iDreamPost

మన సరిహద్దులో చైనా చొరబడలేదు: ఏ స్థావరాన్నీ స్వాధీనం చేసుకోలేదు: అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోడీ స్పష్టం

మన సరిహద్దులో చైనా చొరబడలేదు: ఏ స్థావరాన్నీ స్వాధీనం చేసుకోలేదు: అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోడీ స్పష్టం

చైనా మన సరిహద్దుల్లోకి చొరబడడం కానీ, స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సరిహద్దులన్ని క్షేమంగానే ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఘర్షణపై శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన చివరిగా మాట్లాడుతూ, చైనా చేసిన దానికి యావద్దేశం ఆగ్రహానికి గురైందన్నారు. మన జవాన్లు వారికి పాఠం నేర్పారని అన్నారు. గత కొన్నేళ్లుగా మన సరిహద్దులను రక్షించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. మన భద్రతా దళాల అవసరాలు, యుద్ధ విమానాలు, ఆధునాతన హెలికాప్టర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇలాంటి వాటికి కూడా ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. గతంలో పర్యవేక్షించని ప్రాంతాల్లోనూ ఇప్పుడు మన జవాన్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మన సైనికులపై దేశానికి అపారమైన నమ్మకం ఉందని, దేశం మొత్తం వారితోనే ఉందని సైనికులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు. చర్యకు ప్రతి చర్య మన సైనికులు చేస్తారు. వాయు, ఆర్మీ, నేవీ త్రివిధ దళాలు దేశాన్ని రక్షించేందుకు ఏమైనా చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇండియా-చైనా సరిహద్దు అంశంలో ఇంటెలిజెన్స్‌ వైఫల్యం ఏమీ లేదని అన్నారు.

ఏం జరుగుతోందో తెలియాలి
 
ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియాలని, ద్వైపాక్షిక చర్చలు ఎక్కడ వరకు వచ్చాయో తెలపాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు కోరాయి. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని స్పష్టంగా చేసిన ప్రతిపక్షాలు ప్రభుత్వం నిర్థిష్ట చర్యలను వెల్లడించాలని కోరాయి. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. తొలిత ఇండియాాచైనా సరిహద్దు గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతి చెందిన అమరవీరులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జెపి నడ్డా (బిజెపి), సోనియా గాంధీ (కాంగ్రెస్‌), సీతారాం ఏచూరి (సిపిఎం), డి.రాజా (సిపిఐ), ఎంకె స్టాలిన్‌ (డిఎంకె), మమతా బెనార్జీ (తృణముల్‌ కాంగ్రెస్‌), శరద్‌ పవర్‌ (ఎన్‌సిపి), మాయవతి (బిఎస్పీ), ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన), వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (వైసిపి), కె.చంద్రశేఖర్‌ రావు (టిఆర్‌ఎస్‌), నితీష్‌ కుమార్‌ (జెడియు), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), పన్నీర్‌ సెల్వం (అన్నాడింకె), పినాకి మిశ్రా (బిజెడి), సుఖ్‌భీర్‌ బాదల్‌ (శిరోమణి అకాలీదళ్‌), హేమంత్‌ సోరెన్‌ (జెఎంఎం), చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్‌జెపి), ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ (ఎస్‌కెఎం), జోరంథ్మంగ (ఎంఎన్‌ఎఫ్‌), కోన్‌రాడ్‌ సంగ్మా (ఎన్‌పిపి) తదితరులు పాల్గన్నారు.

ఇంటెలిజెన్స్‌ వైఫల్యామా?

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ ”ఒక విషాద సంఘటన తరువాత కలిశాం. మన హృదయాలు చాలా దు:ఖంతోనూ, ఆవేదనతోనూ నిండి ఉన్నాయి. మన ధైర్య సైనికులకు నివాళులర్పిస్తున్నాం. వారు తమ జీవితాలను అర్పించారు. వారికి నా సంతాపనాన్ని, వారి కుటుంబాలకు నా ప్రగఢ సానుభూతిని తెలుపుతున్నాను. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ”అయితే 2020 మే 5న లడఖ్‌, ఇతర ప్రాంతాల్లో అనేక చోట్ల చైనా చొరబాటుకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి అందిన వెంటనే ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండేది. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు దేశం మొత్తం కలిసికట్టుగా ఉండాలి. ఈ సంక్షోభానికి సంబంధించి అనేక కీలక అంశాల గురించి మాకు ఇంకా స్పష్టత లేదు. అంధకారంలో ఉన్నాం” అని పేర్కొన్నారు. ”దీనిపై ప్రభుత్వానికి కొన్ని నిర్థిష్ట ప్రశ్నలు వేస్తున్నాం. లడఖ్‌లోని మన భూభాగంలోకి చైనా చొరబడటం గురించి ప్రభుత్వం ఎప్పుడు కనుగొన్నది? ఇది మే 5న? లేక అందుకు ముందేనా? దేశ సరిహద్దుల ఉపగ్రహ చిత్రాలను రోజూ ప్రభుత్వం స్వీకరించలేదా? మన అంతర్గత ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు ఎల్‌ఎసి వెంట ఏదైనా అసాధారణమైన కార్యచరణను నివేదించలేదా? మిలిటరీ ఇంటెలిజెన్స్‌ చైనా వైపు, లేదా భారత్‌ వైపు అయినా ఎల్‌ఎసి వెంట చొరబడటం, భారీ నిర్మాణం గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయలేదా? ప్రభుత్వం పరిగణించిన దృష్టిలో వైఫల్యం ఉందా?” అని ప్రశ్నించారు.

మే 5 నుంచి జూన్‌ 6 వరకు జరిగిన కమాండర్స్‌ సమావేశాలతో భారత్‌ విలువైన సమయాన్ని వృధా చేసుకుందని కాంగ్రెస్‌ పార్టీ నమ్ముతుందని అని అన్నారు. జూన్‌ 6 సమావేశం తరువాత కూడా రాజకీయ, దౌత్య స్థాయిల్లో చైనా నాయకత్వంతో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నాలు జరిగాయా? ప్రశ్నించారు. మనం అన్ని మార్గాలను ఉపయోగించడంలో విఫలం అయ్యామని, దానిమూలంగా 20 మంది సైనికుల ప్రాణాలను కోల్పోయామని, పదుల సంఖ్యలో సైనికులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి ఇప్పటి వరకు అన్ని వాస్తవాలను, సంఘటనల క్రమాన్ని రాజకీయ పార్టీలతో పంచుకోవాలని ప్రధాని మోడీ కోరారు. ముందుకు వెళ్లే మార్గం ఏమిటీ? యథాతథ స్థితి పునరుద్ధరించబడుతుందనే భరోసా మొత్తం దేశం కోరుకుంటుందని, చైనా వాస్తవ నియంత్రణ రేఖపై అసలు స్థితికి తిరిగి వస్తుందా? అని ప్రశ్నించారు. ఏదైనా ముప్పును ఎదుర్కోవటానికి దేశ రక్షణ దళాల సంసిద్ధత గురించి కూడా వివరించాలని కోరారు. 2013లో మంజూరు చేయబడిన రెండు పర్వత పదాతిదళ విభాగాలతో మౌంటైన్‌ స్ట్రైక్‌ కార్ప్స్‌ ప్రస్తుత స్థితి ఏమిటీ? ప్రశ్నించారు. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చూడటం లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ భద్రతా దళాలకు మద్దతుగా నిలబడతామని, వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించడానికి ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలను, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకుంటుందని, తమకు క్రమం తప్పకుండా సంక్షిప్తీకరిస్తుందని దేశం మొత్తం ఆశిస్తోందన్నారు. తద్వారా మన ఐక్యత, సంఘీభావం చిత్రాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తామన్నారు.

ద్వైపాక్షిక ఒప్పందాలతో శాంతి, సామరస్యం

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో ఇండో-చైనా ఎల్‌ఐసి వెంట ఇటీవలి జరిగిన ఘర్షణలో మన దేశ ఆర్మీ అధికారులు, సైనికులు మరణించినందుకు సిపిఎం ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతుందని అన్నారు. మన దేశ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి మధ్య చర్చలకు సంబంధించిన అధికారిక ప్రకటనలో ఇలా పేర్కొంది.”మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతమైన రీతిలో నిర్వహించాలని, సరిహద్దు నుంచి బలగాలను వెనక్కి రప్పించే విషయమై జూన్‌ 6 నాటి అవగాహనను ఇరు పక్షాలు చిత్తశుద్ధితో అమలు చేయాలని, ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే ఎటువంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని, ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా శాంతి, సామరస్యాలను పరిరక్షించేలా చూడాలి అని చర్చల్లో నిర్ధారణకు వచ్చాము” భారత ప్రభుత్వం ఈ వైఖరిని చేపట్టినందున దానికి సిపిఐ(ఎం) మద్దతు తెలియజేస్తుంది. దీనిని అనుసరించి భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చలను ప్రారంభించాలి. సరిహద్దుల్లో శాంతి, సామరస్యాన్ని పరిరక్షించడం, సరిహద్దును స్పష్టంగా నిర్వచించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ మనల్ని తన కూటమిలోకి లాగేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా వ్యూహంలో భారత్‌ బందీ కారాదని అన్నారు.

ఎన్‌సిపి చీఫ్‌, మాజీ రక్షణ మంత్రి శరద్‌ పవర్‌ మాట్లాడుతూ సైనికులు ఆయుధాలు తీసుకెళ్లారా? లేదా? అనే విషయాలను అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా నిర్ణయిస్తామని, ఇలాంటి సున్నితమైన విషయాలను మనం గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రభుత్వానికి ప్రతిపక్షాలు మద్దతు ప్రభుత్వానికి ప్రతిపక్షాలన్ని మద్దతు తెలిపాయి. తీసుకునే చర్యలకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశాయి. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ భారత దేశం శాంతిని కోరుకుంటుందని, కానీ మేము బలహీనంగా ఉన్నామని దీని అర్థం కాదని అన్నారు. చైనా స్వభావం ద్రోహమని అన్నారు. అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ మాట్లాడుతూ పరిస్థితిని నిర్వహించడాన్ని ప్రశ్నించడానికి సరైనా సమయం కాదని, దేశం ప్రధానితోనే ఉందని, అందరం ప్రధానితో ఉన్నామని చైనాకు సందేశం ఇద్దామని అన్నారు.

ఎస్పీ ఎంపి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ”దేశం ఒకటి. పాకిస్తాన్‌, చైనాకు చెందిన నీయత్‌ మంచిది కాదు. భారత దేశం చైనా డంపింగ్‌ గ్రౌండ్‌ కాదు. చైనీస్‌ వస్తువులపై 300 శాతం సుంకం విధించండి” అని పేర్కొన్నారు. బిజెడి ఎంపి పినాకి మిశ్రా మట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా బలమైన చర్యలను ప్రారంభించాల్సి ఉంటుందని, ఆ చర్యలు ఏమైనప్పటికీ బిజెడి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇస్తుందని అన్నారు. దేశం మొత్తం ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వైసిపి అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భారత దేశం ఖ్యాతి పెరిగిందని, ప్రధాని మోడీ ప్రపంచ వ్యాప్తంగా కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించారని తెలిపారు. చైనా భారత దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. జెడియు అధినేత నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేకంగా అసంతృప్తి వ్యక్తం అవుతుందని, మన మధ్య తేడా ఉండకూడదని అన్నారు. భారతదేశంపై చైనా వైఖరి తెలిసిందని, చైనాకు గౌరవం ఇవ్వాలని భారత్‌ కోరుకుంటుందని పేర్కొన్నారు. తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనార్జీ మాట్లాడుతూ ఐక్యతతో మాట్లాడి..ఐక్యతతో ఆలోచించాలని అన్నారు. మనం గెలుస్తామని, చైనా ఓడిపోతుందని అని పేర్కొన్నారు.

ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజకీయ పార్టీలు

ఆర్జేడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలను అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించలేదు. దీంతో కేంద్ర తీరుపై ఆర్జేడీ మండిపడింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్జేడీ ఎంపిలు పార్లమెంట్‌లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌన నిరసన తెలిపింది. అఖిల పక్ష సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించకపోవడంతో ఆర్జేడీ రాజ్యసభ ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఎంఐఎం అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపి ప్రధాని మోడీకి లేఖ రాశారు. అఖిల పక్ష సమావేశానికి ఆహ్వానించకపోడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆప్‌ రాజ్యసభ పక్షనేత సంజరు సింగ్‌ కేంద్ర తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆహ్వానించకపోడమేంటనీ ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి