iDreamPost

దేవాలయ ఘటనలపై సీఐడీ : ఒకట్రెండు రోజుల్లో నిందితుల అరెస్టు.!

దేవాలయ ఘటనలపై సీఐడీ : ఒకట్రెండు రోజుల్లో నిందితుల అరెస్టు.!

రామతీర్థం ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై సీఐడీ విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ఆదేశించినట్లు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అపచారం ఘటనపైనా సీఐడీ విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఆలయాలపై వరుస దాడులపై పోలీసు, దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సోమవారం ఇక్కడి కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, దేవదాయశాఖ అధికారులు గిరిజా శంకర్‌, అర్జునరావు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రామతీర్థం ఘటనపై విచారణ వేగంగా జరుగుతోందని, ఒకట్రెండు రోజుల్లో సాక్ష్యాధారాలతో అరెస్టులు జరుగుతాయని చెప్పారు. ఆలయం ఆధునికీకరణకు నిర్ణయం తీసుకున్నామని, కొత్త డిజైన్‌ను మీడియాకు చూపించారు. భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బీజేపీ ర్యాలీ విరమించుకోవాలి..

విగ్రహాన్ని ఎప్పుడు ప్రతిష్టించాలనే దానిపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆలయ ప్రదేశం ఇరుకుగా ఉంటుందని, సున్నితమైన ప్రదేశమైనదున బీజేపీ నాయకులు ర్యాలీని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయాలపై రాజకీయ బురద జల్లొద్దన్నారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని ఆలయం టీఎన్‌టీయూసీ వారిదని, దానికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ఇప్పుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, టీఎన్‌టీయూసీ నేతలు వచ్చి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ ఆలయంలో దాడి ఎలా జరిగిందో చంద్రబాబు, టీఎన్‌టీయూసీ నేతలే చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజమండ్రిలో అపచారం జరిగిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం టీడీపీకి చెందిన గన్ని కృష్ణది అని చెప్పారు. ఆ ఆలయంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదన్నారు.

వైసీపీ హయాంలో తగ్గిన దాడులు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు దేవదాయశాఖకు సంబంధించిన ఆలయాల్లో ఎనిమిది చోట్ల మాత్రమే దాడులు జరిగాయని, ప్రైవేటుతో కలిపితే మొత్తం ఘటనలు 31 మాత్రమేనని చెప్పారు. దొంగతనాలు, గుప్తనిధుల కోసం తవ్వకాలు, ధ్వంసాలకు సంబంధించి పోలీసులు 88 కేసులు పెట్టి, 159 మందిని అరెస్టు చేశారని, వారిలో కొందరికి రెండేళ్ల శిక్ష కూడా పడిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 57,584 ఆలయాలను పోలీసులు మ్యాపింగ్‌ చేశారన్నారు. వాటిలో ప్రస్తుతం 11,575 ఆలయాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటయ్యాయన్నారు. వాటిని ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ప్రైవేటు ఆలయాల్లోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై త్వరలో మార్గదర్శకాలు జారీచేస్తామన్నారు. ఆలయాల్లో దొంగతనాలు కొత్త కాదని, టీడీపీ హయాంలోనూ జరిగాయని అన్నారు. దేవదాయశాఖ నిధులు దారి మళ్లించడం, ఇతర మతాలకు ఇస్తున్నారనేది తప్పుడు ప్రచారం మాత్రమేనన్నారు. అలాగే విజయవాడలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చేసిన ఆలయాలను ఇప్పుడు పునర్నిర్మించనున్నట్లు చెప్పారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల కోసం టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. దేవుడితో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి