభావ్యతలను పరిశీలించాలి,

1. ఏ సభలో సభ్యుడు కాని వారు మంత్రి/ముఖ్యమంత్రి/ప్రధాన మంత్రి అయితే .. ఆరు నెలల లోపు సంబంధిత సభకు ఎన్నికవ్వాలి. . ఇది చాలా సరళమైన నిబంధన…

2. లోక్ సభ సభ్యుడు రాష్ట్ర మంత్రి/ముఖ్యమంత్రి అయితే .. మొదటి నిబంధన అంటే ఆరు నెలలో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ గా ఎన్నిక అవ్వాలి. అలా ఎన్నికయ్యే వరకు లోక్ సభకు రాజీనామా చేయవలసిన అవసరం లేదు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఎంపీ గా కూడా కొనసాగవచ్చు… రాజ్యాంగంలో ఈ వెసులుబాటు వలన ఒక ప్రధాని పదవినే కోల్పోయాడు… వివరాలు కింది పేరాలలో.

3.ఒక సభలో సభ్యుడిగా ఉంటూ మరో సభకు ఎన్నికయితే…
పిల్లి సుభాష్,మోపిదేవి రమణల కు వర్తించే నిబంధన ఇది.ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ లు లోక్ సభ లేక రాజ్య సభకు ఎన్నికయితే ఎలక్షన్ అధికారి నుంచి ఎన్నికయిన సర్టిఫికెట్ తీసుకున్న 14 రోజుల్లో ఎదో ఒక పదవికి రాజీనామా చెయ్యాలి. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కి రాజీనామా చేస్తారా లేక ఎంపీ పదవికి చేస్తారా అన్నది ఆ నేత ఇష్టం. కొత్తగా ఎన్నికయిన ఎంపీ పదవిని కూడా వొదులుకోవచ్చు. అలా ఒక పదవిని వొదులుకోని పక్షంలో రెండు పదవులు పోతాయి…

పైన పేర్కొన్న రెండవ నిబంధన వలన 1999లో వాజ్ పాయ్ ప్రభుత్వం కూలిపోయింది. నాడు ఏమి జరిగింది ? 

1995 లో ఒరిస్సా రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి JB పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా నిత్య వర్గపోరుతో ఆయన నాలుగేళ్లు నెట్టుకొచ్చాడు.. మరో సంవత్సరంలో ఎన్నికలు అనగా కాంగ్రెస్ అధిష్టానం జేబీ పట్నాయక్ ను తప్పించి కోరాపుట్ లోక్ సభ సభ్యుడు గిరిధర గొమాంగోను  1999 ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి పీఠం ఎక్కించింది.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం గిరిధర్ గమాంగో శాసనసభకు ఆరు నెలల్లో ఎన్నిక కావాలి. ముఖ్యమంత్రి అయినా వెంటనే గిరిధర గమాంగో లోక్ సభకు రాజీనామా చెయ్యలేదు. ఒక సభ్యుడు ఏకకాలంలో రెండు సభలలో సభ్యుడుగా ఉండటానికి నిబంధనలు అంగీకరించవు కానీ గమాంగో ఎమ్మెల్యే కాకపోవటంతో గమాంగో ఎంపీ గా ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగటం మీద వివాదం జరగలేదు. మరో వైపు కేంద్రంలో వాజ్ పాయ్ ప్రభుత్వం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. అనేక పార్టీలతో కలిపి కలగూర ప్రభుత్వాన్ని నడుపుతున్న వాజ్ పాయ్ కి ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికే సమయం సరిపోయేది.

1998 డిసెంబర్ నెలలో అడ్మిరల్ విష్ణు భగత్ ప్రభుత్వం నియమించిన వైస్ అడ్మిరల్ హరిందర్ సింగ్ నియమకాన్ని వ్యతిరేకించటం సంచలనం కలిగించింది. ప్రభుత్వం 30-Dec-1998న విష్ణు భగతును తొలగించిది. విష్ణు భగత్ అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్గ్ పెర్నాండేజ్ మీద తీవ్ర విమర్శలు ముఖ్యంగా ఆయుధ వ్యాపారులకు అనుకూలంగా పనిచేస్తున్నాడని విమర్శించారు.

వాజ్ పాయ్ ప్రధాని అయినప్పటి నుంచి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యాలని డిమాండు చేస్తు పలుసార్లు పార్లమెంట్ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన జయలలిత, విష్ణు భగత్ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫెర్నాండేజ్ను రక్షణ శాఖ నుంచి తప్పించి విష్ణు భగత్ ను తిరిగి అడ్మిరల్ గా తీసుకోవాలని వాజ్ పాయ్ మీద ఒత్తిడి తెచ్చారు.వాజ్ పాయ్ జయలలిత డిమాండ్లు అంగీకరించక పోవటంతో 27-Mar-1999న జయలలిత పార్టీ మంత్రులు ఇద్దరు రాజీనామా చేయగా అదే రోజు వాజ్ పాయి సిఫార్సుతో రాష్ట్రపతి వాటిని అంగీకరించారు.దీనితో జయలలిత వాజ్ పాయి ప్రభుత్వంతో పూర్తి తెగదెంపులు చేసుకున్నారు.

మరో వైపు సుబ్రమణ్య స్వామి వాజ్ పాయి ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యంగా 29-Mar-1999న ఢిల్లీలోని హోటల్ అశోకాలో వాజ్ పాయ్ ప్రభుత్వం కూల్చివేతే లక్ష్యంగా రాజకీయ పక్షాలతో టీ పార్టీ ఏర్పాటు చేశాడు.ఈ టీ పార్టీలో మొదటిసారి సోనియాగాంధి జయలలిత కలిశారు. ఈ పార్టీలోనే సుబ్రమణ్యస్వామి, సోనియా, జయలలిత,మాయావతి త్రయాన్ని లక్ష్మి,సరస్వతి,దుర్గలతో పోల్చాడు. మొత్తానికి టీ పార్టీకి అతిరథ మహారధులు అందరు హాజరయ్యారు. మాజీ ప్రధానులు చంద్ర శేఖర్ , P.V, దేవగౌడ, గుజ్రాల్ తో పాటు సోనియా,మమతా, మాయావతి, ములాయం & లాలు, ఫరూక్ అబ్దుల్లా, అన్ని కమ్యునిస్ట్ పార్టీల నాయకులు, DMK, ముపనార్ తదితరులు హాజరయ్యారు…దీనితో ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతం వెళ్ళింది.

14-Apr-1999న జయలలిత రాష్ట్రపతిని కలిసి వాజ్ పాయి ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరిస్తున్నట్లు లేఖ ఇచ్చారు. దీనితో 275 మంది సభ్యుల మద్దతున్న వాజ్ పాయ్ ప్రభుత్వం బలం 257కు తగ్గి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.ఆరు మంది సభ్యులున్న DMK, ఐదు మంది సభ్యులున్న BSP, నలుగురు సభ్యులున్న చౌతాల “లోక్ దళ్” పార్టీల నిర్ణయం కోసం అందరూ ఎదురు చూశారు. రాష్ట్రపతి వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని సభలో బలం నిరూపించుకోమని ఆదేశించారు. ప్రభుత్వానికి మద్దతు కూడగట్టటానికి BJP నాయకులు అద్వాని,ప్రమోద్ మహజన్ తదితరులు రంగంలోకి దిగారు.వారి ప్రయత్నాలు సఫలమయ్యి లోక్ దళ్ చౌతాలా, ఫరూక్ అబ్దుల్లా National Conference,DMK మద్దతు ఇవ్వటానికి అంగీకరించాయి.

మాయావతి వోటింగులో పాల్గొనకుండ తటస్థంగా ఉంటామని ప్రకటించారు.దీనితో ప్రభుత్వం విశ్వాస తీర్మానం గెలవటానికి కావలసిన బలం సమకూరింది.17-Apr-1999న ప్రభుత్వ విశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగింది.అనారోగ్యంతో హాస్పటల్లో ఉన్న సభ్యులను ఆయా పార్టీలు సభకు స్టెచర్ మీద తీసుకొచ్చాయి. ఢిల్లీలోని పలు ఆసుపత్రుల అంబులెన్సులు పార్లమెంట్ ఆవరణలో సిద్దంగా ఉంచారు.సభ మొదలైంది,మాయావతి లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం అని ప్రకటించారు. దీనితో సభలో కలకలం మొదలైంది. BJP నాయకులు విపక్ష పార్టీల నాయకుల వద్దకు పరుగులుతీసి చర్చలు చేశారు.

ఇంతలో ఒరిస్సా ముఖ్యమంత్రి “గిరిధర్ గమాంగ్” సభలో ప్రత్యక్షమయ్యారు.అప్పుడు అందరికి గుర్తొచ్చింది గమాంగో లోక్ సభకు రాజీనామా చేయలేదని. గమాంగో ను ఓటు వెయ్యకుండా అడ్డుకోవాలని బీజేపీ స్పీకర్ బాలయోగిని కోరింది. కానీ లోక్ సభ సభ్యుడైన గమాంగో నిబంధనల ప్రకారం ఓటు వెయ్యటానికి అర్హుడని స్పీకర్ ప్రకటించాడు. ముఖ్యమంత్రిగా ఉండి లోక్ సభలో ఓటు వెయ్యటం నైతికత కాదని బీజేపీ చేసిన వాదనను విపక్షాలు పట్టించుకోలేదు. ప్రభుత్వ విపక్ష బలాలు దాదాపు సమానంగా ఉన్నాయి,ఏమి జరుగుతుందో అన్న ఆత్రుత పెరిగింది.

మణిపూర్ నుంచి గెలిచిన కాంగ్రేస్ సభ్యుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వెయ్యటంతో విపక్షాలకు షాక్ తగిలింది. ప్రభుత్వం గెలిచినట్లే అని భావిస్తున్న సమయంలో ఎవరు ఊహించని రీతిలో National Conference పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి Prof.సైఫుద్దీన్ సోజ్ విశ్వాస తీర్మానికి వ్యతిరేకంగా ఓటువేశారు . మళ్లీ హడావుడి…క్రికెట్ లో చివరి ఓవర్లో బాలు బాలుకు ఫలితం మారేట్లు ఉత్కంఠత మధ్య చివరికి విశ్వాస తీర్మాననికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 270 ఓట్లు పడ్డాయి…అధికార పక్షంలో దిగ్బ్రాంతి, విపక్షాలలో కేరింతల మధ్య ప్రధాని వాజ్ పాయ్ లేచి చివరి ప్రసంగం చేసి రాజీనామా చెయ్యటానికి రాష్ట్రపతి భవనుకు వెళుతున్నానని ప్రకటించారు…

వాజ్ పాయ్ ప్రభుత్వం పడిపోవటానికి సైఫుద్దీన్ సోజ్ ఓటు ప్రధాన కారణం అయితే గిరిధర్ గమాంగో ఓటు రెండవ కారణం. గిరిధర్ గమాంగో ఓటు వెయ్యకుండా ఉంటె 269-269 ఓట్లతో విశ్వాస తీర్మానానికి సమాన ఓట్లు పడి ఉండేవి.ఇలాంటి సందర్భంలో స్పీకర్ ఫలితాన్ని నిర్ణయించే తన ఓటును వేస్తారు. వాజ్ పాయ్ ప్రభుత్వానికి టీడీపీ మద్దతు ఇచ్చింది, బీజేపీ మద్దతుతోనే బాలయోగి స్పీకర్ అయ్యారు కాబట్టి ఆయన సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి ఉండేవారు…

ఈ సంఘటన తరువాతనే సభ్యత్వానికి సంబంధించిన నిబంధనల మీద చర్చ ఎక్కువగా జరుగుతుంది,రాజకీయ పార్టీలు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి…

మొత్తానికి రాజ్యసభకు ఎన్నికయిన 14 రోజుల్లో పిల్లి సుభాష్ మరియు మోపిదేవి రమణ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చెయ్యాలి. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి మంత్రి పదవులకు రాజీనామా చేయకపోతే? . మరీ ఊహాజనిత ప్రశ్న కానీ అలాంటి పరిస్థితి ఎదురుకాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి