iDreamPost

18న న్యాయ రాజధానికి సీఎం జగన్‌.. భారీ ఏర్పాట్లు

18న న్యాయ రాజధానికి సీఎం జగన్‌.. భారీ ఏర్పాట్లు

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధానిని ప్రకటించిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో పర్యటించనున్నారు. ఈనెల 18న కర్నూలులో నూతన ఆరోగ్యశీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే ‘డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని కూడా ఆరంభిస్తారు. రాయలసీమ వాసుల దశాబ్ధాల కలను కర్నూలులో హైకోర్టు ద్వారా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. 50 వేలకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. హెలిప్యాడ్‌ నుంచి ఎస్టీబీసీ కళాశాల వరకు భారీ మానవహారం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆ మేరకు సూచనలు చేశారు.

అవ్వా తాతల కంటి చూపు తానై..

అవ్వతాతాలకు ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వడం ద్వారా వారి కష్టాలను తీరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ వారి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వృద్ధాప్యంలో కంటి చూపు కనపడక వారి పడే ఇబ్బందులు గుర్తించిన జగన్‌.. డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల ద్వారా లక్షలాది మంది అవ్వతాతలకు కంటి పరీక్షలు ఉచితంగా చేయించారు. అలాగే అవసరమైన కళ్లద్దాలను కూడా అందజేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో వచ్చినందున ఇకపై కంటి పరీక్షలు అక్కడే చేయిస్తారు. మొదట స్క్రీనింగ్‌ పరీక్షలు చేసిన తర్వాత మందులు రాయిస్తారు. అక్కడికక్కడే కంటి అద్దాలు ఇస్తారు. ఒక వేళ ఆపరేషన్‌ అవసరమని డాక్టర్లు నిర్దారిస్తే.. వారు కోరుకున్న ఆస్పత్రికి రికమెండ్‌ చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి