iDreamPost

వివాహేతర సంతానానికి వారసత్వ ఆస్తి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంతానానికి వారసత్వ ఆస్తి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇటీవల కాలంలో కోర్టులు పలు ఆసక్తికరమైన తీర్పులు ఇస్తున్నాయి. స్థానిక కోర్టు మొదలు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకు.. అన్ని కోర్టులు అనేక సంచలన తీర్పులు ఇస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తులు, సమాన హక్కులు, భార్యపై దూషణల వంటి కేసుల్లో కోర్టులు ఆసక్తికరమైన  తీర్పులు ఇచ్చాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన పిల్లలకు సంబంధించిన ఓ విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. హిందూ చట్టాల ప్రకారం వివాహేతర సంబంధాల ద్వారా పుట్టిన పిల్లలకు వారసత్వ ఆస్తిలో వాటా ఉంటుందా? అనే ప్రశ్నకు.. తాజాగా తీర్పు ఇచ్చింది.

అక్రమ సంబంధాల కారణంగా పుట్టిన పిల్లలకు వారసత్వ ఆస్తి విషయంపై 2011లో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఏళ్ల క్రితం దాఖలైన పిటిషన్ విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటు కాని లేదా రద్దు చేయదగ్గ వివాహల ద్వారా జన్మించిన పిల్లల చట్టబద్ధమైన వారసులేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. విచారణలో భాగంగా సుప్రీం కోర్టు మరికొన్ని కీలక విషయాలను వెల్లడించింది. హిందూ వారసత్వ చట్ట కింద అవిభాజ్య కుటుంబాలోని  తల్లిదండ్రులకు వచ్చిన పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఇలాంటి పిల్లలకు కూడ ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తేల్చి చెప్పింది.

చట్టబద్ధతలేని లేదా రద్దు చేసుకున్న వివాహాల ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిపై హక్కు ఉండదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీజేఐ ధర్మాసనం విభేదించింది. ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ ధర్మాసనం కొట్టివేసింది. చట్టబద్ధత లేకుండా పుట్టిన పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటాకు అర్హులు కాదని, ఏదైనా ఉంటే స్వీయ, అర్జిత ఆస్తులను పొందడానికి మాత్రమే అర్హులని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తాజాగా ఆ తీర్పును సుప్రీం కోర్టు పక్కనబెట్టింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ ద్వారా పుట్టిన పిల్లలకు పూర్వీకుల ఆస్తిలో వాటాకు అర్హులని అభిప్రాయపడింది. వివాహేతర సంబంధాల ద్వారా జన్మించిన పిల్లలు తన తల్లిదండ్రుల ఆస్తిపై మాత్రమే హక్కులు పొందగలరని, మరే ఇతర ఆస్తులను పొందలేరని సందేహాస్పద నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని కూడా కోర్టు పేర్కొంది. మరి.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి