iDreamPost

కాకినాడ సెజ్ లో సంచలన నిర్ణయం, రైతు ప్రయోజనాల పరిరక్షణలో కొత్త అధ్యాయం

కాకినాడ సెజ్ లో సంచలన నిర్ణయం, రైతు ప్రయోజనాల పరిరక్షణలో కొత్త అధ్యాయం

కాకినాడ సెజ్ రైతుల సమస్య మీద జగన్ తనదైన శైలిలో స్పందించారు. రైతుల భూములను తీసుకోవడమే తప్ప తిరిగి ఇవ్వడం జరగని గత రెండు దశాబ్దాల అనుభవాలను ఆయన తిరగతోడారు. ఏకంగా ఒకేసారి 2100 ఎకరాల కాకినాడ సెజ్ రైతుల భూములను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించడం అసాధారణంగా భావించాలి. ప్రభుత్వాలు ఇటీవల అనేక పథకాలు, ప్రజా అవసరాల పేరుతో భూసేకరణలు, సమీకరణలు చేస్తున్నారు. తమ అవసరాలకు మించి భూములు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. అందులో భూములు మిగిలినా వాటిని మార్కెట్ కి అనుగుణంగా మలచుకోవడమే తప్ప తిరిగి రైతులకు అప్పగించిన దాఖలాలు ఇటీవల కాలంలో లేవు. పైగా రైతుల భూముల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ భూములను ఎలా ప్రభుత్వ అవసరాలకు మలచుకోవాలన్న దానిపై దృష్టి పెట్టారే తప్ప తొలిసారిగా రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకునేది లేదని తేల్చిచెప్పిన ప్రభుత్వం వైఎస్ జగన్ దే కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో భూములు వెనక్కి ఇచ్చేసిన అనుభవం కూడా లేదు.

కాకినాడ సెజ్ కి 2003లో చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2005లో వైఎస్సార్ హయంలో భూసేకరణ జరిగింది. అయితే అప్పట్లో సుమారు 9వేల ఎకరాల భూసేకరణ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. ఆతర్వాతి ప్రభుత్వాలు రైతులు ఉద్యమిస్తున్నా వెనక్కి తగ్గకుండా భూములు తీసుకునే ప్రయత్నం చేశాయి. నోటిఫికేషన్ ఇచ్చిన భూములకు అవార్డ్ ప్రకటించి పరిహారం బ్యాంకుల్లో జమ చేస్తున్నట్టు రైతులను బెదిరించాయి. దాంతో కొందరు అయిష్టంగానే కాకినాడ సెజ్ కి భూములు అప్పగించి పరిహౄరం తీసుకున్నారు. చంద్రబాబు 2013లో ప్రతిపక్షంలో ఉండగా భూములు వెనక్కి ఇస్తానంటూ ఏరువాక కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను వేధించారు. పలు కేసులు పెట్టారు. సెజ్ యాజమాన్యానికి అనుకూలంగా అన్నదాతలను వేధించారు. అయినప్పటికీ ఇంకా కొందరు రైతులు మాత్రం ససేమీరా అంటూ నాటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. వారికి జగన్ ప్రతిపక్షంలో ఉండగా సంఘీభావం ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తానని 2018 జూలైలో ఓదార్పు యాత్ర సందర్భంగా పిఠాపురం సభలో ప్రకటించారు.

అధికారంలోకి రాగానే మంత్రి కన్నబాబు సారధ్యంలో ఆరుగురితో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటూనే మరింత ఉదారంగా వ్యవహరించాలని తాజాగా క్యాబినెట్ తీర్మానించింది. అందులో భాగంగా పరిహారం తీసుకోకుండా ఉన్న రైతులకు చెందిన 2100 ఎకరాల భూమిని భూసేకరణ నుంచి మినహాయిస్తూ తీర్మానం చేసింది. అదే సమయంలో గతంలో పరిహారం తీసుకున్న రైతులకు అదనంగా ప్రయోజనం కల్పించే దిశలో ముందుకెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఉద్యమం సందర్భంగా రైతుల మీద పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది.

జగన్ ప్రభుత్వ నిర్ణయం సెజ్ రైతాంగాన్ని సంతోషంలో నింపింది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమకు జగన్ నేతృత్వంలోని మంత్రిమండలి చేసిన తీర్మానం ఊరటనిచ్చిందని చెబుతున్నారు. సెజ్ ప్రాంతంలో జగన్ కి జైజైలు పలుకుతూ విజయోత్సవాలకు పూనుకుంటున్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. నిజమైన రైతు బాంధవుడిగా కొనియాడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి