iDreamPost

టీడీపీ ఎమ్మెల్సీలకు బీజేపీ గాలం.. ?

టీడీపీ ఎమ్మెల్సీలకు బీజేపీ గాలం.. ?

ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న బీజేపీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ మేరకు విజయవంతం అయినా.. కాకపోయినా ప్రయత్నాలు మాత్రం చేస్తోంది. తాజాగా ఏపీలో శాసన మండలి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. శాసన మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. శాసన సభ పంపిన ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి బిల్లు మండలి ముందుకు వచ్చింది. ఇది సాధారణ బిల్లు కావడంతో మండలి ఆమోదం తప్పనిసరైంది.

బిల్లుకు చట్టరూపం తీసుకొచ్చి, మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వైఎస్సార్‌సీపీకి ఎంతో ప్రతిష్టాత్మకం. మండలి అడ్డుగా ఉంటే.. దాన్ని రద్దు చేసేందుకు కూడా వెనుకాడడంలేదనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిన్న తొలి రోజు జరిగిన సమావేశంలో టీడీపీ ప్రవేశపెట్టిన రూల్‌ 71కి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీలు ఇద్దరు ఓటు వేశారు. మరో సభ్యుడు బయటకు వెళ్లిపోయారు.

శాసన మండలి రద్దు చేస్తే తమ పదవులు పోయి రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతామన్న ఆందోళనలో టీడీపీ సభ్యులున్నారు. ఒకవేళ వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమైనా కూడా రాజీనామా చేసి రావాలన్న నిబంధనను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ కుట్టుబడి ఉన్నారు. ఒక వేళ రాజీనామా చేసి వెళ్లినా వైఎస్సార్‌సీపీలో తమకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందన్నది అనుమానంగా ఉంది. మళ్లీ ఎమ్మెల్సీ టికెట్‌ ఇస్తారా..? తమ సొంత నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమతో సఖ్యతగా ఉంటారా..? అన్న సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితి టీడీపీ ఎమ్మెల్సీలకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి మాదిరిగా తయారైంది.

ఈ పరిస్థితిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా 27 మంది సభ్యుల్లో కనీసం 12 మంది ఎమ్మెల్సీలకు గాలం వేయాలని చూస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. 12 మంది ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తే.. బిల్లుకు వ్యతిరేకంగా బీజేపీ తరఫున ఓటు వేద్దామని వారికి చెబుతున్నట్లు సమాచారం. ఒక వేళ వైఎస్సార్‌సీపీ సర్కార్‌ శాసన మండలిని రద్దు చేస్తే.. ఆ నిర్ణయాన్ని పార్లమెంట్‌లో అడ్డుకుంటామని వారికి బీజేపీ హామీ ఇస్తోంది.

శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే శాసన మండలి రద్దు అవుతుంది. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ విషయాన్ని చెబుతూ టీడీపీలోని 12 మంది ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఒక వేళ తమ పార్టీలోకి రాకపోతే బిల్లుకు టీడీపీ తరఫున ఓటు వేయక తప్పదు. అప్పుడు జగన్‌ సర్కార్‌ శాసన మండలిని రద్దు చేస్తూ పార్లమెంట్‌కు తీర్మానాన్ని పంపుతుంది. ఆ తీర్మానాన్ని పార్లమెంట్‌ ఆమోదిస్తుందని వారికి సంకేతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్సీల పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుని నయానో భయానో వారిని తమ పార్టీలోకి చేర్చుకోవాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతుండడం రాజకీయంగా చర్చనీయాంశంమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి