iDreamPost

అదే తీరు.. అదే ట్వీటు..

అదే తీరు.. అదే ట్వీటు..

ఎవరెన్ని విమర్శలు చేసినా గానీ తనకేంటి అనుకుంటూ, తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతుంటారు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. ఎదురుగా ఉన్న వాళ్ళను తన మాటలతో నమ్మించేసే ప్రయత్నం చేస్తుండడాన్ని ఆయన ప్రత్యర్ధులు ఎన్నిసార్లు ఎత్తిచూపినప్పటికీ తనదైన శైలిని ఆయన ఏనాడూ మానుకోవడం లేదు. ఇప్పుడు తాజా వైజాగ్‌లో ఆక్రమణలకు పాల్పడిన గీతం భవనాలను కూల్చివేత విషయంలో కూడా తన మార్కు ట్వీటుతో మరోసారి రెచ్చిపోయారు చంద్రబాబు.

కట్టలేనివారికి కూల్చే హక్కులేదని, బీహార్‌ ఆఫ్‌ సౌత్‌ అంటూ ఏపీని అంటున్నారంటూ.. ఏవేవో ప్రాసలతో కూడిన వాక్చాతుర్యాన్ని తన ట్వీటు వేదికపైగా జనంపైకి వదిలారు. ఇందులో ప్రభుత్వానికి బద్నాం చేయడం అనే ఒకే ఒక్క సింగిల్‌లైన్‌ అజెండాతో ట్వీటుమొత్తం నిండిపోయింది. గీతం సంస్థలపై సింపతీని పోగుచేసే ప్రయత్నం చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

అయితే ఆయన ట్వీటు, ఆయన ఇష్టం ఇంత వరకు ఎవ్వరూ అభ్యంతరం చెప్పడం లేదు. కానీ కూల్చివేస్తున్న భవనాలు అక్రమంగా నిర్మించినవా? కాదా? అన్నది మాత్రం ఎక్కడా చంద్రబాబు పేర్కొనకపోవడాన్నే ఇప్పుడు ఆక్షేపిస్తున్నారు. విజయవాడలో కరకట్ట భవనం కూల్చివేత దగ్గరనుంచి ప్రారంభిస్తే తన పార్టీకి చెందిన వారు అక్రమంగా చేసిన ప్రతి పనినీ వెనకేసుకు వచ్చే క్రమంలో, అసలా పని సక్రమమా? అక్రమమా? అన్నది తేల్చకపోవడంతో చంద్రబాబు గొప్పదనమని అధికార వైఎస్సార్‌సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని, ఇప్పటిక్కూడా అదే తీరు కొనసాగిస్తున్నారంటూ విమర్శల దాడికి వారు తెరలేపుతున్నారు. రాజకీయ అక్కసు, కక్షసాధింపు ధోరణి అంటూ చెప్పుకొస్తున్న చంద్రబాబునాయుడు గీతం సంస్థలు చేసిన ఆక్రమణను బాబు సమర్ధిస్తున్నారా? అన్నది సూటిగా చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి