iDreamPost

రాజకీయ వర్గాల్లో “జమిలి”పై చర్చల జోరు.. తాజాగా సీఈసీ సైతం..!

రాజకీయ వర్గాల్లో “జమిలి”పై చర్చల జోరు.. తాజాగా సీఈసీ సైతం..!

జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. నాటి నుంచీ పలు రాష్టా్ట్రలలో ఈ ప్రస్తావన జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు పార్టీల నేతలు జమిలి ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని పలు సందర్భాల్లో సూచిస్తున్నారు. ఈ ప్రచారక్రమంలో సీఈసీ ప్రకటన సంచలనంగా మారింది. దేశమంతటా లోక్‌సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా ప్రకటించారు. సోమవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చట్ట సవరణలను పార్లమెంటు ఆమోదిస్తే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సంసిద్ధంగా ఉందన్నారు. రాజకీయ నేతల ప్రకటనల నేపథ్యంలో తాజాగా సీఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విస్తృత చర్చలు

జమిలి ఎన్నికలు 2024లో సార్వత్రిక ఎన్నికలతోపాటు జరుగుతాయా, లేక ముందే జరుగుతాయా అన్న అంశంపై కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి. కాగా లోక్‌సభ, శాసన సభల కాలపరిమితిని తగ్గించడం, పెంచడం, రాజ్యాంగంలో సంబంధిత నిబంధనలను సవరించి, రాష్ట్రాల ఆమోదం పొందడం, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951ని సవరించడం ద్వారానే జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని రాజ్యాంగ నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. లా కమిషన్‌ కూడా ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని 83(2), 172(1) అధికరణలు లోక్‌సభ, శాసనసభల కాలపరిమితిని నిర్దేశించాయి. రద్దు చేయనంతవరకూ ఈ సభలు ఐదేళ్ల కాలపరిమితి వరకు కొనసాగుతాయని ఈ అధికరణలు పేర్కొన్నాయి.

అయితే ఈ సభల కాలపరిమితిని పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లోక్‌సభ, శాసన సభలను కాలపరిమితికి ముందే రద్దు చేసేందుకు ఎటువంటి రాజ్యాంగపరమైన అడ్డంకి లేదని, కానీ.. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భాల్లో మాత్రమే 356 అధికరణను ఉపయోగించాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఈ రీత్యా జమిలి ఎన్నికల సమయానికి అనుగుణంగా శాసన సభల కాలపరిమితిని తగ్గించడం, పొడిగించడం చేయాలంటే రాజ్యాంగంలోని 172 అధికరణకు అవసరమైన సవరణలు చేస్తే సరిపోతుందని లా కమిషన్‌ ప్రతిపాదించింది. అదే సమయంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలకు సంబంధించి ప్రజాప్రాతినిఽధ్య చట్టంలోని సెక్షన్‌ 14, 15ను మార్చాల్సి ఉంటుందని కమిషన్‌ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి