iDreamPost

ప్రమాణాల రాజకీయం.. విశాఖలో ఉద్రిక్తత

ప్రమాణాల రాజకీయం.. విశాఖలో ఉద్రిక్తత

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకుల మధ్య ప్రమాణాల రాజకీయం నడుస్తోంది. పరస్పర అవినీతి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న నేతలు ప్రమాణాలు చేయాలనే సవాళ్లను విసురుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మధ్య ప్రమణాల రాజకీయం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయగా.. తాజాగా విశాఖపట్నంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ విశాఖలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ తూర్పు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ విజయ నిర్మల ఆరోపించారు. అంతకు ముందు వెలగపూడి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తమ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వాపోయారు. మరో వైపు భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే వెలగపూడి రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఆయనకు, వైసీపీ నేతలకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు మూడు రోజులుగా నడుస్తున్నాయి. తనపై చేసిన ఆరోపణలపై ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ నేతలు సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి సవాల్‌ చేయగా.. స్పందిచిన వైసీపీ తూర్పు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ విజయనిర్మల ఈ రోజు ఈస్ట్‌ పాయింట్‌కాలనీలోని సాయిబాబు గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో కార్యకర్తలతో కలసి విజయ నిర్మల సాయిబాబా గుడి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రాకపోతే టీడీపీ ఈస్ట్‌ నియోజకవర్గ కార్యాలయాన్ని ముట్టడిస్తామని విజయనిర్మల హెచ్చరించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాల వారిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ కార్యాలయం వద్ద భారీగా సిబ్బందిని మోహరించారు.

విశాఖపట్నంలో చోటు చేసుకున్న భూ ఆక్రమణలు అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర ఆరోపణలకు కారణమవుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులు ఆక్రమించుకున్న భూములు, మాజీ ఎంపీ సబ్బం హరి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఎమ్మెల్యే వెలగపూడి ఆక్రమించారని చెబుతున్న భూములను అధికారులు స్వా«ధీనం చేసుకున్నారు. మరో వైపు టీడీపీ హాయంలో విశాఖలో జరిగిన భూ ఆక్రమణలపై సిట్‌ విచారణ పూర్తయింది. నివేదికను ప్రభుత్వానికి అందించబోతోంది. ఆ తర్వాత విశాఖలో ఏ స్థాయిలో భూ ఆక్రమణలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి