iDreamPost

మోడీ తీరుపై విపక్షాల విమర్శలు – చైనా మీడియా ప్రశంసలు

మోడీ తీరుపై విపక్షాల విమర్శలు – చైనా మీడియా ప్రశంసలు

గల్వాన్ లో చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ మరియు చైనా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఘర్షణల అనంతరం మోడీ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ మాట్లాడిన మాటలను విపక్షాలు తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. మన భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదని, మన సైనిక పోస్టులను ఎవరూ అక్రమించుకోలేదని మోడీ స్పష్టం చేశారు.మేము శాంతిని కోరుకుంటున్నాము, కానీ మా భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని మోడీ స్పష్టం చేయడంతో విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

విపక్షాల విమర్శలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని నరేంద్ర మోడీ కాదని సరెండర్ మోడీ అని ఎద్దేవా చేస్తూ విమర్శించారు. చైనా దూకుడుకు భయపడి ఇండియా భూభాగాన్ని చైనాకు అప్పగించారని, ఒకవేళ ఆ భూభాగం చైనాది అయితే మన సైనికులు ఎందుకు చంపబడ్డారు? వాళ్లు ఎక్కడ చంపబడ్డారు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందిస్తూ లైన్ ఆఫ్ కంట్రోల్(LAC) దగ్గర ఎలాంటి చొరబాటు జరగకపోతే ఇరు వైపుల. సైనిక దళాలు వెనక్కి మరలడానికి ఎందుకు చర్చలు జరిగాయి ? చైనాకు ప్రధాని క్లీన్ చిట్ ఇచ్చారా? ఒకవేళ అదే నిజమైతే డ్రాగన్ కంట్రీతో ఇంక మాట్లాడటానికి ఏముంటుంది? మేజర జనరల్స్ అసలు దేని గురించి, ఎందుకు చర్చలు జరుపుతున్నారు? ఇండియా భూభాగంలో ఏ విదేశీయులూ లేరని ప్రధాని అంటున్నారు. అదే నిజమైతే, మే 5-6 తేదీల్లో జరిగిందేంటి? ఈ నెల 16-17 తేదీల్లో దళాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగింది? మనం ఆర్మీ 20మంది సైనికుల ప్రాణాలను ఎందుకు కోల్పోయిందని ప్రశ్నించారు.

వివరణ ఇచ్చిన పిఎంవో

ప్రధాని వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. విపక్షాలు విమర్శించడంతో ప్రధానమంత్రి కార్యాలయం విపక్షాలకు వివరణ ఇచ్చింది. విపక్షాల విమర్శలు సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పిఎంవో దుయ్యబట్టింది. వాస్తవాధీన రేఖను అతిక్రమించే ప్రయత్నాలను చైనా సైన్యం చేసిందని మన సైన్యం గట్టిగా తిప్పికొట్టే యత్నంలోనే హింసాత్మక ఘటన చోటుచేసుకుందని వివరించింది.

చైనా మీడియా ప్రశంసలు

మోడీ చైనాకు లొంగిపోయారని అందుకే చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని కాంగ్రెస్ విమర్శించగా దానికి పూర్తి భిన్నంగా చైనా మీడియా మోడీపై ప్రశంసల వర్షం కురిపించింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య మోడీ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని ఆ దేశ మీడియా పేర్కొంది. సంయమనం కోల్పోకుండా భారత ప్రజలను, చైనాను రెచ్చగొట్టకుండా మోడీ చాలా తెలివిగా వ్యవహరించారని అనేక మీడియా సంస్థలు మెచ్చుకున్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దోహదపడే విధంగా భారత ప్రధాని మోడీ మాట్లాడారని, ఇది మంచి పరిణామం అని చైనా పత్రికలు కథనాలు రాశాయి. మోడీ చేసిన వ్యాఖ్యలు మన విపక్షాలకు ఒకలా, విదేశీ మీడియాకు మరొకలా అర్థం కావడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి