iDreamPost

బుచ్చయ్య చౌదరి గారూ మీరు కూడానా?!

బుచ్చయ్య చౌదరి గారూ మీరు కూడానా?!

ట్విట్టర్ చాలా మంది నాయకులు, సెలబ్రిటీలు తమ అభిమానులతో అనుసంధానం కావడానికి ఉపయోగపడుతోంది. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ట్విట్టర్ అకౌంట్లకి లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నరేంద్ర మోడీ తను ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండటమే కాక తన సహచరులను కూడా ట్విట్టర్ లో చురుగ్గా ఉండమని ప్రోత్సహించారు.

కొన్ని సందర్భాల్లో ట్విట్టర్ నిజంగానే ఉపయోగకరం అయింది. ట్రెయిన్ బోగీలో ఒంటరిగా ఉన్న మహిళ కొంతమంది ఆకతాయిలు ఆ బోగీలో ఎక్కి తనను వేధిస్తుంటే, ఆ సంగతి రైల్వే శాఖ మంత్రికి ట్వీట్ చేయగానే పక్క స్టేషన్ లో రైల్వే పోలీసులు వచ్చి కాపాడడం, నడవలేని తల్లిని ట్రెయిన్ బోగీ వరకూ తీసుకురావడానికి స్టేషన్ లో వీల్ ఛెయిర్ లేదని ఒక ప్రయాణికుడు ట్వీట్ చేయగానే వాళ్లు దిగాల్సిన స్టేషన్ లో బోగీ దగ్గర వీల్ ఛెయిర్ సిద్ధంగా ఉండడం లాంటి సంఘటనలు చదివినప్పుడు ట్విట్టర్ చాలా ఉపయోగకరం అనిపిస్తుంది.

మన రాష్ట్రంలో ట్విట్టర్ అనగానే గుర్తొచ్చే రెండు పేర్లు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్. బయట జనంలో కన్నా ట్విట్టర్ లోనే ఎక్కువ సమయం గడుపుతారని వీరిద్దరి మీద ఒక అపప్రధ ఉంది. అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాక పవన్ కల్యాణ్ ప్రజల మధ్య ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టారు. అయితే ఎన్నికల్లో పరాజయం తర్వాత తన దృష్టి సినిమా వైపు మళ్ళించారు.

అయితే తమకు, ఈ రాష్ట్రానికి కాబోయే నేత అని తెలుగుదేశం కార్యకర్తలు భావించే లోకేష్ బాబు మాత్రం ట్విట్టర్ వదిలి ప్రజల్లోకి రాలేకపోతున్నారు. ఆమధ్య అమరావతిలో రెండు రోజులు జోలె పట్టడం మినహా ఆ పోరాటంలో ఎక్కువగా కనిపించలేదు లోకేష్. పార్టీకి చెందిన నాయకుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరవడం, ఆ ఫోటోలు ట్వీట్ చేయడం మినహా పెద్దగా ప్రజల్లోకి రావడం లేదు.

ప్రత్యర్ధుల మీద నిప్పులు చెరిగినా, కుంభకోణంలో ఇరుక్కున్న అచ్చన్నాయుడు లాంటి వారికి మద్దతు తెలిపినా అన్నీ ట్విట్టర్ లోనే చేస్తున్నారు.

ఈ ట్విట్టర్ పక్షుల జాబితాలో ఇప్పుడు మరో తెలుగుదేశం నాయకుడు చేరాడు. ఆయనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తన స్థాయికి ఏమాత్రం తగని రీతిలో, జీతానికి పనిచేసే సోషల్ మీడియా వాలంటీర్ల లాగా ప్రత్యర్థుల మీద వెటకారం ట్వీట్లు, ఆధారం లేని ఆరోపణలు చేస్తూ పలుచన అయిపోతున్నారు.

తాజాగా విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఉండడానికి తూర్పు నావికాదళం అభ్యంతరం చెప్పిందనీ, సచివాలయం విశాఖలో ఉండే వీల్లేదని ఆయన పెట్టిన ట్వీట్ అలాంటిదే. విశాఖలో రాజధాని తమకు ఆమోదయోగ్యం కాదని భారత నావికాదళం అభ్యంతరం చెప్పిందని ఒక ఇంగ్లీషు పత్రిక ప్రచురించిన గాలివార్త ఆధారంగా తెలుగుదేశం నాయకుడు బోండా ఉమ పత్రికా సమావేశం పెట్టి రాజధాని విభజన జరగదని చెప్పడం, ఆ విషయాన్ని బుచ్చయ్య గారు ట్వీట్ చేస్తూ ఉండగానే తాము అభ్యంతరం చెప్పినట్లు వచ్చిన వార్తలు ఆబద్ధం అని, విశాఖపట్నంలో రాజధాని పెట్టినా, మిలీనియం టవర్లో సచివాలయం పెట్టినా తమకెటువంటి అభ్యంతరము లేదని విశాఖలోని తూర్పు నావికాదళం అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు.

ఈ అయిదు సంవత్సరాలు ప్రజల్లోకి వచ్చి చేసే పని ఏమీ లేదని, ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనా లేకపోతే ట్విట్టర్ దాటి బయటకు రాకపోతే కలీగే నష్టం ఏమీ లేదు కానీ బుచ్చయ్య చౌదరి లాంటి నాయకుడు తన స్థాయికి తగిన ట్వీట్లు పెడుతూ ఉంటే తన రాజకీయ జీవితం చివరి రోజులలో ప్రజల్లో పలుచన కాకుండా ఉంటారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి