iDreamPost

వైజాగ్‌ దిశగా బాబు గారి యూటర్న్‌.. కర్నూలులో హైకోర్టుకు ఓకేనట!!

వైజాగ్‌ దిశగా బాబు గారి యూటర్న్‌.. కర్నూలులో హైకోర్టుకు ఓకేనట!!

మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఖాతాలో మరో యూటర్న్‌ చేరింది. క్రికెట్‌లో విరాట్‌కోహ్లీ సాధిస్తున్న పరుగుల కంటే వేగంగా చంద్రబాబు యూటర్న్‌లు తిరుగుతున్నారు. కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆయన.. మొదట తన మామ ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పి చివరికి ఆ పార్టీలోనే చేరడం దగ్గర నుంచి ఈ 40 ఏళ్లలో ఆయన తిరిగినన్ని మలుపులు ఎవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌ అంటే అతిశయోక్తి కాదేమో.

విషయానికి కొస్తే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం మూడు రాజధానుల ప్రకటన చేయగానే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఇలా అన్నీ అమరావతిలోనే ఉండాలంటూ దగ్గరుండి ఉద్యమాలు చేయిస్తున్నారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా తన పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు వ్యవహార శైలిపై అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు పెట్టడానికి సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటే.. అదే రాయలసీమలో పుట్టిన చంద్రబాబు వ్యతిరికించడంపై సొంత పార్టీలోనే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

దీన్ని గమనించిన ఆయన ఉన్నట్టుండి తనకు అలవాటైన యూటర్న్‌ గేర్‌ను తిప్పేశారు. కర్నూలు హైకోర్టుకు తామ వ్యతిరేకం కాదని, గతంలోనే అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పామంటూ సోమవారం నాటి ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను విన్న అక్కడి విలేకరులు, నాయకులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందట. ఆయన కర్నూలులో హైకోర్టు పెట్టాలని గతంలో ఎప్పుడు చెప్పారబ్బా అంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నిశ్చేష్టులయ్యారట. ప్రెస్‌మీట్‌ అనంతరం ఈ వ్యవహారంపై కొద్ది చేపు చర్చ కూడా నడిచిందట. ఇక చంద్రబాబు త్వరలోనే వైజాగ్‌కు పరిపాలన రాజధానికి కూడా ఒకే చెప్పే పరిస్థితుల కనపడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వైజాగ్‌లోని టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు వికేంద్రీకరణకు మద్ధతు పలికిన విషయం తెలిసిందే. విశాఖలో పరిపాలన రాజధానికి కావల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ మీడియాతో చెబుతూనే ఉన్నారు. వారెవరిపై చంద్రబాబు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి త్వరలోనే చంద్రబాబు విశాఖ రాజధానికి అనుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.

చంద్రబాబును నమ్మి మోసపోవడమేనా..
చంద్రబాబు మాటలు నమ్మి అమరావతిలో నిరసనలు చేస్తున్న వారికి.. సోమవారం ఆయన వ్యాఖ్యలను చూసి షాక్‌ కొట్టింది. అమరావతిలోనే అన్నీ ఉండేలా చేస్తానంటూ తమను నమ్మించి ఇప్పుడు కర్నూలులో హైకోర్టుకు అనుకూలమంటూ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తమ లోకల్‌ ఉద్యమ కోఆర్డినేటర్లకు చెప్పి నిలదీశారట. అయితే రాయలసీమలో కాస్త పరిస్థితి సరిద్దేందుకు అలా చెప్పారని, ఆయన మనసంతా అమరావతి మీదే ఉందంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.

ఈ ఐదేళ్లలో ఎన్నో యూటర్న్‌లు..
కేవలం గత ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే చంద్రబాబు యూటర్న్‌లు ఎలాంటివో అర్థమవుతాయి. బీజేపీ మతతత్వపార్టీ, మోదీని జైళ్లో పెట్టాలంటూ విమర్శలు చేసిన ఆయన 2014 ఎన్నికల్లో మోదీ గాలి వీయడంతో బీజేపీతో పొత్త పెట్టుకున్నారు. హోదా పదేళ్లు తెస్తానంటూ తన ఎన్నికల ప్రసంగాల్లో చెప్పారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీని, రాహుల్‌గాంధీని, సోనియా గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా ఘోరంగా తిట్టారు. అధికారంలోకి వచ్చాక హోదా పేరెత్తినవారిన జైల్లో పెట్టారు. హోదా వలన ప్రయోజనం లేదని, అదేమైనా సంజీవనా అంటూ చెప్పకొచ్చారు. ప్యాకేజీ అద్భుతంగా ఉందని, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అని వెకిలిగా మాట్లాడారు. నాలుగేళ్లు తిరిగే సరికి తన రాజకీయ ప్రయోజనాల కోసం మళ్లీ హోదా కావాలన్నారు. బీజేపీ మళ్లీ దెయ్యంలా కనపడింది. సోనియా గాంధీ దేవతలా కనపడింది. వెంటే కాంగ్రెస్‌ పక్కకు చేరిపోయారు.

ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులుకు ప్రచారం చేయడంతోపాటు డబ్బు సహాయం కూడా చేశారు. అలాగే టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం హరికృష్ణ శవం వద్దే బేరాలు చేశారు. టీఆర్‌ఎస్‌ వద్దనడంతో .. ఆ పార్టీ విలన్‌ అయిపోయింది. వెంటనే టీఆర్‌ఎస్‌ జగన్‌కు లింకు పెట్టాలని చూశారు. ఇవన్నీ గమనించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి రాకపోవడంతో వెంటనే తన మాటలను మార్చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ సాన్నిహిత్యం కోసం తాపత్రయ పడుతున్నారు.

పైన చెప్పినవన్నీ చంద్రబాబు జీవితంలో చేసిన యూటర్న్‌లలో 10 శాతం కూడా కావు. మిగతా 90 శాతం కూడా చెప్పాలంటే మాటలు చాలవు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి