iDreamPost

గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌పై కేసు నమోదు..

గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌పై కేసు నమోదు..

గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌పై, పలు గూగుల్ ఉన్నతాధికారులపై కొరియాలో కేసు నమోదైంది. కొరియా టైమ్స్‌ కథనం ప్రకారం.. ‘సిటిజెన్స్‌ యునైటెడ్‌ ఫర్‌ కన్జ్యూమర్‌ సావర్నెటీ (CUCS)’ అనే వినియోగదారుల సంస్థ గూగుల్‌ కొరియా సీఈఓ నాన్సీ మ్యాబుల్‌ వాకర్‌, గూగుల్‌ ఆసియా-పసిఫిక్‌ అధ్యక్షుడు స్కాట్‌ బ్యూమోంట్‌, గూగుల్ CEO సుందర్‌ పిచాయ్‌పై కొరియా రాజధాని సియోల్ లో కేసు నమోదు చేశారు.

ఈ ఫిర్యాదులో.. గూగులో కొరియా దేశ టెలికమ్యూనికేషన్‌ బిజినెస్‌ చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుందని, గూగుల్‌ ఇన్‌-యాప్‌ చెల్లింపుల వల్ల ఖర్చులు పెరిగాయని, దాని వల్ల ఆ భారాన్ని కస్టమర్స్ పై వేయాల్సి వస్తుందని, దీనివల్ల యాప్‌ డెవలపర్లకు భారీ నష్టం చేకూరుతుందని, మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల గూగుల్‌కు అధిక కమిషన్‌ చెల్లించాల్సి వస్తుందని కంప్లైంట్ చేశారు.

గూగుల్ ప్లే స్టోర్ లో యాప్స్ పెట్టుకున్న ఆపరేటర్లు కచ్చితంగా తమ ఇన్‌-యాప్‌ చెల్లింపు వ్యవస్థనే వాడాలని గూగుల్ తెలిపింది. ఇలా బలవంతం చేయొద్దని దక్షిణ కొరియా కేబినెట్‌ గతంలో తెలిపింది. అయినా కానీ గూగుల్‌ కచ్చితంగా తమ బిల్లింగ్‌ వ్యవస్థనే ఉపయోగించాలని, లేకపోతే ఎక్కువ కమిషన్ ఇవ్వాలని షరతులు విధించింది. ఒకవేళ ఎవరైనా ఇది పాటించకపోతే గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌లను తొలగిస్తామని హెచ్చరించింది. గూగుల్ ప్లే స్టోర్ కి ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పక అదే వాడాల్సొస్తుంది. దీంతో కొరియా వినియోగదారుల సంస్థ గూగుల్ పై ఫిర్యాదు చేయక తప్పలేదు. మరి దీనిపై గూగుల్ అధికారులు కానీ, సుందర్ పిచాయ్ కానీ స్పందిస్తారేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి