iDreamPost

బయటపడుతున్న బీజేపీలో లుకలుకల, గ్రేటర్ ఆశలు గల్లంతవుతాయా

బయటపడుతున్న బీజేపీలో లుకలుకల, గ్రేటర్ ఆశలు గల్లంతవుతాయా

దుబ్బాక బై పోల్స్ తర్వాత బీజేపీ భవితవ్యం మారినట్టేనని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అనూహ్య విజయంతో తెలంగాణాలో పాగా వేసే అవకాశం దక్కిందని భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే గ్రేటర్ ఎన్నికలపై బలమైన ఆశతో సాగుతున్నారు. దానికి తగ్గట్టుగా కీలక నేతలంతా రంగంలో దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో దుబ్బాక నుంచి గెలిచిన రఘునందన్ రావు, మొన్నటి వరకూ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ వంటి వారు ప్రధాన పాత్ర పోషించబోతున్నారు

తీరా అభ్యర్థుల ఎంపిక విషయంలోనే నేతల మధ్య సఖ్యత కనిపించలేదు. బీ ఫారం పంపిణీలో విబేధాలు బయటపడ్డాయి. కీలక నేతల మధ్య లుకలుకలు పార్టీలో అనైక్యతను ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఇప్పటికే కూకట్ పల్లి, గోషా మహాల్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల్లో కుర్చీలు గాలిలో లేచాయి. వాటన్నింటికీ పరాకాష్టగా ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి ఆడియో కలకలం రేపుతోంది. తన ప్రధాన అనుచరుడికి కూడా న్యాయం చేయలేకపోయానని, బండి సంజయ్ అన్న తనకు అన్యాయం చేశారని రాజాసింగ్ వాపోవడం ఆసక్తికరంగా మారుతోంది. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్న ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కీలక ఎన్నికల సమయంలో కమలదళంలో విబేధాలు ఇలా బయటపడడంతో ఆపార్టీ విజయావకాశాల మీద ప్రభావం చూపుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఐక్యంగా టీఆర్ఎస్ ని ఎదుర్కొన్న దుబ్బాక ఫలితాలను చూసిన తర్వాతనైనా కలిసి సాగాల్సిన నేతలు ఈసారి కలహాలకు దిగడంతో జీహెచ్ఎంసీలో ఆశలు అడియాశలయ్యే ప్రమాదం ఉందని కార్యకర్తలు వాపోతున్నారు. ఉమ్మడిగా పట్టుబడితే రెండోస్థానానికి చేరుకోవడం ద్వారా కీలక సంకేతాలు ఇవ్వాలని ఆశిస్తున్న తరణంలో ఇలాంటి తగాదాలు తీవ్ర నష్టాన్ని చేస్తాయని కలత చెందుతున్నారు. ఏమయినా గ్రేటర్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ఫలితాలు సాదించాలని ఆశిస్తున్న బీజేపీకి తాజా పరిణామాలు మాత్రం గొంతులో వెలక్కాయపడ్డట్టుగా మారుతున్నట్టు చెప్పవచ్చు. ప్రచారానికి కూడా పరిమితకాలం మాత్రమే ఉన్న తరుణంలో అనైక్యతను సర్థుబాటు చేసుకోలేకపోతే ఆశలు నెరవేరే అవకాశాలు సన్నగిల్లుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి