iDreamPost

జ‌ర్న‌లిజంలో కులం!

జ‌ర్న‌లిజంలో కులం!

ఒక‌ప్పుడు జ‌ర్న‌లిజంలో కులం ఉండేది కాదు. 1988లో నేను ఆంధ్ర‌జ్యోతిలో చేరిన‌ప్పుడు ఎడిట‌ర్ నండూరి రామ్మోహ‌న్‌రావు గారు ఈ విష‌యంలో చాలా స్ప‌ష్టంగా ఉండేవారు. వార్త‌ల్లో కులం పేరు వ‌స్తే ఒక సామాజిక‌వ‌ర్గం అని రాసేవాళ్లం. అయితే ఒక్కోసారి అనివార్యంగా రాయాల్సి వ‌చ్చేది. ముద్ర‌గ‌డ కాపు ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు అక్క‌డ కాపు అని లేకుండా వార్త రాయ‌లేం కాబ‌ట్టి త‌ప్పేది కాదు.

అదే విధంగా రెండు మ‌తాల‌కి సంబంధించి ఏదైనా గొడ‌వ వ‌చ్చినా రెండు వ‌ర్గాలు అనే సంయ‌మ‌నం పాటించేవాళ్లం. వార్త‌ల్లో రాయ‌నంత మాత్రాన స‌మాజంలో కులం లేద‌ని కాదు. అయితే మ‌న పెద్ద‌వాళ్లు స‌మాజ హితాన్ని కాంక్షించే సంపాద‌కులు త‌మ‌కు తాము గీసుకున్న గీత ఇది. జ‌ర్న‌లిజం వ‌ల్ల మంచి జ‌ర‌గ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు, చెడ్డ జ‌ర‌గ‌కూడ‌ద‌ని వాళ్లు కోరుకున్నారు.

మొద‌ట ఈ కులం ఎన్నిక‌ల వార్త‌ల్లోకి ప్ర‌వేశించింది. అంటే ఒక నియోజక‌వ‌ర్గం గెలుపు ఓట‌ములు స‌మీక్షించాల్సి వ‌స్తే అక్క‌డ యాద‌వుల శాతం ఇంత‌, అగ్ర‌వ‌ర్ణాలు ఇంద‌రు , అని ఏవో కాకి లెక్క‌ల రిపోర్టింగ్ జ‌రిగేది. ఎన్నిక‌ల్లో కులం పాత్ర లేద‌ని కాదు కానీ, ఓట‌ర్లు అనేక విష‌యాలు దృష్టిలో పెట్టుకుని ఓటేసేవాళ్లు.

ఆ త‌ర్వాత కుల‌సంఘాల వార్త‌లు మొద‌ల‌య్యాయి. అంటే ఒక కుల స‌మావేశం వార్త గ‌తంలో వ‌చ్చేది కాదు. అయితే ఎడిట‌ర్లు పోయి య‌జ‌మానులే స‌ర్వం తామే అయిన త‌ర్వాత అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ ఆబ్లిగేష‌న్ల రూపంలో ఇవి మొద‌ల‌య్యాయి. కుల‌నాడు వార్త‌లు, కార్తీక భోజ‌నాల వార్త‌లు ప్ర‌ముఖంగా వ‌చ్చేస్తున్నాయి.

ఇదంతా ప‌క్క‌న పెడితే ప‌త్రికా య‌జ‌మానులే కులాల పేరుతో వార్త‌లు రాసేస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాణం ఆప‌డం వెనుక జ‌గ‌న్ ఓ కులాన్ని టార్గెట్ చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మ‌ని అనుకుంటే, అమ‌రావ‌తి వ‌ల్ల ఒక వ‌ర్గం వారే ఎక్కువ‌గా ల‌బ్ధి పొందుతార‌ని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టే క‌దా! మ‌రి ఒక వ‌ర్గానికే ల‌బ్ధి చేకూర్చే అమ‌రావ‌తి ఎందుక‌ని ఆ రోజు చంద్ర‌బాబుని కూడా ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? రాజ‌ధాని వ‌ల్ల ప్ర‌జలంద‌రికీ స‌మ‌న్యాయం జ‌ర‌గ‌లేద‌ని జ‌గ‌న్ అనుకోవ‌డం త‌ప్పెలా అవుతుంది.

హైద‌రాబాద్ మీద పెట్టుబ‌డుల‌న్నీ కుమ్మ‌రించ‌డం వ‌ల్ల విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ దారుణంగా న‌ష్ట‌పోయింద‌ని అంద‌రూ ఆ రోజు అన్నారు క‌దా! మ‌రి అమ‌రావ‌తి మీద ల‌క్ష కోట్లు ఈ రోజు ఎందుకు పెట్టాలి? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి హైకోర్టు త‌ర‌లింపు అవ‌స‌రం అని రాసిన వాళ్లే ఈ రోజు హైకోర్టు వ‌ల్ల క‌ర్నూల్‌కి టీ కొట్లు, జిరాక్స్ సెంట‌ర్లు త‌ప్ప ఏమీ రావ‌ని అంటున్నారు.

మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే వ‌చ్చే న‌ష్టమేం లేదు. ఇక ప్రైవేట్ పెట్టుబ‌డులు భ‌వ‌నాలు చూసి రావు. మౌలిక వ‌స‌తులు, ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల వ‌స్తాయి. 5 ఏళ్ల‌లో చంద్ర‌బాబు ఎన్ని పెట్టుబ‌డులు తెచ్చాడో అది మాత్రం మాట్లాడ‌రు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి