iDreamPost

అబద్దాలు అలవోకగా చెపుతున్న బాబు 

అబద్దాలు అలవోకగా చెపుతున్న బాబు 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలను అలవోకగా చెప్పేస్తున్నారు. ఆయన చెప్పే అబద్దాల జాబితా రాయాలంటే అదో పెద్ద గ్రంధమే అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. లెక్కలేనన్ని అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. అదేమంటే ప్రజల జ్ఞాపకశక్తి స్వల్పం అని ఆయన దృఢనమ్మకం. ఆ మాటే తరచూ చెపుతూఉంటారు. ఒక మాటను ప్రజల మెదళ్ళలో నాటుకుపోయేలా చెప్పాలంటే ఒకే మాట రోజూ చెప్తూనే ఉంటారు. అబద్దాలు చెప్పడం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీకాదు కానీ నిన్న హైదరాబాద్ లో చెప్పిన అబద్దం ఇప్పటివరకూ ఆయన చెప్పిన అనేకానేక అబద్ధాలకు రారాజు లాంటిది.రాజకీయాల్లోకి రమ్మని ఎన్టీఆర్ కు తానే సలహా ఇచ్చానని, దాని ఫలితమే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని చంద్రబాబునాయుడు చెప్పారు. టీడీపీ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు రాసిన “నేను – తెలుగుదేశం” పుస్తకం ఆవిష్కరణ సభలో చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆ సభలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. టీడీపీని స్థాపించిన రోజునుండీ పార్టీలో పనిచేసిన నేతలు ఉన్నారు. విద్యావంతులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. కొందరు పారిశ్రామికవేత్తలూ ఉన్నారు.వీరందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు ఇంతపెద్ద అబద్దంచెప్పినా ఒక్కరూ ఖండించలేదు. అలా ఖండించక పోవడమే ఆయనకు మరిన్ని అబద్దాలు చెప్పే అవకాశాన్ని ఇచ్చింది. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ముఖానికి రంగులు వేసుకునే వారు పార్టీ పెడితే ఐదుశాతం ఓట్లుకూడా రావని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చంద్రబాబు అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు కాంగ్రెస్ నాయకత్వం అనుమతి ఇస్తే తాను ఎన్టీఆర్ పై పోటీచేసి ఓడిస్తాను అంటూ ఓ ఛాలెంజ్ విసిరారు. ఇవన్నీ అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు విన్నవారు ఉన్నారు. ఆ వార్తను రాసినవారు ఉన్నారు. అయినా చంద్రబాబు ఇంత పెద్ద అబద్దాన్ని అలవోకగా చెప్పేశారు. 

చంద్రబాబు నాయుడు చెప్పే అబద్దాలు నేటి యువతరం నమ్మేస్తుంది. ఇప్పుడు టీడీపీని చూస్తూ, చంద్రబాబు నాయుడుని వినే యువతరం ఆయన చెప్పే మాటలన్నీ  నిజమే అని గట్టిగా నమ్మేస్తున్నారు. మాదాపూర్ లో హైటెక్ సిటీ సృష్టికర్త చంద్రబాబునాయుడే అని ఈ యువతరం గట్టిగా నమ్ముతుంది. అంతేకానీ అక్కడ హైటెక్ సిటీ నిర్మాణానికి శంఖుస్థాపన చేసింది అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి అని ఎంతమందికి తెలుసు?అలాగే రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను అందుబాటు లోకి తెచ్చింది చంద్రబాబునాయుడే అని చాలామంది యువత నమ్ముతారు. కానీ ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చింది నేదురుమల్లి జనార్ధనరెడ్డి అని వారికీ తెలియదు. అలాగే ఈ రెండు అంశాలపై చంద్రబాబునాయుడు అప్పట్లో ధర్నా చేశారని, కోర్టుకు కూడా వెళ్ళారని, జనార్ధనరెడ్డిని ధనార్జన రెడ్డి అని పిలిచింది చంద్రబాబునాయుడే అని ఈ తరం వారికి ఎంతమందికి తెలుసు?

విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు, మొత్తం ఓ వర్గం తెలుగు మీడియా కూడా ఇలాగే  అబద్దాలు చెపుతోంది. యాదృచ్చికం కావచ్చు కానీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టు ఒకరు మాట్లాడుతూ ఒక ఐటీ వ్యక్తికి బెంగుళూరులో ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారని, దానికి కారణం తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిని అని చెప్పడం వల్లనే అని వెంకటకృష్ణ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్లనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులు తన మిత్రుణ్ణి అవహేళన చేసి ఉద్యోగం నిరాకరించారని చెప్పారు వెంకటకృష్ణ. 

ఇలా అబద్దాల మేడలు కట్టుకుంటూ చంద్రబాబు నాయుడు తన రాజకీయం నడుపుతున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియా లేని రోజుల్లో చెల్లాయి. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా పనిచేస్తోంది. క్రియాశీలకంగా కూడా పనిచేస్తోంది. అందువల్లనే చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి అబద్దాన్ని  సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన పాతకాలపు పద్దతి మార్చుకోవడం లేదు.ఆయన ఇంకా అప్డేట్ కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు దశాబ్దాలు పూర్తిచేసుకున్న పార్టీని చంద్రబాబు నాయుడు విజయపథంవైపు నడిపిస్తారా అన్నది ఓ పెద్ద ప్రశ్న.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి