iDreamPost

అభ్యర్థుల అఫిడవిట్లపై సీరియస్ ఫోకస్..! తేడాలు ఉంటే అంతేసంగతులు!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఈసారి తెలంగాణలో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారాల్లో మునిగిపోయారు.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఈసారి తెలంగాణలో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారాల్లో మునిగిపోయారు.

అభ్యర్థుల అఫిడవిట్లపై సీరియస్ ఫోకస్..!  తేడాలు ఉంటే అంతేసంగతులు!

సాధారణంగా ఏ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అయినా తనకు సంబంధించిని పూర్తి వ్యక్తిగత సమాచారం అంటే.. ఆస్తులు, నేర చరిత్ర, అప్పులు, ఆదాయం ఇలాంటి అంశాలకు సంబంధించిన వివరాలు బయటపెట్టాల్సి ఉంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం సదరు అభ్యర్థికి ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉందా లేదా? అనేది నిర్ధారిస్తుంది. అంతేకాదు తమ సమాచారం ఓటర్లకు కూడా స్పష్టంగా అందించాల్సిన బాధ్యత అభ్యర్థికి ఉంటుంది. దీన్ని బట్టే ఓటర్లు సదరు అభ్యర్థిని గెలిపించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. కానీ చాలా మంది అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా దాఖలు చేసే అఫిడవిట్లలో అసలైన సమాచారం, నేర చరిత్ర, ఆస్తుల వివరాలు దాచి పెడుతుంటార.. అలాంటి వారిపై ఈసీ చర్యలు తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ అఫిడవెట్లను సమర్పిస్తున్నారు. ఈసారి అఫిడవెట్లలో సరైన సమాచారం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరిస్తుంది.

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.. అయితే ఎన్నికల్లో టికెట్ రావడం, నామినేషన్ వేయడం ఒక ఎత్తైతే.. అఫిడవిట్ సమర్పించడం చాలా కీలకం. నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో ఏమాత్రం తప్పుడు సమాచారం అందించినా, అజాగ్రత్తగా వ్యవహరించినా చిక్కుల్లో పడిపోతారు. అందుకే అఫిడవిట్ పేపర్ పై రాసే ప్రతి ఒక్క అక్షరం ఆచీ.. తూచీ.. రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఎన్నికలు రద్దవడం మాత్రమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది ఎన్నికల సంఘం. ఒక పార్టీ తరుపు నుంచి ప్రతినిధిగా పోటీ చేసే అభ్యర్థికి తనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అందుకే పోటీ చేసే ప్రతి అభ్యర్థి తనకు సంబందించిన పూర్తి సమాచారాన్ని ఎన్నికల అధికారికి ఇవ్వడంతో పాటు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం.. ఇది ఈసీ నిబంధన. ఎన్నికల అఫిడవిట్లలో సమర్పించే వివరాల్లో ఏమాత్రం తేడా ఉన్నా వాటి ఆధారంగా ఓడిపోయిన అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కుతారు.. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి.

2018 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు సరైన అఫిడవిట్ సమర్పించలేదని వారి ప్రధాన ప్రత్యర్థులు..  గెలిచిన అభ్యర్థుల ఎన్నిక చెల్లదని కోర్టుమెట్లు ఎక్కారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హై కోర్టు అనర్హత వేటు వేసింది.. తర్వాత ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ అఫిడవిట్లలో చేసిన పొరపాటు వల్ల కొంతమంది అభ్యర్థులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు పడాలని పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు. మరోవైపు అఫిడవిట్ విషయంలో ఈసీ కఠిన నిబంధనలు విధించింది. ఏ ఒక్క కాలమ్ కూడా ఖాళీగా ఉంచవొద్దని అభ్యర్ధులకు స్పష్టం చేసింది. అంతేకాదు తమపై ఉన్న క్రిమినల్ కేసుల, ఇతర కేసుల గురించి ఖచ్చితంగా తెలపాలని 2013 నుంచి అమల్లోకి తెచ్చింది. ఉద్దేశ పూర్వకంగా ఏదైనా వివరాలు దాచిపెడితే.. ప్రజా ప్రాతినిద్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హతకు గురవుతారుని హెచ్చరిస్తుంది ఈసీ.

అఫిడవిట్ విషయంలో అభ్యర్థులే కాదు.. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల సందర్భంగా అఫిడవెట్లలో అభ్యర్థులు తమ సమాచారం సరిగా అందిస్తున్నారా? లేదా ? అన్న విషయం అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి.. ఒకవేళ తేడా వస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. గతంలో కొన్నిరాష్ట్రాల్లో అఫిడవిట్ విషయంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక అఫిడవిట్ తో పాటు ఎన్నికల ప్రచారానికి అయ్యే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈసీ హెచ్చరిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అఫిడవిట్ సమర్పించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇందుకోసం నిపుణులతో కూడా స్పెషల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి