iDreamPost

మందు బాబుల మీద చంద్రబాబుకు ప్రేమ ఎందుకు?

మందు బాబుల మీద చంద్రబాబుకు ప్రేమ ఎందుకు?

ప్రజల ఓట్లతో నడిచే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటుబ్యాంకులకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒక స్థిరమైన ఓటుబ్యాంకు ఏర్పరచుకున్న నాయకులకు కనీస సంఖ్యలో ఓట్లు వస్తాయన్న ధీమా ఎప్పుడూ ఉంటుంది. పార్టీలు కూడా ఓటుబ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి, ఉన్న వాటిని విస్తరించుకోవడానికి, ప్రత్యర్థుల ఓటుబ్యాంకులను కొల్లగొట్టడానికీ అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాయి.

ఈ ఓటుబ్యాంకులు నానా రకాలుగా ఉంటాయి. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన ఏర్పడుతూ ఉంటాయి. అయితే కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ఒక కొత్త ఓటుబ్యాంకు ఏర్పరచుకొనే ప్రయత్నం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నారా అన్న అనుమానం గత కొన్ని రోజులుగా వారి ఉపన్యాసాలు, ఎత్తుగడలు చూస్తుంటే అనిపిస్తోంది.

కులాలకు మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉండే ఈ ఓటుబ్యాంకు మద్యపాన ప్రియులు. జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యపాన ప్రియులకు గడ్డుకాలం అనే చెప్పాలి. మద్యానికి అలవాటు పడిన వారికి వారు కోరుకున్న బ్రాండు మద్యం దొరకడం లేదు, అందుబాటు ధరల్లో దొరకడం లేదు, కోరుకున్న సమయంలో దొరకడం లేదు.

ఈ విషయాన్ని మొన్న శాసనసభలో కూడా తమ పార్టీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే చేత అడిగించారు. వివిధ వార్తా ఛానల్స్ పెట్టే చర్చా కార్యక్రమాలలో తమ పార్టీ ప్రతినిధుల చేత అడిగిస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రజా చైతన్య యాత్ర పేరిట చేస్తున్న బస్సు యాత్రలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, ఈ ప్రభుత్వం మందు ప్రియుల కడుపు కొడుతోంది అని వాపోయారు.

మందుబాబుల తరఫున వకాల్తా పుచ్చుకోవడం చంద్రబాబు నాయుడుకి ఇది మొదటిసారి కాదు. 2014 ఎన్నికల ముందు ఒక సభలో మాట్లాడుతూ, “రోజంతా పనిచేసి వచ్చిన తమ్ముళ్ళు రాత్రి పూట ఒక క్వార్టర్ పుచ్చుకోవాలంటే అది కూడా అందుబాటులో లేకుండా చేశారు” అని అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. మద్యం తాగే వారి మీదే కాకుండా, మద్యం వ్యాపారం చేసేవారి మీద కూడా చంద్రబాబు గతంలో ప్రేమ చూపించారు. అయ్యప్పమాలధారణ పేరిట రెండు నెలలు అందరూ మద్యం మానేసి, దాన్ని అమ్మవారికి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గేలా చేస్తున్నారని వాపోయారు.

మద్యప్రియులకు స్వర్ణయుగం లాంటి పాలన
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బార్లకు అనుబంధంగా పర్మిట్ రూములతో మొదలై, బెల్టు షాపుల రూపంలో వీధి వీధికీ, పల్లె పల్లకీ మందు రూపంలో ఇందుగలదందు లేదని సందేహం లేకుండా మద్యం సర్వాంతర్యామి లాగా వ్యాపించి ఎంతోమంది కష్టజీవులనూ, వారి కుటుంబాలను గుల్ల చేసింది.

ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా ముందు మందు లభ్యతను తగ్గించి, తరువాత ధరలు పెంచి దశలవారీగా మద్యం లేకుండా చేస్తామని హామీ ఇచ్చి, ఆ దిశగా అడుగులేస్తూ ఉంటే, ఈ సంధి కాలంలో మద్యానికి బానిసలైన వారిని తన ఓటుబ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారేమో అన్న అనుమానం కొందరిలో కలుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి