iDreamPost

చెదిరిపోయిన చంద్రబాబు కల ..

చెదిరిపోయిన చంద్రబాబు కల ..

తెలుగులో ’కల చెదిరింది..కథ మారింది’ ఓ పాపులర్ పాటొకటుంది. చంద్రబాబునాయుడు కల కూడా అలాగే చెదిరిపోయింది. పాటలో చెప్పినట్లుగా కల ఎప్పుడైతే చెదిరిపోయిందో వెంటనే కథ కూడా మారిపోయింది. ఇంతకీ పాటకు చంద్రబాబుకు లింకు ఏమిటంటారా ? రెండు రోజుల డిజిటల్ మహానాడు సందర్భంగా రెండో రోజు మాట్లాడుతూ ’ తాను శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలని అనుకున్నాను’ అని నేతలతో చెప్పుకుని బాధపడ్డాడు.

అసలింతకూ ఈ విషయం చెప్పుకుని చంద్రబాబు ఎందుకు బాధపడ్డాడంటే అధికారంలో ఎవరు శాస్వతంగా ఉండరు అంటూ చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించాడు. ’శాస్వతంగా తానే అధికారంలో ఉంటానని జగన్ అనుకుంటున్నట్లున్నాడు, నేను కూడా అలానే అనుకున్నాను’ అంటూ ముగించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శాశ్వతంగా అధికారంలోనే ఉండిపోవటానికి ఇదేమీ రాజరిచకం కాదు. ప్రజాస్వామ్యంలో జనాలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.

1994లో జరిగిన ఎన్నికల్లో జనాలు ఎన్టీయార్ కు ఓట్లేసి గెలిపిస్తే ఏడాది తిరక్కుండానే వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలని ఎలా అనుకున్నాడో అర్ధం కావటం లేదు. పోనీ అప్పుడంటే అనుకున్నాడనే అనుకుందాం. 2004లో ఓడిపోయిన తర్వాత పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నపుడైనా అధికారం శాశ్వతం కాదని ఎందుకు గ్రహించలేకపోయాడో ఆశ్చర్యంగా ఉంది. అంటే చాలామంది అనుకుంటున్నట్లు, ఎల్లోమీడియా జాకీలేస్తున్నట్లుగా చంద్రబాబు మహా జ్ఞాని అయితే కాదని అర్ధమైపోయింది.

ఇక ముందే చెప్పుకున్నట్లుగా ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించేది ఓటర్లే. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబాసు కానీ ఇపుడు ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నారంటే కారణం వాళ్ళ పాలనా దక్షత అనే అనుకోవాలి. అంతే కానీ ఎన్నికలను మ్యానేజ్ చేసుకోవటం వల్ల వాళ్ళు వరుసగా గెలవలేదు. తమ పాలనతో జనాల మనసులను గెలుచుకున్నారు కాబట్టే సంవత్సరాల తరబడి అధికారం వాళ్ళు చేతుల్లో ఉంది. చంద్రబాబు హయాంలో ఇబ్బంది పడని వర్గమంటూ దాదాపు లేదనే చెప్పాలి. అందుకనే మొన్నటి ఎన్నికల్లో అనేక సామాజికవర్గాలు కసికొద్దీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లేసి ఘోరంగా ఓడగొట్టాయి.

ఇక జగన్ విషయం చూస్తే మొదటి సంవత్సరం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తున్నాడు. అయితే సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే సరిపోదు. రాబోయే రోజుల్లో అభివృద్ధి మీద దృష్టిపెట్టాలి. రెండింటిని బ్యాలన్స్ చేసుకుని మెజారిటి జనాల అభిమానాన్ని పొందినపుడు అధికారంలో కంటిన్యూ అవ్వటం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తం మీద ఆలోచిస్తే ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయించేది ఓటర్లే కానీ ఎవరికి వారు కాదన్న విషయం చంద్రబాబు బాగా అర్ధం చేసుకోవాలి. కొసమెరుపు ఏమిటంటే మొన్నటి ఎన్నికల్లో కుప్పం నుండి గెలిపించి చంద్రబాబును అసెంబ్లీకి పంపిన జనాలే మంగళగిరిలో పుత్రరత్నం నారా లోకేష్ ను చిత్తుగా ఓడగొట్టడం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి