iDreamPost

తలైవి రాక గురించి క్లారిటీ

తలైవి రాక గురించి క్లారిటీ

కంగనా రౌనత్ టైటిల్ పాత్రలో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న తలైవి నేరుగా ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోందన్న వార్తలు నిన్నటి నుంచి తెగ షికారు చేస్తున్నాయి. దీని డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కు 55 కోట్లకు అమ్మారన్న న్యూస్ బయటికి రాగానే జూన్ 26 నేరుగా చిన్నితెరపై చూడొచ్చనే ప్రచారం జోరందుకుంది. కానీ ఈ డీల్ జరిగింది కేవలం రైట్స్ కోసమే తప్ప డైరెక్ట్ డిజిటల్ విడుదలకు కాదట. అంటే ఇది థియేట్రికల్ రిలీజ్ కు కట్టుబడినట్టే. ఈ సినిమా కోసమే కంగనా ప్రత్యేకంగా మేకోవర్ చేసుకుని చాలా కష్టపడింది. క్వీన్ పేరుతో ఇప్పటికే జయలలిత కథ వెబ్ సిరీస్ రూపంలో రాగా దాని మీద విమర్శలు వచ్చాయి.

అమ్మ కథను సరైన వాస్తవాలతో రూపొందించలేదని ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. అందుకే తలైవి మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ కు అమ్మేయగా తెలుగు, తమిళ్ వెర్షన్లు ప్రైమ్ లో వస్తాయి. అయితే ఈ రెండు కంపెనీలు ఏమైనా డెడ్ లైన్ పెట్టాయా అనేది ఇంకా ఖరారుగా తెలియలేదు. ఎంజిఆర్ గా అరవింద స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్, శోభన్ బాబుగా జిస్సు సేన్ గుప్తా నటించిన ఈ మూవీలో వీరప్పన్, శశికళ లాంటి ఇతర పాత్రలు చాలా ఉన్నాయి. ఇంకా సెన్సార్ కావాల్సి ఉంది. వివాదాస్పద అంశాలు తలైవిలో చాలా ఉన్నాయని ఇప్పటికే చెన్నైలో గుప్పుమంటోంది. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడటంతో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

ఓటిటి ప్రచారం గురించి ఖండించిన కంగనా ప్రస్తుతానికి అలాంటి ప్లాన్ ఏదీ లేదని భవిష్యత్తులో ఏర్పడే తప్పనిసరి పరిస్థితుల గురించి ఇప్పుడే ఏమి చెప్పలేనని స్టేట్ మెంట్ ఇచ్చింది. సో ఇప్పటికైతే తలైవి రిలీజ్ గురించి క్లారిటీ వచ్చింది. మహానటి తర్వాత ఏ బయోపిక్ ఆశించిన విజయం సాధించలేదు. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి స్టార్ హీరో ఉన్నా ఎన్టీఆర్ కు డిజాస్టర్ రిజల్ట్ తప్పలేదు. మరి జయలలిత కథను ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఈ నెలలో సాధ్యపడదు కాబట్టి ఆగష్టు లేదా సెప్టెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. జివి ప్రకాష్ కుమార్-రుచిత సంయుక్తంగా సంగీతం అందిస్తున్న తలైవికి బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ కథా విస్తరణ అందించారు. మరి జయలలిత కథ తెరపై ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి