iDreamPost

లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు.. అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చు!

లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు.. అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చు!

ఎక్కడ చూసినా లోన్ యాప్ బాధితులే ఎక్కువగా ఉంటున్నారు. తెలిసో, తెలియకో కొన్ని లోన్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఋణం తీసుకుంటారు. ఋణం తీసుకున్న పాపానికి ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మాటల్లో చెప్పలేము. లోన్ తీసుకున్న వారి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. ఇష్టమొచ్చినట్టు వడ్డీ వేస్తూ రుణగ్రహీతలు నడ్డి విరగ్గొడతారు. 5 వేలు, 6 వేలు లోన్ కి కూడా దారుణంగా వడ్డీలు వేసి వసూలు చేస్తారు. వసూలు చేసే క్రమంలో టార్చర్ చేస్తారు. రుణగ్రహీతల సోషల్ మీడియా ఖాతాలో ఉన్న వారి నంబర్స్ కి కాల్ చేసి పరువు తీసేస్తారు. రుణగ్రహీతల ఫోన్ నంబర్ హిస్టరీ తీసుకుని అందులో ఉన్న కాంటాక్ట్ లకి కాల్ చేసి లోన్ కట్టడం లేదని పరువుని బజారుకీడుస్తారు. లోన్ కట్టకపోవడం తప్పే. కానీ లోన్ కట్టలేదని పరువు తీయడం కరెక్ట్ కాదన్న వాదనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోక లోన్ కట్టలేని పరిస్థితిలో రుణగ్రహీతలని టార్చర్ చేయడం సరికాదని ఇప్పటికే పలువురు తమ గొంతు వినిపించారు. లాయర్లు సైతం ఇలాంటి విషయాల్లో భయపడొద్దని ధైర్యం చెప్పారు.

చాలా మంది ఈ లోన్ యాప్ ల పుణ్యమా అని.. వీరి ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ లు చేసుకున్నారు. మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు అశ్లీల వెబ్ సైట్స్ లో అప్లోడ్ చేస్తామని బెదిరించడంతో కొంతమంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూశాం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు పరిష్కారం ఏంటి? ఇలాంటి వేధింపులు ఎదురైతే భరించాలా? భరించలేక ఆత్మహత్య చేసుకోవాలా? ఇలాంటి ప్రశ్నలు మీలో ఉంటే ఇకపై భయపడకండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల విషయంలో కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రికవరీ ఏజెంట్లు.. రుణగ్రహీతలను ఒత్తిడికి గురి చేయడం, దుర్భాషలాడటం, శారీరకంగా గాయపరచడం వంటివి చేయడం నేరమని ఆర్బీఐ స్పష్టం చేసింది. లోన్ తీసుకున్న వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించడకూడదని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

రుణగ్రహీతలకి ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు మెసేజులు పంపించకూడదని ఆర్బీఐ వెల్లడించింది. మరీ ముఖ్యంగా రుణగ్రహీతలను బెదిరించకూడదని.. ఉదయం 8 గంటల లోపు, రాత్రి 7 గంటల తర్వాత వారి ఇళ్లకు వెళ్లకూడదని ఆర్బీఐ తెలిపింది. అయినా కూడా రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురి చేస్తే కనుక వారిపై ఫిర్యాదు చేయవచ్చు. ఆధారాల కోసం రికవరీ ఏజెంట్ల కాల్ డేటా, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, చాట్ మెసేజులు వంటివి భద్రపరచుకోవాలి. వీటి సాయంతో బ్లాక్ మెయిల్ చేసే రికవరీ ఏజెంట్ల మీద ఫిర్యాదు చేయవచ్చు. రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోతే కనుక కోర్టును ఆశ్రయించవచ్చు. అంతేకాదు మిమ్మల్ని వేధింపులకు గురి చేసినందుకు రికవరీ ఏజెంట్ల నుండి పరిహారం కూడా పొందవచ్చు.

లోన్ ఆఫీసర్ లేదా బ్యాంకు వారిని సంప్రదించి.. రికవరీ ఏజెంట్ల వేధింపులను నిలువరించమని చెప్పవచ్చు. అప్పటికీ రికవరీ ఏజెంట్లు వేధింపులకు గురి చేయడం మానకపోతే.. ఈ-మెయిల్ ద్వారా ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. లోన్ తీసుకున్న వారికి ఎదురైన పరిస్థితులను ఈమెయిల్ లో పేర్కొనాలి. ఇలా చేయడం వల్ల నిబంధనల ఉల్లంఘన కింద మిమ్మల్ని వేధిస్తున్న రికవరీ ఏజెంట్లను ఆర్బీఐ నిషేధించే ఛాన్స్ ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనలు మరీ తీవ్రంగా ఉన్నట్లు తేలితే వారిపై నిషేధాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది. రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి గానీ, మీ ఆఫీసుకు గానీ వచ్చి అందరి ముందు.. మిమ్మల్ని కించపరిచినా, అవమానపరిచినా, దూషించినా.. మీ గౌరవానికి భంగం కలిగించినా.. మీరు బ్యాంకు వారిపై, రికవరీ ఏజెంట్లపై పరువు నష్టం దావా వేయవచ్చు. మరి ఆర్బీఐ మార్గదర్శకాలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి