iDreamPost

ఎం తమ్ముళ్లూ మీకు కావాల్సిన బ్రాండ్స్ దొరుకుతున్నాయా ? . బాబు .

ఎం తమ్ముళ్లూ మీకు కావాల్సిన బ్రాండ్స్ దొరుకుతున్నాయా ? . బాబు .

ఒక వ్యక్తికి కానీ , సంస్థకి కానీ తమది కాని విధానం, తమకు అవకాశం ఉన్నప్పుడు అమలు చేసే ప్రయత్నం చేయని కార్యాచరణ కానీ ఇతరులకు బోధించే అర్హత ఉండదు .

2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదటి ఐదు సంతకాల్లో బెల్ట్ షాపుల నిషేధం కూడా ఒక సంతకం . కాగా బెల్ట్ షాపులనేవి అక్రమం అయితే వాటి పై అధికారికంగా నిషేదం విధించడం ఏమిటో. అది మొదటి సంతకం ఏమిటో అంటూ రాష్ట్రంలో పలు వర్గాలు విస్మయం వ్యక్తం చేయగా ఏదొకటిలే ప్రజలకి మంచి జరగబోతుంది అని సామాన్యులు , మహిళలు హర్షం వ్యక్తం చేశారు .

అయితే జరిగింది ఏమిటీ ?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4500 పై చిలుకు మద్యం దుకాణాలకు అనుబంధంగా దాదాపు 50 వేల బెల్ట్ దుకాణాలు పల్లెల్లో వెలిశాయి . అలాంటి ఘన చరిత్ర కలిగిన బాబు గారు , టీడీపీ ప్రతినిధులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హామీ మేరకు దశల వారీగా మధ్యపానాన్ని అదుపు చేస్తుంటే చేసిన ఆరోపణలు ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకొనే వారి వైఖరిని బహిర్గతం చేశాయి.

ఈ ఆరోపణలు ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.

1. తిరుమల లడ్డు ధర పెరిగిన సందర్భంగా బాబు తిరుపతి సభలో మాట్లాడుతూ అక్కడ మద్యం రేట్లు పెంచి వినియోగం తగ్గుతుంది అని అమలు చేసినట్లుగానే , ఇక్కడ లడ్డు ధర పెంచి భక్తులు రాకుండా చేస్తున్నారని అత్యంత దిగజారి తిరుమల పవిత్రతకి భంగం కలిగిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

2 . మద్యపాన ప్రియులకు కావాల్సిన అన్ని బ్రాండ్స్ దొరక్క అవస్థలు పడుతున్నారు అంటూ అసెంబ్లీలో మరెవరూ దొరకనట్టు మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చేత మాట్లాడించి ఆమెని అపహాస్యం పాలు చేశారు .

3 . ప్రకాశం జిల్లా జనచైతన్య యాత్రలో బాబు మాట్లాడుతూ పని చేసి అలిసిపోయిన తాగుబోతులు రెండు పెగ్గులేస్తే తప్పా అని వ్యాఖ్యానించి ఎం తమ్ముళ్లూ మీకు కావాల్సిన బ్రాండ్స్ దొరుకుతున్నాయా అని అడిగి మరీ లేదని చెప్పించుకొని , కావాల్సిన బ్రాండ్స్ మద్యం సరఫరా చేయకుండా తాగుబోతుల పొట్ట కొడుతుందీ ప్రభుత్వం అని చప్పట్లు కొట్టించుకొనే ప్రయత్నం చేయడం విశేషం .

4 . పలువురు టీడీపీ నేతలు సైతం తమవారికి కావాల్సిన బ్రాండ్స్ దొరకట్లేదని, ధరలు పెరిగాయని, మద్యం ఏరులై ప్రవహిస్తుందని పరస్పర విరుద్ధ ఆరోపణలు చేస్తూ దశల వారీ మధ్య నిషేధం విధానం పై పలు విమర్శలు గుప్పించారు .

ఈ ఆరోపణలు నిజాలేనా , రాష్ట్రంలో మద్యం ఏరులై ప్రవహించబోతుందా , జగన్ కమీషన్ల కోసమే మద్యం తయారు చేయిస్తున్నాడా , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడా ? ఏది నిజం అన్నది పరిశీలించి చూద్దాం . ఇందు కోసం జగన్ కొత్త మద్యం పాలసీని ప్రవేశ పెట్టిన 2019 OCT నుండి 2020 FEB వరకూ ఐదు నెలల్ని ఒక శాంపిల్ గా తీసుకొని గత బాబు గారి హయాంలో 2018 OCT నుండి 2019 FEB ఐదు నెలలతో సరిపోల్చి చూద్దాం .

1 . బాబు గారి హయాంలో ఉదయం 6.00 నుండి రాత్రి 12.00 వరకూ మద్యం దుకాణాలూ , బార్లలో మందు అందుబాటులో ఉండేది అని ప్రపంచానికి విదితమే . అలాగే ఒక్కో వైన్ షాప్ కి అనుబంధంగా పల్లెటూర్లలో 12 నుండి 15 బెల్ట్ షాప్స్ ఊరికి నాలుగు చొప్పున అందుబాటులో ఉండేవి అన్నది ఇంకా పచ్చి ఆరని నిజం .

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట బెల్ట్ షాప్స్ అనేది లేకుండా చేసిన విషయం బహిరంగ సత్యం . అలాగే వైన్ షాప్ లను ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకొని 20 శాతం దుకాణాలను తగ్గించడం , బార్లను 40 శాతం తగ్గించడం చేసింది. అమ్మకపు వేళల్ని కుదించి వైన్ షాప్స్ ఉదయం 10.00 నుండి రాత్రి 8.00 వరకూ , బార్లలో ఉదయం 10.00 నుండి రాత్రి 10.00 వరకు మాత్రమే అమ్మకాలకు అనుమతించి నియమిత వేళలు మీరకుండా కట్టడి చేసిన విషయం బహిరంగ సత్యం .

2 . టీడీపీ హయాంలో ప్రతి నెలా అమ్మకాల్ని మించి మరుసటి నెలకి టార్గెట్స్ ఉండేవి అన్నది అధికారిక వార్తే . ఇందుకోసం ఎక్సయిజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులే ఆయా షాప్స్ , బార్ల పై ఒత్తిడి చేసి మద్యం ఎక్కువగా అమ్మటానికి కృషి చేసేవారు . బాబు గారి హయాంలో లిక్కర్ అమ్మకాల్ని చూస్తే 2018 OCT నుండి 19 FEB వరకూ 16304645 (కోటి అరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు ) కేసుల లిక్కర్ ప్రవహించింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 OCT నుండి 20 FEB వరకూ 11294989 (కోటి పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది) కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి .

అంటే ఐదు నెలల కాలానికి 5009656 (యాభై లక్షల తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు ) కేసుల లిక్కర్ ప్రవాహo జగన్ హయాంలో తగ్గింది . ఇది ముఖ్యంగా బీదసాదలు తాగే చీఫ్ లిక్కర్ వినియోగంలోనే తగ్గింది . దాదాపు 30 శాతం లిక్కర్ వినియోగం బాబు గారి హయాంలో కన్నా జగన్ పాలనా కాలంలో తగ్గింది .

3 . ఇహ యువత ఎక్కువగా వినియోగించే బీర్ల లెక్క చూస్తే బాబు గారి హయాంలో 2018 OCT నుండి 19 FEB వరకూ 10845934 (కోటి ఎనిమిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ) కేసుల బీరు ప్రవహించింది . అదే జగన్ హయాంలో 2019 OCT నుండి 20 FEB వరకూ 4120077 (నలభై ఒక్క లక్షా ఇరవై వేల డెబ్భై ఏడు) కేసుల బీరు అమ్మకాలు జరిగాయి .

అంటే ఐదు నెలల కాలానికి 6725857 (అరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు)కేసుల అమ్మకం జగన్ హయాంలో తగ్గింది .
ఈ బీర్లు ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ , యువతనే వినియోగించేది . బాబు గారి జమానాలో కన్నా జగన్ హయాంలో షుమారు 62 శాతం బీర్ల వినియోగం తగ్గింది . ఒక భవిష్యత్ తరం మద్యానికి బానిసలు కాకుండా కట్టడి చేసిందీ తగ్గింపు .

4 . ఆర్ధిక పరమైన అంశాల విషయానికి వస్తే ఈ ఐదు నెలల కాలానికీ బాబు గారి జమానాలో మద్యం అమ్మకాల ద్వారా 8649.30 కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ కాగా , అదే జగన్ హయాంలో 8144.24 కోట్లు రాష్ట్ర ఖజానా ఖాతాలో జమ అయ్యాయి .ఇక్కడ ఇంకో ముఖ్య విషయం గమనిస్తే లిక్కర్ 30 శాతం , బీర్ 62 శాతం వినియోగం తగ్గితే ప్రభుత్వ ఖజానాకు జమ అయిన ఆదాయం మాత్రం 6 శాతమే తగ్గింది . ఎందుకంటే మద్యం ధరలు పెంచి పేదలకు అందుబాటులో లేకుండా చేస్తానన్న జగన్ మద్యం పాలసీ ద్వారా మద్యం అమ్మకాలు తగ్గినా ప్రభుత్వ ఖజానాకు ఆదాయంలో లోటు రాలేదు .

కానీ ప్రభుత్వం దీన్ని ఆదాయంగా పరిగణించకుండా మద్యం వినియోగం మరింత తగ్గించే దిశగా ప్రస్తుతం ఉన్న ధరలు 25 శాతం పెంచుతూ అలాగే ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాలు మరో 25 శాతం తగ్గించి ప్రజలకు మద్యాన్ని మరింత దూరం చేసే దిశగా మరో ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకూ ఉదయం 10 గంటల నుండి రాత్రి ఎనిమిది వరకూ అంటే పది గంటల పాటు ఉండే అమ్మకం వేళల్ని మరో రెండు గంటలకు కుదించి ఉదయం 11 గంటల నుండీ రాత్రి 7 గంటల వరకే అమ్మకాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం ఈ విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు పోతుండగా ప్రతిపక్ష టీడీపీ మాత్రం గత ఆరోపణలకు విరుద్ధంగా మరో కొత్త పల్లవి అందుకొంది . ఇన్నాళ్లు మద్యం ధరలు అందుబాటులో ఉండట్లేదని , కావాల్సిన బ్రాండ్స్ దొరకట్లేదని ఆరోపణలు చేస్తూ మద్యపాన ప్రియుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు , ఇప్పుడు కొత్తగా ఒకేసారి సంపూర్ణ నిషేధం పల్లవి అందుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు మద్యం అందుబాటులో లేనందున ప్రజలు అలవాటు తప్పారని అందువలన ఒకేసారి నిషేధించాలని టీడీపీ చేస్తున్న డిమాండ్ వెనుక ఉన్న ఆలోచనలను పరిశీలిస్తే విస్మయం కలగక మానదు .

గత 41 రోజులుగా మద్యం పూర్తిగా అందుబాటులో లేకపోవడం వలన పలు ప్రాంతాల్లో నాటుసారా తయారీ , అక్రమ మద్యం అమ్మకాల ప్రయత్నాలు మొదలయ్యాయి . అయితే లాక్ డౌన్ కారణంగా పోలీస్ వ్యవస్థ మొత్తం ఇతర కార్యకలాపాలు దాదాపు నిలిపివేసి లాక్ విధుల్లోనూ , గస్తీ విధుల్లోనూ క్షేత్రస్థాయిలో పని చేస్తుండటం వలన ఎక్కడ అక్రమ మద్యం అమ్మకం , నాటు సారా తయారీ మొదలైతే సత్వరం అక్కడికి చేరుకొని సీజ్ చేయడం , బట్టీలు ధ్వంసం చేసి అక్రమాదారుల్ని అదుపులోకి తీసుకొని కట్టడి చేయడం జరిగింది .

సమీప భవిష్యత్తులో లాక్ డౌన్ ఎత్తేసిన పిదప మద్యం ఒకేసారి నిషేధిస్తే తలెత్తే నాటుసారా , అక్రమమద్యం సమస్యలని పలు విధుల్లో నిమగ్నమయ్యి ఉండే పోలీసులు సంపూర్తిగా కట్టడి చేయగలరా ? ఒకేసారి నిషేధం వలన మద్యం దొరక్క మెడికల్ డ్రగ్స్ వినియోగం లాంటి ఉత్పన్నమయ్యే పలు సమస్యలను కంట్రోల్ చేయగలమా ? ఇది అసాధ్యం కాబట్టే నాడు కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు సంపూర్ణ నిషేధం విఫలమవుతుంది , దశల వారీ నిషేధమే సరియైనది అని ప్రభుత్వ సారా మాత్రమే నిషేదించగా , వారి పై తీవ్ర ఆరోపణలు చేసి ఆ వ్యతిరేకతతో అధికారాన్ని సాధించుకున్న టీడీపీ హయాంలో నాడు నాటుసారా , గుడుంబా , అక్రమ మద్యం లాంటివి ఎలా ఏరులై పారాయో పెద్దలు అందరికీ విదితమే . ఆవిధంగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం బాబుగారు అధికారాన్ని చేజిక్కించుకోగానే ఈ వైఫల్యాన్ని చూపి నిషేధం ఎత్తివేయటం చాలా కన్వినెంట్ గా జరిగిపోయింది .

ఇలా పార్టీ పెట్టిన నాటి నుండి ఏ దశలోనూ తాము ఆచరించలేని , తమకు నమ్మకం లేని , తాము విఫలమైన మద్యపాన నిషేధ వ్యవహారం పై , సమగ్ర విధానంతో పకడ్బందీ చర్యలతో దశల వారీ నిషేధానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి సలహాలివ్వటం విడ్డూరం మాత్రమే కాదు . వైసీపీని ఒత్తిడికి గురిచేసి పొరపాట్లు చేయించి తాము రాజకీయ లబ్ది పొందే కుట్రలో భాగమని చెప్పవచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి