iDreamPost

చింతా మోహన్‌ చిలక జోస్యం… చింత చచ్చినా పులుపు చావలేదు

చింతా మోహన్‌ చిలక జోస్యం… చింత చచ్చినా పులుపు చావలేదు

తిరుపత ఉప ఎన్నికల కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ చిలక జోస్యం చెబుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరని చెప్పుకొస్తున్నారు. ఆరు నెలల తర్వాత వైఎస్‌ జగన్‌ ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదంటున్నారు.

వైఎస్‌ జగన్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి మే 30కి రెండు సంవత్సరాలు అవుతుంది. మరో మూడేళ్లు ఆయన పదవీ కాలం ఉంది. మరి చింతా మోహన్‌ మాత్రం వైఎస్‌ జగన్‌ ఎక్కువ కాలం పదవిలో కొనసాగరని ఏ ప్రాతిపదికన చెబుతున్నారో తెలియడం లేదు. పైగా ఆరు నెలల తర్వాత జగన్‌ ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదంటున్నారు. మరి జగన్‌ ఆరు నెలల తర్వాత ఎక్కడ ఉండేది చింతా మోహన్‌కు తెలుసా..? ఒక వేళ తెలిస్తే.. ఎక్కడ ఉంటారో చెప్పకుండా.. జగన్‌కే తెలియదంటూ వ్యాఖ్యానించడం వెనుక చింతా మోహన్‌ కడుపు మంట కనిపిస్తోంది.

తిరుపతి లోక్‌సభ నుంచి చింతా మోహన్‌ ఆరు సార్లు గెలిచారు. 1984లో టీడీపీ తరఫున గెలిచిన చింతా మోహన్‌ ఆ తర్వాత 1989, 1991,1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.

కాంగ్రెస్‌ పాతకాపులను దూరం పెట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. 2014 ఎన్నికల్లో అనేక మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే తిరుపతి లోక్‌సభ నుంచి రిటైర్ట్‌ అధికారి వెలగపల్లి వరప్రసాదరావును బరిలోకి దింపారు. ఆయన గెలిచారు.

ఆరు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పని చేసినా అధికార దాహం తీరని చింతా మోహన్‌ ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. 33,333 ఓట్లు సాధించారు. 2019లోనూ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన చింతా మోహన్‌ ఈ సారి నోటా కన్నా తక్కువగా 24,039 ఓట్లు సంపాదించారు.

Also Read : ఏపీ అప్పులు.. అసలు నిజాలు..

ఆది నుంచి వైఎస్‌ జగన్‌పై కడపుమంటతో ఉన్న చింతా మోహన్‌.. సమయం దొరికినప్పుడల్లా దాన్ని బయటపెట్టుకుంటుంటారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా.. జగన్‌ అధికార దాహంతో తిరుగుతున్నాడంటూ తనలోని అక్కసును వెళ్లగక్కారు.

జగన్‌ భవిష్యత్‌పై జోస్యం చెబుతున్నట్లుగానే.. చింతా మోహన్‌ 2017లోనూ ఏపీ రాజకీయాలపై జోస్యం చెప్పారు. 2019లో ఏపీలో తూర్పున కొత్త పార్టీ ఉదయించబోతోందని చెప్పుకొచ్చారు. కాపు ఉద్యమం జరుగుతున్న సమయంలో రాజమహేంద్రవరంలో ఈ వ్యాఖ్యలు చేసిన చింతా మోహన్‌.. హర్షకుమార్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంలు కలసి పార్టీ పెట్టబోతున్నారని, అధికారంలోకి వస్తారంటూ జోస్యం చెప్పారు. ఆ తర్వాత ఏమయిందీ తెలిసిందే.

చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా.. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తన చిలక జోష్యాలతో చింతా మోహన్‌.. సీఎం వైఎస్‌ జగన్‌పై తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఆరు సార్లు గెలిపించిన తిరుపతికి తాను ఏం చేశాననేది చెప్పుకుంటే ఓట్లు పడతాయి గానీ సీఎం వైఎస్‌ జగన్‌పై నోరు పారేసుకుంటే ఒరిగేదేమిటో చింతామోహన్‌కే తెలియాలి.

ఓడిపోయే సీటులో ఖర్చు ఎందుకన్నట్లుగా తిరుపతిలో ప్రచారం చేస్తున్న చింతా మోహన్‌.. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు కోట్లు ఖర్చు పెడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన చింతా మోహన్‌.. ఉప ఎన్నికల తర్వాత తనకు వచ్చిన ఓట్లను చూసి ఇంకెంత రెచ్చిపోయి మాట్లాడతారో చూడాలి.

Also Read : తిరుపతి ఉప ఎన్నిక : టీడీపీ, బీజేపీ ఆ మాటెత్తడం లేదేమి..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి