iDreamPost

జానా సొంత ఊర్లో గొడవ.. ఎవరికీ లాభం..?

జానా సొంత ఊర్లో గొడవ.. ఎవరికీ లాభం..?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. నువ్వానేనా అంటూ పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, బీజేపీ అభ్యర్థి రవి కుమార్ తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే జానా సొంతూరు అనుములలో మంగళవారం జరిగిన గొడవ వివాదానికి దారి తీసింది. టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి భయంతోనే తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు.

ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు

సాగర్‌ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామంలో ప్రచారం చేసేందుకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ వెళ్లారు. ఆయన వస్తున్న విషయం తెలిసి అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు.. టీఆర్‌ఎస్‌ నాయకులు రావొద్దంటూ ఆందోళన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించాయి. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య మాటల యుద్ధానిక దారితీసింది. తర్వాత తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులతో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. టీఆర్‌ఎస్‌, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

కాంగ్రెస్ పై ఎఫెక్ట్

ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని కూడా ఓటు అభ్యర్థించే హక్కును ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి అనుముల గ్రామంలోకి రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు అడ్డుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కు నాలుగు రోజుల ముందు జరిగిన ఈ ఘటన తమకు కలిసి వస్తుందని, కాంగ్రెస్ లీడర్ల దౌర్జన్యం ప్రజలకు తెలుస్తుందని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. గతంలో 2018 ఎన్నిక సమయంలోనూ ప్రచారానికి వచ్చిన నోముల నర్సింహయ్యను.. గ్రామంలోకి రానివ్వకుండా స్థానికులు అడ్డుకున్నారని చెబుతున్నారు. అదే తరహాలో ఇప్పుడు నోముల భగత్‌ను రానివ్వలేదని గుర్తు చేస్తున్నారు.

గత వైభవం కోసం జానా..

నాగార్జున సాగర్.. కాంగ్రెస్ నేత జానారెడ్డికి కంచుకోట లాంటిది. కానీ 2018 ఎన్నికల్లో ఆ కంచుకోటను నోముల నర్సింహయ్య బద్ధలు కొట్టారు. తెలంగాణ పాలిటిక్స్ లో అత్యంత సీనియర్ ను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు నర్సింహయ్య చనిపోవడంతో జానాకు ఒక అవకాశం వచ్చింది. మళ్లీ గత వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఒక్క విజయం.. పీసీసీ పదవి వరించేలా చేస్తుందని భావిస్తున్నారు. దీంతో సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.

సుదీర్ఘ కాలంపాటు రాష్ట్ర మంత్రిగా పని చేసిన జానా.. 1978లో చలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరి 1983లో చలకుర్తి నుంచి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో మళ్ళీ టీడీపీ నుంచి గెలిచినా జానా.. 1989లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1994లో ఓడిపోయారు. తర్వాత రెండు సార్లు చలకుర్తి నుంచి, రెండుసార్లు నాగార్జున సాగర్ నుంచి గెలిచారు. మొత్తంగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి