iDreamPost

జగన్‌ హాయంలో వరద బాధితుడుగా మారిన చంద్రబాబు

జగన్‌ హాయంలో వరద బాధితుడుగా మారిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వరద బాదితుడుగా మారారు. ప్రతి ఏడాది ఆయనపై వరద ప్రభావం చూపుతోంది. కృష్ణా నది కరకట్ట వెంబడి లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో నివాసం ఉంటున్న భవనానికి తాజాగా అధికారులు వరద హెచ్చరిక నోటీసు అంటించారు.

సాధారణంగా గోదావరి నదికి ప్రతి ఏడాది వరదలు వస్తాయి. కృష్ణా నదికి పరివాహక ప్రాంతంలోనూ, రాష్ట్రంలోనూ వర్షాలు పడితే గానీ వరద రాదు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో సాధారణం కన్నా ఎక్కువ శాతం వర్షపాతం నమోదువుతోంది. దీంతో కృష్ణ, పెన్నా, వంశధార తదితర నదులన్నింటికి వరదలు వస్తున్నాయి. గత ఏడాది రాష్ట్రంలోని అన్ని నదులకు పలుమార్లు వరదలు వచ్చాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్నా నదులకు ఇప్పటికే పలుమార్లు వరదలు వచ్చాయి.

గోదావరి నది వరద వల్ల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా నది వరద వల్ల విజయవాడ సమీపంలో, పెన్నా నది వరద వల్ల నెల్లూరు నగరం ప్రభావితం అవుతోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిది పెన్నా నదికి భారీ వరద రావడం, నెల్లూరు నగర శివారు ప్రజలు ముంపునకు గురవడం రాష్ట్రంలో వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయో తెలుపుతున్నాయి. ఆయా నదులకు వచ్చే వరదల వల్ల ఇప్పటి వరకూ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే గత రెండేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా వరద బాధితుల జాబితాలో చేరారు.

కృష్ణా నది కరకట్ట వెంబడి తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం పరిధిలో చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి వరద ప్రమాదం ఉందని తాజాగా అధికారులు నోటీసులు అంటించారు. ఆయన భవనంతోపాటు కరకట్ట వెంబడి ఉన్న 36 భవనాలకు కూడా అధికారులు హెచ్చరికల నోటీసులు జారీ చేశారు. 2014 నుంచి చంద్రబాబు లింగమనేని గెస్ట్‌ హౌస్‌నే తన నివాసంగా మార్చుకున్నారు. సీఎంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ నిధులతో ఆధునిక హంగులు సమకూర్చుకున్నారు. అమరావతిలో సొంత ఇళ్లు కట్టుకునే వరకూ తాత్కాలికంగా అక్కడ నివాసం ఉంటున్నారేమోనని అందరూ భావించారు. అయితే చంద్రబాబు హైదరాబాద్‌లో నూతన ఇళ్లు కట్టారు గానీ అమరావతిలో మాత్రం లింగమనేని గెస్ట్‌ హౌస్‌లోనే ఉంటున్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో కృష్ణా నదికి వరద రాలేదు. కృష్ణా డెల్టా పరిధిలో పంట వేయడం కూడా కష్టమైంది. కృష్ణా నదికి వరద రాకపోవడంతో లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో ఉంటున్న చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కానీ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వర్షాలు పుష్కలంగా పడ్డాయి. అన్ని నదులకు వరదలు వచ్చాయి. ప్రాజెక్టులు నిండాయి. ఈ క్రమంలో గత ఏడాది చంద్రబాబు నివాసంలోకి కృష్ణా నది వరద నీరు చేరింది. ఫలితంగా బాబు కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది కరోనా వల్ల చంద్రబాబు కుటుంబం మార్చి నెల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం వరద నీరు వచ్చినా ఇక్కడ లేని బాబుకు ఇబ్బంది ఉండదు. అయితే మరో ప్రాంతంలో సొంత ఇళ్లు కట్టుకునే వరకూ చంద్రబాబుకు ప్రతి ఏడాది కృష్ణా నది వరద బాధితుడుగా కొనసాగనుండడం ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి