iDreamPost

నాడు సామాన్యులు… నేడు అసామాన్యులు

నాడు సామాన్యులు… నేడు అసామాన్యులు

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మామూలు సామాన్య వ్యక్తి అయిన నందిగం సురేష్ బాపట్ల ఎంపీ గా చేసి వైఎస్ జగన్ సంచలనం సృష్టించారు. ఆ విషయాన్ని ఇప్పటికీ పొలిటికల్ సర్కిల్లో గొప్పగా చెపుతుంటారు. నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అంతకు మించిన సంచలనాలకు తెరతీశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కలలో సైతం ఊహించని విధంగా అత్యంత సామాన్యులకు రాజ్యాధికారం కట్టబెట్టి అందలం ఎక్కించారు.

తోపుడు బండ్లు, రోడ్ల పక్కన పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు, ఒకప్పుడు బట్టలు అమ్ముకొని బ్రతికిన మహిళను మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పీఠంపై కూర్చోపెట్టారు. ఇంతటి సంచలన నిర్ణయాలు తీసుకునే ధైర్యం, తెగువ ఒక్క వైఎస్.జగన్ కె సొంతమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అసామాన్యుడు అయినా ఆ సామాన్యుల గురించి లోతుగా వెళ్లి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఓ మోస్తరు పట్టణం. ఆ పట్టణంలో తోపుడు బండిపై పండ్లు పెట్టుకొని వీధుల్లో అరుస్తూ, తిరుగుతూ మొన్నటిదాకా రోజూ కనిపించే వాడు రాజ్ కుమార్. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న రాజ్ కుమార్ కుటుంబం ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కుటుంబ పోషణ కోసం తోపుడు బండి పై పండ్లు పెట్టుకొని పట్టణంలో తిరుగుతూ అమ్ముకునేవాడు. ఇలా రాజ్ కుమార్ పట్టణంలో అందరికీ సుపరిచితుడు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో నువ్వు అందరికీ తెలిసిన వ్యక్తి కదా.. నువ్వెందుకు పోటీ చేయకూడదు అంటూ పలువురు రాజ్ కుమార్ ను ప్రోత్సహించారు. అవును రాజ్ కుమార్ అయితే అందరూ గుర్తించే వ్యక్తి అని కళ్యాణదుర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం భావించి ఈ విషయాన్ని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో రాజ్ కుమార్ ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ సహకారంతో కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ చరిష్మా, వ్యూహాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాల కారణంగా రాజ్ కుమార్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా సునాయాసంగా గెలిచాడు. ఆ తర్వాత రకరకాల పరిణామాల నేపథ్యంలో అక్కడ ఎవరిని మున్సిపల్ చైర్మన్ చేయాలనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్.జగన్ దాకా వెళ్లింది. అందరి కౌన్సిలర్ల నేపథ్యంతో కూడిన జాబితా సీఎం వద్దకు వెళ్ళింది. పండ్లు అమ్ముకొని జీవిస్తున్న రాజ్ కుమార్ పేరు పై ముఖ్యమంత్రి జగన్ చూపు నిలిచింది. వెంటనే మరిన్ని వివరాలు కనుక్కొని ఆ పేరుకి ముఖ్యమంత్రి జగన్ టిక్ పెట్టారు. విషయం రాజ్ కుమార్ కు తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యారు. కౌన్సిలర్ కావడమే ఎక్కువ అనుకుంటే తాను చైర్మెన్ కావడం ఏంటని, ఏదో తనను ఆట పట్టిస్తున్నారని భావించాడు. ఎట్టకేలకు ఇది నిజమేనని నమ్మేందుకు రాజ్ కుమార్ కు చాలా సమయం పట్టింది. కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని శభాష్ అంటూ కొనియాడుతున్నారు. ఇంకేముంది మొన్నటివరకు తోపుడు బండిపై పండ్లు అమ్ముకుని జీవనం సాగించే రాజ్ కుమార్ సీఎం జగన్ చలవతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ అయిపోయారు.

ఇక వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి కి వెళ్తే… డిగ్రీ పూర్తి చేసిన షేక్ ఫయాజ్ భాష పట్టణంలోనీ వీరభద్ర స్వామి ఆలయం సమీపంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పట్టణంలోని 31 వార్డులో జీవనం సాగిస్తున్న ఫయాజ్ భాష అందరికీ సుపరిచితుడే. కూరగాయల వ్యాపారం చేస్తూనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఫయాజ్ బాషాను కౌన్సిలర్ గా చేస్తే బాగుంటుందని భావించిన స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అతనికి మున్సిపల్ కౌన్సిలర్ గా బీఫామ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఫ్యాన్ గాలి ఉదృతంగా వీయడంతో ఫయాజ్ భాష సునాయసంగా గెలిచాడు. ఎవరు చైర్మన్ కావాలనే విషయంపై సందిగ్ధత నెలకొనడంతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో షేక్ ఫయాజ్ భాష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంట పడ్డాడు. ఇంకేముంది.. దశ తిరిగిపోయింది.. మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఇదంతా తనకు కలగా ఉందని, ఒక్కోసారి ఇది నిజమేనా అనే సందేహం వస్తోందని ఆశ్చర్యపోతున్నాడు షేక్.ఫయాజ్ భాష.

ఇక చిత్తూరు మేయర్ అముద గతం పూర్తిగా భిన్నం. చిత్తూరు పెద్ద హరిజనవాడ కు చెందిన అముద పదవ తరగతి వరకు చదువుకున్నారు. అవివాహితురాలు అయిన అముద కు ఊహ తెలియకముందే తండ్రి చనిపోయాడు. అక్క కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. అక్కకు తోడుగా ఉండేందుకు పెద్ద హరిజనవాడ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అడవి కి వెళ్లి కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్ముకొని వచ్చిన డబ్బుతో కుటుంబానికి అండగా నిలిచింది. అలా ఆర్థిక కష్టాల మధ్య పెరిగిన ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. అముద సోదరుడు టిడి.మోహన్ టిడిపి మాజీ కౌన్సిలర్ కూడా. ఈ నేపథ్యంలో అముదకు రాజకీయాల పట్ల ఆసక్తి మరింత ఎక్కువగా ఉండేది. తొలినుంచి వైఎస్సార్ అభిమానిగా ఉన్న అముద వైఎస్.జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పురపాలక ఎన్నికలు రావడంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో కార్పొరేటర్ గా పోటీ చేసి ఫ్యాను గాలిలో సునాయాసంగా విజయం సాధించింది. తన జన్మకు కార్పొరేటర్ చాలని మురిసిపోయింది. మేయర్ పదవికి పోటీ ఏర్పడడంతో అనూహ్యంగా ఆముద పేరు పరిశీలనలోకి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అభిప్రాయం తో ఆముద వైపు మొగ్గు చూపారు. మేయర్ పీఠం ఆమెకు కట్టబెట్టారు. ఇంకేముంది కట్టెలమ్మిన చోటే పూలు అమ్ముకున్న చందంగా నాడు కట్టెల అమ్ముకుని జీవనం సాగించిన ఆముద చిత్తూరు మేయర్ అయిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి