iDreamPost

ఇసుక కష్టాలకు ఇక ఫుల్ స్టాప్

ఇసుక కష్టాలకు ఇక ఫుల్ స్టాప్

ఏపీ సీఎం సీరియస్ గా స్పందించారు. ఇసుక సమస్య తీవ్రమవుతున్న తరుణంలో తాజాగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్య పరిష్కారానికి అనుగుణంగా బల్క్ బుకింగ్స్ ని పోర్టల్ నుంచి తొలగించాలని ఆదేశించారు. ఇసుక కోసం బల్క్ ఆర్డర్లు కావాలంటే జాయింట్ కలెక్టర్ నుంచి అనుమతి పొందేలా మార్పు తీసుకురావాలని సూచించారు. ఇది సమస్యను చాలా వరకూ పరిష్కరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

గత కొంత కాలంగా లాక్ డౌన్ కారణంగా ఇసుక అవసరం కనిపించలేదు. కానీ ఒక్కసారిగా కార్యకలాపాలు ప్రారంభమయిన తర్వాత అంతా ఇసుక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ తీరా ఆన్ లైన్ బుకింగ్ లో ఇసుకను బల్క్ బుకింగ్స్ పేరుతో కొందరు బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరకు దానిని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న విషయం బయటపడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సీఎం సమీక్ష జరపడంతో సమస్యకు చాలా వరకూ పరిష్కారం లభించినట్టేనని భావిస్తున్నారు. సామాన్యులకు ఇసుక లభించకుండా, బల్క్ పేరుతో తరలించుకుపోతున్న వారికి జేసీ నుంచి అనుమతి తీసుకునేలా విధానంలో మార్పు వస్తే అది మంచి ఫలితాన్నిస్తుందని చెబుతున్నారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసందర్భంగా సీఎం కొంత సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా రీచ్‌లన్నీ మూతబడ్డాయన్న అధికారుల వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. రీచ్ లు ప్రారంభించడంలో జరిగిన జాప్యానికి అలసత్వం ప్రదర్శించడం తగదన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి ఏమిటని నిలదీశారు. బల్క్ ఆర్డర్ల పేరుతో సాగుతున్న తంతుపై నిలదీశారు. బల్క్‌ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వాలని ఆదేశించారు. అన్ని డిపోల్లో ఇసుకను తగినంతగా అందుబాటులో పెట్టాలని సూచించారు. ఇసుక బుకింగ్ ఆన్ లైన్ పోర్టల్‌ నుంచి బల్క్‌ ఆర్డర్ల కాలమ్ తొలగించాలని ఆదేశించారు. బల్క్‌ ఆర్డర్లకు అనుమతులను జేసీకి అప్పగించాలని తెలిపారు. పోర్టల్‌ ఆన్‌ చేయగానే.. వెంటనే నిల్వలు అయిపోతున్నాయన్న భావన ఉందని, తక్షణం దానిని తొలగించాలని తేల్చిచెప్పారు.

ప్రభుత్వ నిర్మాణాల కోసమంటూ ఇసుక తరలించుకుపోతున్నారని ఆరోపణలు వస్తున్నట్టు సీఎం ప్రశ్నించారు. అలాంటి నిర్మాణ అవసరాలకు సంబంధించి బల్క్‌ బుకింగ్‌ ఉంటే… సూపరింటెండెంట్‌ ఇంజినీర్, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వాలని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌ను చేసుకునే అవకాశం ఇవ్వాలని, దానికి అనుగుణంగా మార్పులు చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని, ఇసుక కోసం పోర్టల్ లో బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలని జగన్ ఆదేశించారు. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్లద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలన్న సీఎం చెప్పారు.

సీఎం చొరవ చూపడంతో ఇసుక సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతున్నట్టేనని చెప్పవచ్చు. కొంతకాలంగా ముఖ్యమంత్రి ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల కారణంగా పరిస్థితి భిన్నంగా ఉందనే వాదన ఉంది. ఈ విషయంలో స్పందించిన సీఎం సూటిగా చెప్పడంతో ఇసుక కొరతకు ఫుల్ స్టాప్ పడినట్టేనని అంతా భావిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎం కొందరు అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు చెబుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు చక్కదిద్దకపోతే మరింత సీరియస్ గా ఉంటుందనే అభిప్రాయం కలుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి