iDreamPost

వాలంటీర్లపై చంద్రబాబు విమర్శలు.. తమ్ముళ్ల ప్రశంసలు..

వాలంటీర్లపై చంద్రబాబు విమర్శలు.. తమ్ముళ్ల ప్రశంసలు..

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఆది నుంచీ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని హేళన చేస్తున్న చంద్రబాబు ఈ సారి మరో అడుగు ముందుకేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పింఛన్‌ లబ్ధిదారుల నుంచి 500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా చంద్రబాబు వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు మూటలు మోసే వాళ్లని హేళన చేశారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో వెళ్లి తలుపులుకొడుతున్నారని కించపరిచేలా మాట్లాడారు. వాలంటీర్‌గా ఉంటే పెళ్లి కూడా కాదంటూ ఎగతాళి చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు బుద్ధి చెప్పేలా వాలంటీర్లు పని చేస్తున్నారు. కొత్త రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, అమ్మ ఒడి, రైతు భరోసా…ఇలా ప్రతి పథకాన్ని అర్హులకు అందిస్తూ వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల పింఛన్‌ డోర్‌ డెలివరీ కార్యక్రమం.. వాలంటీర్ల సేవలు ప్రజలకు ఏ స్థాయిలో మేలు చేస్తున్నాయో చాటి చెప్పింది. అందుకేనేమో మరో సారి టిడిపి అధినేత తన అక్కసును వెళ్లగక్కారు.

తమ అధినేత నిజా నిజాలు మరచి మాట్లాడుతున్నా.. కింది స్థాయిలో తమ్ముళ్లు మాత్రం వాలంటీర్లను కొనియాడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వమైనా.. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నైనా సరే.. ప్రభుత్వ పథకాలు కావాలంటే.. ఆ గ్రామ నేత ఇంటికి వెళ్లాలి. మాకు ఫించన్, రేషన్‌ కార్డు, ఇళ్లు.. కావాలంటూ అడగాలి. కనపడిన ప్రతి సారి నమస్కారాలు చేయాలి. ఎదురుపడగానే పళ్ళుగిలిస్తూ.. రాని నవ్వు తెచ్చిపెట్టుకోవాలి. లేదంటే అర్హత ఉన్నా సరే వారికి ప్రభుత్వ పథకాలు వచ్చేవి కావు. పంచాయతీ కార్యదర్శులు.. పంచాయతీ ముఖాలే చూడరు. మండల కేంద్రంలోనే ఉంటారు. ఈ చోటా నేతలతో సంబంధం లేకుండా ఒకరో ఇద్దరో.. నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు చేయాలా..? వద్దా..? అనేది సదరు కార్యదర్శి అధికార పార్టీ గ్రామ నాయకుడి అనుమతి తీసుకుంటారు. గ్రామ నేత ఎస్‌ అంటే వస్తుంది.. నో అంటే.. అర్హత ఉన్నా పథకం వారికి రాదు. ఇదే తీరు నిన్న మొన్నటి వరకు కొనసాగింది. ఇందుకు కాంగ్రెస్, టీడీపీలకు మినహాయింపులేమీ లేవు. ప్రస్తుతం వైఎస్సార్ సిపి లో ఉన్న నేతలు కూడా.. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మోనార్కుల్లా వ్యవహరించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక.. ప్రవేశపెట్టిన వాలంటీర్‌ వ్యవస్థ వల్ల లబ్ధిదారులు ఎవరి వద్దకు వెళ్లి దేబిరించాల్సిన పని లేకుండా పోయింది. అధికార పార్టీ గ్రామ నేత ఇంటికి ముందుకు వెళ్లి నిలబడాల్సిన అవసరం లేదు. ఆత్మాభిమానం చంపుకుని అడగాల్సిన అవసరం లేదు. పార్టీలో సంబంధం లేకుండా.. అర్హత ఉంటే చాలు వాలంటీర్లే వారి ఇంటికి వెళుతున్నారు. అవసరమైన అర్జీ వారే రాస్తున్నారు. దరఖాస్తుదారుని చేత సంతకం లేదా వేలిముద్ర వేయిస్తున్నారు. అర్జీకి అవసరమైన అర్హత పత్రాలు (రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు) నఖలు జత చేస్తున్నారు. లబ్ధిదారుడు తన పనులు మానుకుని కార్యాలయాలకు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వాలంటీర్లే వారి తరఫున అన్ని పనులు చక్కబెడుతున్నారు. సదరు పథకం మంజూరైన సమాచారం వాలంటీర్లే లబ్దిదారులకు చేరవేస్తున్నారు. 

జగన్‌ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ బాగుంది. మేము ఎవరి వద్దకు వెళ్లాల్సిన పని లేదు. వాలంటీర్లే మా ఇంటికి వస్తున్నారు. వారికే దరఖాస్తులు, పత్రాలుఇస్తాం. పథకం రాకపోతే.. తిరిగి వారినే అడుతాం. ఈ వ్యవస్థ విజయవంతమైతే చాలా బాగుంటుంది.. అంటూ గ్రామ స్థాయిలోని టీడీపీ కార్యకర్తలు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చున్న వారు చెబుతున్నారు. పైగా మరో ఆసక్తికరమైన విషయం చెబుతున్నారు. గతంలో నేరుగా అధికారుల వద్దకు వెళితే.. లంచాలు అడిగేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదంటూ వాలంటీర్‌ వ్యవస్థను కొనియాడుతున్నారు. ఏమైనా.. విజయవాడలో కూర్చున్న చంద్రబాబుకి.. క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతలకు వాస్థవ పరిస్థితులు తెలియడంలో తేడా ఉంటుంది కదా..?! అందుకే వలంటీర్ల పై చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటే.. తమ్ముళ్లు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి