iDreamPost

మహిళా ఎంపీపై కేసు నమోదు.. 429 మందిని మోసం చేసి రూ.28 కోట్లు స్వాహా

  • Published Aug 02, 2023 | 11:41 AMUpdated Aug 02, 2023 | 11:41 AM
  • Published Aug 02, 2023 | 11:41 AMUpdated Aug 02, 2023 | 11:41 AM
మహిళా ఎంపీపై కేసు నమోదు.. 429 మందిని మోసం చేసి రూ.28 కోట్లు స్వాహా

సాధారణంగా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు.. తమకు ఓట్లేసి గెలిపించిన జనాలకు అండగా నిలబడాలి. వారికి సమస్యలు రాకుండా కాపాడాలి.. వస్తే.. వాటిని పరిష్కరించాలి. కానీ మన దగ్గర కొందరు నేతల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. మోసగాళ్లు, నేరస్థుల బారి నుంచి జనాలను కాపాడాల్సిన నాయకులే.. స్వయంగా రంగంలోకి దిగి.. తమకు ఓట్లేసిన జనాలకు కుచ్చుటోపి పెడతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చేసింది. తనకు ఓట్లేసి పార్లమెంట్‌కు పంపించిన జనాలను మోసం చేసి ఏకంగా 28 కోట్ల రూపాయలు స్వాహా చేసింది ఒక మహిళా ఎంపీ. బాధితుల ఫిర్యాదు మేరకు ఆమె మీద కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

సొంత ఇళ్లు కట్టిస్తామని చెప్పి సుమారు 429 మంది జనాలను మోసం చేసి.. వారి వద్ద నుంచి దాదాపు 28 కోట్ల రూపాయల మేర వసూలు చేసినట్టు తృణమూల్‌ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్‌పై కేసు నమోదయ్యింది. దీనిపై గరియాహట్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు అలిపోర్‌ కోర్టులో కూడా ఎంపీ నుస్రత్‌పై కేసు నమదయ్యింది. బాధితులు సెవెన్ సెన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డబ్బు కట్టారు. దీనికి ఎంపీ నుస్రత్‌ యజమాని అని సమాచారం. నగదు చెల్లించి ఐదేళ్లు గడుస్తున్న ఇళ్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

అసలేం జరిగిందంటే..

నుస్రత్ జహాన్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఇస్తామంటూ ప్రచారం చేసుకుంది. అలాగే 2018లోగా వీటిని కొనుగోలు దారులకు అందిస్తామని హామీ ఇచ్చింది. నుస్రత్‌ మాటలు నమ్మి.. దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదు మొత్తాన్ని చెల్లించారు. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇళ్లకు సంబంధించి ఎలాంటి అభివృద్ది లేదు.. ఇళ్లను కూడా అందించలేదు. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా.. నుస్రత్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో విసిగిపోయిన జనాలు.. ఎంపీ మీద పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.

నుస్రత్‌పై ఈడీకి ఫిర్యాదు..

ఇదే అంశంపై బీజేపీ నేత సంకూ దేబ్ పాండా కూడా నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీకి సంబంధించి కంపెనీ ఒకటి తక్కువ ధరకే ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. సుమారు 429 మంది వద్ద నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మోసం చేసిందని ఆరోపించారు. జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న నుస్రత్ సంస్థ.. బదులుగా ఫ్లాట్ ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. ఐదేళ్లు గడుస్తున్నప్పటికి కూడా డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఆ ఫ్లాట్ లభించలేదని ఆరోపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చినా.. వారు పట్టించుకోలేదు. దాంతో ఈడీని ఆశ్రయించాను అని తెలిపారు. మరోవైపు ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించడానికి నుస్రత్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి