iDreamPost

బాక్సాఫీస్ వద్ద సింహాల పోటీ – Nostalgia

బాక్సాఫీస్ వద్ద సింహాల పోటీ – Nostalgia

బాక్సాఫీస్ వద్ద సినిమాలు ఢీ కొనడం కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. కాకపోతే కొన్నిసార్లు బయట జరిగే ప్రచారాలు హీరోల మధ్య అపార్థాలకు దారి తీస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇవి ఊహించని దూరానికి కారణమవుతాయి. సమయానికి చాకచక్యంగా వ్యవహరించి బయట పడ్డామా కథ సుఖాంతమవుతుంది. అలాంటిదే ఈ సంఘటన. 1978 సంవత్సరం. నందమూరి తారకరామారావు హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో డివిఎస్ రాజు ఇప్పటి బాహుబలి రేంజ్ లో భారీ బడ్జెట్ తో ‘సింహబలుడు’ టైటిల్ తో సినిమా తీస్తున్నారు. ‘అడవి రాముడు’ కాంబినేషన్ లో జానపదం కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఎన్నో సెట్లు కూడా వేశారు.

మరోవైపు నటుడు గిరిబాబు నిర్మాతగా తన మొదటి ప్రయత్నం ‘దేవతలారా దీవించండి’ ఘనవిజయం సాధించడంతో అదే దర్శకుడు కొమ్మినేనితో ‘సింహగర్జన’ మొదలుపెట్టారు. సూపర్ స్టార్ కృష్ణ మెయిన్ హీరో కాగా రెండో కథానాయకుడిగా గిరిబాబు ఫిక్స్ అయ్యారు. ఇదీ జానపదమే. లతను హీరోయిన్ గా ఎంచుకున్నారు. చక్రవర్తి సంగీతంలో జంధ్యాల రచనలో దీని షూటింగ్ కూడా సింహబలుడుకి సమాంతరంగా జరుగుతోంది. ఈలోగా గిరిబాబు కావాలనే ఎన్టీఆర్ కు పోటీగా అదే కథతో సినిమా తీస్తున్నాడనే పుకారు లేవదీశారు కొందరు ఇండస్ట్రీ జనాలు. ఇది కాస్తా మీడియాలో రావడంతో వివాదంగా మారే సూచనలు కనిపించాయి

దీంతో అలెర్ట్ అయిపోయిన  గిరిబాబు వెంటనే ఎన్టీఆర్ అపాయింట్ మెంట్ తీసుకుని పర్సనల్ గా కలుసుకున్నారు. అప్పటికే కృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య అల్లూరి సీతారామరాజు విషయంగా విభేదాలు ఉన్నాయి. దానవీరశూరకర్ణ-కురుక్షేతం క్లాష్ తో అవి పతాక స్థాయికి చేరుకున్నాయి. అందుకే ఇది ఎక్కడికో వెళ్తుందని గుర్తించిన గిరిబాబు సింహగర్జన కథ మొత్తాన్ని అన్నగారికి పావుగంటలో వివరించారు. ఆసాంతం విన్న ఎన్టీఆర్ అసలు పోలికే లేదని అభయమివ్వడంతో హమ్మయ్య అనుకున్నారు. అయినా కూడా పోటాపోటీ నిర్మాణం తప్పలేదు. 1978 ఆగస్ట్ 11న సింహబలుడు రిలీజ్ కాగా అదే నెల 25న సింహగర్జన విడుదలయ్యింది. అయితే అనూహ్యంగా అన్నగారి సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే సింహగర్జన ఊహించిన దానికన్నా పెద్ద విజయం అందుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి