iDreamPost

విభజన సమస్యలపై 23న ఢిల్లీలో భేటీ..!

విభజన సమస్యలపై 23న ఢిల్లీలో భేటీ..!

విభజన సమస్యలపై ఈనెల 23న ఢిల్లీలో కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రహోంశాఖ అధికారులు సమాచారం పంపారు.సమావేశానికి తప్పకుండా హాజరవ్వాలని సూచించినట్లు సమాచారం.

పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై సెప్టెంబర్‌ 27న జరిగిన సమావేశంలో ఉమ్మడి అంశాలతో పాటు ఏపీకి చెందిన ఏడు అంశాలపై అధికారులు చర్చించారు.

వెనుకబడిన జిల్లాలకు నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, అమరావతికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలను గత సమావేశం అజెండాలో కేంద్రం చేర్చింది. అయితే ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు లేకుండానే భేటీ అసంపూర్తిగా ముగిసింది.విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను 10 ఏళ్లలోపు పూర్తిచేయాలనే నిబంధనలు ఉన్నందున ఆ మేరకు వాటిని పరిష్కరించే దిశగా కేంద్రహోంశాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 23న తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి