iDreamPost

నన్నే అడ్డుకుంటారా..?

నన్నే అడ్డుకుంటారా..?

విశాఖ విమానాశ్రయంలో ప్రభుత్వం తనను అడ్డుకుందని. తనపై వైఎస్సార్‌సీపీ వాళ్లు దాడికి పాల్పడ్డారని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ రోజు విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు విమానాశ్రయంలో దిగగానే.. ప్రజలు బాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌ కదలకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. మూడు రాజధానులను చంద్రబాబు వ్యతిరేకిస్తుండడంతో ఉత్తరాంధ్ర వాసులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఉదయం నుంచి విశాఖ ఎయిర్‌పోర్టులో హైడ్రామా నడిచింది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు తనను అడ్డుకున్నారంటూ చంద్రబాబు రోడ్డుపై భైఠాయించారు. దాదాపు ఐదు గంటల తర్వాత మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 11 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పని చేసిన తననే అడ్డుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. ఇలా అయితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు డ్యూటీ సరిగా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 11 మంది ముఖ్యమంత్రులను చూశాను గానీ ఇలా ఎవరూ వ్యవహరించలేదని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పర్యటనకు పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నా… ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హాయంలో ఎప్పుడూ ఇలా తాము చేయలేదని చెప్పుకొచ్చారు. అనుమతి ఇవ్వకపోతే ఇక్కడ వరకూ వచ్చే వారంకాదన్నారు. అనుమతి ఇచ్చి అడ్డుకోవం ఏమిటిని ప్రశ్నించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి