iDreamPost

అసెంబ్లీకి ముందే మంత్రివర్గ సమావేశం.. మండలి రద్దు ఖాయమేనా..?

అసెంబ్లీకి ముందే మంత్రివర్గ సమావేశం.. మండలి రద్దు ఖాయమేనా..?

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి రద్దు ఖాయమేనన్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. నిన్న గురువారం అసెంబ్లీ సమావేశంలో మండలి ఉంచాలా..? వద్దా..? అనే అంశంపై సోమవారం చర్చిద్దామని ప్రకటించిన వైఎస్‌ జగన్‌ ఆ దిశగా ముందుకెళుతున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారంటే… శాసన మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే ప్రచారం సాగుతోంది. మండలి భవితవ్యంపై చర్చ సాగించిన తర్వాత రద్దుకు సంబంధించిన మంత్రివర్గ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై సాగదీత లేకుండా వేగంగా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే శాసన సభ ప్రారంభానికి ముందే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి సభలో ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొంటున్నారు.

కాగా, చంద్రబాబు కూడా మండలి రద్దుపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రోజు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు మండలి రద్దు చేస్తే.. తాము వచ్చాక మళ్లీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీలు ఎవరూ అధైర్యపడొద్దంటూ.. మండలి రద్దుకు సంబంధించి తన పార్టీ ఎమ్మెల్సీలను మానసికంగా సిద్ధం చేసినట్లుగా అర్థమవుతోంది. మొత్తం మీద సోమవారం మండలి భవిష్యత్‌ తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి