iDreamPost

రాష్ట్రం దివాళా తీసిందట – బాబు గారి ఉవాచ.

రాష్ట్రం దివాళా తీసిందట – బాబు గారి ఉవాచ.

రాష్ట్రంలో రాజకీయంగా , సామాజికంగా ఎన్ని మార్పులు జరిగినా తెలుగుదేశం పార్టికి వంత పాడే పత్రికలకు , మీడియా ఛానల్లకు అవేమి పట్టవు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థానంలో ఉన్నా , ఏ హోదాలో ఉన్నా వారికి మాత్రం ఆయన ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టే భ్రమించుకుంటారు. గడచిన ఏడాదిగా రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ది సాదించింది, ఏ మేరకు వాటి నుండి సత్ఫలితాలు సాదిస్తున్నాము అనే చర్చని ముఖ్యమంత్రి జగన్ గారు “మన పాలన మీ సూచన” కార్యక్రమం ద్వారా చర్చిస్తుంటే అవేమి పట్టనట్టు చంద్రబాబు జూం యాప్ ద్వారా నిర్వహిస్తున్న మహానాడులో చేసిన అడ్డగోలు ఆరోపణలనే నిజాలుగా బ్యానర్ ఐటంగా మార్చి ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

దీనికి ఉదాహరణగా నేడు తెలుగుదేశానికి మద్దతు పలికే ప్రముఖ దినపత్రికలో వచ్చిన బ్యానర్ ఐటం చూస్తే అర్ధం అవుతుంది. పెద్ద పెద్ద అక్షరాలతో “రాష్ట్రం దివాళ” అని రాసిందే కాని రాష్ట్రం ఏ అంశంలో ఏ రంగంలో దివాలా తీసిందో రాయలేకపోయింది, 80వేల కోట్లు అప్పు చేశారు అని రాసారు కానీ ఆ అప్పు ఎక్కడ చేశారు, దేనికి చేశారు అని లెక్కలు రాయలేకపోయింది సదరు పత్రిక, అలాగే 50వేల కోట్ల పన్నులు వేశారు అని రాశారే కానీ ఏ రంగం లో అంత పన్ను వేశారో వివరించలేకపోయింది. నిజానికి రాష్ట్రప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ విద్యుత్ రంగాలకి సంభందిoచి మాత్రమే పన్నులు స్వల్పంగా పెంచింది . ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తు తీసుకున్న నిర్ణయం కారణంగా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి కిలోమీటర్ కు 10 పైసలు చొప్పున స్వల్పంగా పెంచారు. అలాగే విద్యుత్ రంగంలో 500 యూనిట్లు వరకు ఖర్చు చేయగల సామర్ధ్యం ఉన్న ధనవంతులకు మాత్రమే 90పైసలు చొప్పున చార్జీలు పెంచారు . వీటివల్ల దనవంతులకు పడే భారం 1300 కోట్లు. ఇలా ఆర్టీసీ, విధ్యుత్ రంగాల్లో అత్యంత స్వల్పంగా పన్నులు పెంచారు తప్ప మరే రంగంలో పెంచకపోయిన ఏకంగా 50వేల కోట్లు పన్ను బారం మోపారు అని చంద్రబాబు అనడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది.

నిజానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో 5 ఏళ్ళు ఉండి తాను ఎంత ఆర్ధిక క్రమశిక్షణ పాటించారో అన్నదానికి రాష్ట్రం మొత్తం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన విషయం ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉండరు . ఆ ప్రతిఫలమే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడు చూడని ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం గెజెట్ గా పేరొందిన ఇదే పత్రికలోనే రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలాయి అని జీతాలకు పెన్షన్లకు 5వేల కోట్లు, వృద్ధాప్య పించన్లకు 1200 కోట్లు అవసరం అవుతాయని ఈ పూట గడవాలంటేనే మొత్తం 6,200 కోట్లు అవసరం అని రాసింది. అలాగే గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే అన్నిచోట్ల నుండి మేము అప్పులు తెచ్చేశామని, ఇక జగన్ కి అప్పులు పుట్టే అవకాశమే లేదని బహిరంగంగానే చెప్పుకొచ్చారంటే గత పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఎంత ప్రమాద పరిస్థితుల్లోకి నెట్టారో అర్ధం చేసుకోవచ్చు.

చంద్రబాబు గత 5 ఏళ్ళ పాలనలో కట్టలు తెగిన ఆర్ధిక క్రమశిక్షణ

2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగే నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు – లక్షా 66 వేల కోట్లుగా తేల్చారు. రాష్ట్ర జనాభా ప్రకారం 58% ఆంధ్ర ప్రదేశ్, 42% తెలంగాణకు అప్పుని విభజించగా, ఆంధ్ర ప్రదేశ్ 13 జిల్లాల భాగానికి 96 వేల కోట్ల అప్పుని పంచారు. 96 వేల కోట్ల అప్పుతో ప్రారంభమైన నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగా, 2019 ఎన్నికల్లో ఆయన దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 96వేల కోట్ల నుండి 3.65 లక్షల కోట్లు కు చేర్చారు. నిజానికి ఆంధ్రప్రదేశ రాష్ట్రం అప్పుల ముప్పులో ఉందని 2016 లోనే కాగ్ ( కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్) తన నివేదికలో హెచ్చరించింది. రాష్ట్రంలో అప్పులు ఆదాయం మధ్య సమతుల్యం తప్పుతుందని హెచ్చరించింది కూడా. 58 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో మన వాటాకి వచ్చిన అప్పు 96వేల కోట్లు అయితే, 2014 నుండి 2019 వరకు 5 ఏళ్ళల్లో చంద్రబాబు 3.65 లక్షలకోట్లు అప్పు చేసి వెళ్ళారు. అంటే రాష్ట్రంలో సగటున ఒక మనిషి నెత్తి మీద 42,500 భారం మోపి వెళ్ళారు బాబు. డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టారు. మాట్లాడితే సంపద సృష్టించా అని చెప్పుకునే చంద్రబాబుని అంత డబ్బుని ఏం చేశారు అని అడిగితే ఇప్పటికీ ఆయన నుండి సమాధానం దొరకదు.

ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన జగన్ ఎక్కడా తొణకకుండా పాలన మొదలు పెట్టారు. ఎంత ఆర్ధికలోటు ఉన్నా ఏడాదిలోనే చెప్పింది చెప్పినట్టుగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలను 90% పైగా నేరవేర్చారు. తాను ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు తన పధకాల ద్వారా రాష్ట్రంలో లబ్ది పొందిన వారి సంఖ్య 3కోట్ల 57 లక్షల మంది అని, దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 40వేల 139 కోట్లు కర్చుపెట్టిందని తెలియజేసారు , అలాగే 2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతోపాటు సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు రూ.968 కోట్లు కేటాయించి, మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశారు. 15వేల కోట్లతో కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయిన ఏడాదిలోనే కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

ఇలా జగన్ ప్రభుత్వం ఏడాదిలో సంక్షేమం, అభివృద్ది రెండిటిని సమపాల్లలో నడిపిస్తూ అవినీతి రహిత పాలన అందిస్తుంటే, అవినీతితో , దుబారా కర్చుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చంద్రబాబు పూర్తిగా అవాస్తవాలు చెప్పడం, అవే నిజాలుగా వారికి వంత పాడే పత్రికలు బ్యానర్ ఐటములు గా వేయడం శోచనీయం. కళ్ళ ముందు పూర్తి వాస్తవాలు ప్రజలకు కనపడుతున్న ఈ సమయంలో అప్పుల సామ్రాట్ గా పేరొందిన చంద్రబాబు అప్పుల విషయాన్ని ప్రచారంగా వాడుకోచూడడం సీనియర్ అని చెప్పుకునే బాబు, వారి అనుభంద మీడియా వేసిన తప్పటడుగే అనే వాదన వినిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి